CM Chandrababu: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో ఎస్ఐ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ABN, Publish Date - Sep 01 , 2024 | 10:37 AM
గుడ్లవల్లేరు కాలేజీ ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరాలు బిగించి వీడియోలు చిత్రీకరించారని విద్యార్థులు భగ్గుమన్నారు. రెండ్రోజుల పాటు ఆందోళనలు చేపట్టారు. అయితే.. కాలేజీలో బందోబస్తు కోసం వచ్చిన ఎస్ఐ శిరీష విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్థించారు. విద్యార్థులను ఒకింత బెదిరించినట్లు, బాధతో ఉన్న వారిపట్ల ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఇబ్బంది పెట్టారని ఎస్ఐపై ఆరోపణలు వచ్చాయి...
అమరావతి : గుడ్లవల్లేరు కాలేజీ ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరాలు బిగించి వీడియోలు చిత్రీకరించారని విద్యార్థులు భగ్గుమన్నారు. రెండ్రోజుల పాటు ఆందోళనలు చేపట్టారు. అయితే.. కాలేజీలో బందోబస్తు కోసం వచ్చిన ఎస్ఐ శిరీష విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్థించారు. విద్యార్థులను ఒకింత బెదిరించినట్లు, బాధతో ఉన్న వారిపట్ల ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఇబ్బంది పెట్టారని ఎస్ఐపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియోలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం నారా చంద్రబాబు.. ఎస్ఐ ఓవరాక్షన్‌కు రియాక్షన్ రుచి చూపించారు..!
అసలేం జరుగుతోంది..?
గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ శిరీష తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సెన్సిటివ్ కావడంతో స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు.. విచారణ వివరాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో బందోబస్తు కోసం అని వెళ్లిన ఎస్ఐ.. విద్యార్థులతో ఇష్టానుసారం మాట్లాడిన విషయం సీఎం దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే శిరీషను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విద్యార్థినుల ఆవేదన బాధను అర్థం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించకుండా.. వారితోనే దురుసుగా ప్రవర్తించడం ఏంటి..? అంటూ చంద్రబాబు కన్నెర్రజేశారు. బాధలో, ఆందోళనలో ఉన్న విద్యార్థులతో దురుసుగా వ్యవహరించడం కరెక్ట్ కాదని.. వారి బాధను అర్థం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించాలని శిరీషకు సీఎం క్లాస్ తీసుకున్నారు. దీంతో.. బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను అధికారులు వెనక్కు పంపారు. రహస్య కెమెరాల అంశంపై విచారణ జరుగుతోందని.. జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్నారని ప్రకటనలో సీఎంవో తెలిపింది. కాగా.. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సీఐ రమణమ్మను ఎస్పీ నియమించడం జరిగింది.
వివరణ ఇవ్వండి..
సీఐ వ్యవహారంపై తోటి అధికారులు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. శిరీష నేతృత్వంలో విచారణ జరుగుతుండగా బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారులను, సిబ్బందిని నియమించడం జరిగింది. ఈ సమయంలో కోడూరు ఎస్ఐ శిరీష విద్యార్ధినులతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వెలుగు చూసింది. ఆ పోలీసు అధికారి వ్యవహారం సీఎం దృష్టికి రావడంతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పోకడలను సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారలు నుంచి సీఎం వివరణ కోరారు. దర్యాప్తు బృందంలో ఎస్ఐ శిరీష లేరని.. బందోబస్తు కోసం పిలిపించామని అధికారులు వివరణ ఇచ్చారు. ఘటన అనంతరం ఎస్ఐను ఆ ప్రాంతంలో బందోబస్తు విధుల నుంచి ఇప్పటికే తప్పించామని అధికారులు తెలిపారు. ఘటనపై ఎస్ఐ నుంచి వివరణ తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని చంద్రబాబుకు అధికారుకులు వివరించారు. స్టూడెంట్స్ ఆవేదనను అర్థం చేసుకుని.. వారికి భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.
ఎస్ఐ ఏం చేశారు..?
గుడ్లవల్లేరులో విద్యార్థులను బెదిరించినట్లు ఎస్ఐ శిరీష ప్రవర్తించారు. విద్యార్థులు నిరసన చేయడంపై వార్నింగ్ ఇస్తూ మాట్లాడారు. ‘మేం చెప్తుంటే మీరెందుకు వినడంలేదు..?. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు ఇలా చేస్తున్నారు..?. ఎస్పీ అధికారి వచ్చి చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా..?. తిండి తిప్పలు లేకుండా పడి ఏడుస్తున్నాం. మీరు ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది’ అని విద్యార్థులనే ఎస్ఐ ఎదురు ప్రశ్నించారు. దీంతో ‘మీకు బాధ్యత లేదా..’ అని పోలీసులను విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థులపై శిరీష ఆగ్రహంతో ఊగిపోయారు. ‘వీడియో రికార్డ్ చేయడం నువ్వు చూశావా..?. మీ దగ్గర వీడియో ఉందా..? నువ్వు కళ్ళతో చూశావా..?. కళ్ళతో చూస్తేనే నమ్మాలి..? అక్కడ ఏం జరిగిందో నువ్వు చూశావా..?’ అంటూ విద్యార్థులను ఎస్ఐ ప్రశ్నించారు. వేలెత్తి మరీ చూపిస్తూ ఓవరాక్షన్ చేశారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఖాకీలు ఇలా చేస్తున్నారేంటి..? అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
Updated Date - Sep 01 , 2024 | 11:22 AM