ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : నాణ్యతలో రాజీపడం

ABN, Publish Date - Oct 06 , 2024 | 02:59 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ముడిసరుకుల కొనుగోళ్ల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు.

  • శ్రీవారి ప్రసాదాలపై భక్తుల సంతృప్తి

  • సరుకుల కొనుగోళ్లలో జాగ్రత్తలు

  • త్వరలో కొండపై అత్యాధునిక ల్యాబ్‌

  • నష్టం చేయాలని చూస్తే శిక్ష తప్పదు

  • అధికారులు తిరుమల పవిత్రత కాపాడాలి

  • వీఐపీ సంస్కృతి తగ్గాలి: చంద్రబాబు

  • వకుళమాత వంటశాల ప్రారంభించిన సీఎం

  • అంతకుముందు టీటీడీ అధికారులతో భేటీ

తిరుమల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ముడిసరుకుల కొనుగోళ్ల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. త్వరలో అత్యాధునిక ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి అన్నింటినీ క్షుణ్ణంగా పరీక్షించి, రికార్డు చేసే విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు. శనివారం ఉదయం తిరుమలలో టీటీడీ నిర్మించిన అధునాతనమైన వకుళమాత కేంద్రీకృత వంటశాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్నింటినీ శ్రీవారే చేయిస్తారు. మనం కేవలం నిమిత్తమాత్రులమే. ఆయన్ను తలుచుకుని ఏ పని చేపట్టినా సజావుగా జరుగుతుంది. నేను నిద్ర లేచినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయన్ను తలుచుకునే నిర్ణయాలు తీసుకుంటా. భక్తుల మనోభావాలను గౌరవించేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తాం. శ్రీవారికి పూర్వవైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం.

తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా తయారు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం. గతంలో నేనే శ్రీవారి సేవకులను ప్రవేశపెట్టా. ఇప్పుడు దాదాపు 15లక్షల మంది అయ్యారు. వాళ్లను ఆధ్యాత్మిక చింతనవైపు ఎలా తీసుకువెళ్లాలి, భక్తిభావన ఎలా పెంచాలనే ఆలోచనలు చేస్తున్నాం. వారి నిజ జీవితంలో కూడా దాన్ని ఆచరించాల్సిన అవసరమంది. దానికి కావాల్సిన శిక్షణ ఇస్తాం’ అని చంద్రబాబు అన్నారు.


  • 2-3 వేలమందితో మొదలై 3 లక్షలకు

‘గతంలో ఎన్టీ రామారావు తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు మూడు వేల మందితో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం ప్రస్తుతం మూడు కిచెన్లతో మూడు లక్షల మందికి భోజనం పెట్టే స్థాయికి ఎదిగింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పెద్దఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది. భక్తులు స్వామి ప్రసాదంతో పాటు అన్నాన్ని ప్రసాదంగానే భావిస్తారు. ఒకరోజు, ఒక పూట అన్నప్రసాదాలు అందించే దాతల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అందుతున్న ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతపై చాలామంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గతంతో పోలిస్తే ప్రసాదాలు, అధికారుల్లో మార్పు వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేకమంది భక్తులు పలు సందర్భాల్లో అన్నప్రసాదాలపై ఆందోళన చేపట్టినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం అన్నప్రసాదాల నాణ్యతలో మార్పు తీసుకువచ్చాం. పరిశుభ్రతలో మార్పు గమనించా. తిరుమల ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం. ఇది ఇలానే ఉండాలి. శ్రీవారు చాలా శక్తివంతమైన దేవుడు. ఆయనకు ఎవరూ నష్టం చేకూర్చలేరు. ఆయన్ను ఆయన కాపాడుకోగలరు. ఎవరైనా నష్టం చేయాలని చూస్తే శిక్ష నుంచి తప్పించుకోలేరు. స్వామి వైభవాన్ని వ్యాప్తి చేస్తూ పవిత్రతను కాపాడేలా మనం వ్యవహరించాలి. దానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని చంద్రబాబు అన్నారు.


  • లడ్డూను కాపీ కొట్టలేకపోయారు

‘శ్రీవారి లడ్డూను ప్రపంచంలో ఎవరూ కాపీ కొట్టలేకపోయారు. చాలామంది తయారు చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. స్వామి లడ్డూకు పేటెంట్‌ కూడా ఉంది. పవిత్రమైన లడ్డూ, జిలేబీ, వడ... ఇలా ప్రతిదానికీ ప్రత్యేకత ఉంది. వీటిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటాం. లడ్డూకే కాకుండా ముడిసరుకులను పరీక్షించడానికి ఐఐటీ నిపుణుల సలహాలతో ల్యాబ్‌ ఏర్పాటు చేస్తాం. దీనిపై ఇప్పటికే అధికారులకు కొన్ని సూచనలు చేశాను’ అని చంద్రబాబు అన్నారు.

  • తిరుమల పవిత్రత కాపాడండి

తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని, ప్రశాంతత విషయంలో ఎక్కడా భంగం కలగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. తిరుమల కొండపై గోవిందనామం తప్ప మరొక మాట వినిపించకూడదన్నారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, ఇది ఎల్లప్పుడూ కొనసాగాలన్నారు. అత్యుత్తమ పదార్థాలు మాత్రమే ప్రసాదాల తయారీకి వినియోగించాలన్నారు. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలన్నారు.

అటవీప్రాంతాన్ని 72 శాతం నుంచి 90 శాతానికి పెంచాలని సూచించారు. బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీయడంతో పాటు పలు సూచనలు చేశారు. తిరుమలకు వచ్చిన భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లోనూ భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని మంత్రికి సూచించారు. ‘తిరుమలలో వీఐపీల సంస్కృతి బాగా తగ్గాలి.


ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. సింపుల్‌గా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి. ఆర్భాటం, అనవసర వ్యయం ఉండకూడదు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులతో టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలి. ఎక్కడా దురుసు ప్రవర్తన కనిపించకూడదు. తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తితో, ప్రత్యేక అనుభూతులతో తిరిగి వెళ్లాలి. తిరుమల పేరు తలిస్తే ఏడు కొండలస్వామి వైభవం, ఆధ్యాత్మికత మాత్రమే చర్చకు రావాలి. తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రి సేవలు కూడా మెరుగుపరచాలి. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ మరింత చేయాలి. భక్తులకు మంచి సేవలు అందించాలి’ అని చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


  • 1.25 లక్షల మందికి అన్నప్రసాదాలు

తిరుమలలోని పాంచజన్యం విశ్రాం తి భవనం వెనుక భాగంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కనే టీటీడీ నిర్మించిన అధునాతనమైన వకుళమాత కేంద్రీకృత వంటశాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ వంటశాలను టీటీడీ రూ.13.45 కోట్లతో నిర్మించింది. 37,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు, ఆహార తయారీ, ఆవిరి ఆధారిత వంట ఎల్పీజీ ద్వారా నడిచే బాయిలర్లు, ఒక ఎగ్జాస్ట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం సీఎం చంద్రబాబు నుదుట తిరునామం ధరించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాయిలర్‌లో బియ్యాన్ని వేసి ప్రసాదాల తయారీని ప్రారంభించారు. అనంతరం అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కిచెన్‌ ద్వారా రోజుకు 1.25 లక్షల మందికి పులిహోర, సాంబార్‌ రైస్‌, పొంగల్‌, ఉప్మా వంటి అన్నప్రసాదాలు తయారీ చేసే అవకాశం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. 30 నిమిషాల్లో 18 వేల మందికి ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చన్నారు. దీంతో వెంగమాంబ, అక్షయతో కలిపి టీటీడీకి మూడు కిచెన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటి ద్వారా దాదాపు 3 లక్షల మందికి ఏ సమయంలోనైనా అన్నప్రసాదాలు సిద్ధం చేసుకోవచ్చన్నారు.

Updated Date - Oct 06 , 2024 | 03:04 AM