CM Chandrababu : మాఫియా భరతం పడతా!
ABN, Publish Date - Dec 01 , 2024 | 03:43 AM
గత ఐదేళ్లలో భూ మాఫియా, గంజాయి మాఫియా పేట్రేగిపోయాయని.. వాటికి అడ్డుకట్టవేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తా: చంద్రబాబు
భూ కబ్జాలు, గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు
మద్యంలో నేతలు జోక్యం చేసుకుంటే వదలం
ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం
రాయలసీమను రతనాలసీమగా మారుస్తాం
5 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు
2047 నాటికి రాష్ట్రం నంబర్ వన్
జనాభా పెంచండి.. అదే మన ఆస్తి: సీఎం
‘అనంత’ నేమకల్లులో పింఛన్లు పంచిన బాబు
జగన్ పాలనలో భూ రికార్డులు తారుమారు చేశారు. ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్టు పేరుతో భూ కబ్జాలు చేసి ఇష్టానుసారంగా రికార్డులు మార్చేశారు. మాకు అందుతున్న ఫిర్యాదుల్లో సగం భూ సమస్యలే. దీనిని బట్టే భూ బకాసురులు ఎంతలా చెలరేగిపోయారో అర్థమవుతోంది.
- సీఎం చంద్రబాబు
అనంతపురం నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో భూ మాఫియా, గంజాయి మాఫియా పేట్రేగిపోయాయని.. వాటికి అడ్డుకట్టవేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇక నుంచి ఎవరైనా భూ కబ్జాలు, గంజాయి పెంపకం, అమ్మకాలకు పాల్పడితే తాట తీస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ‘ప్రజా వేదిక-పేదల సేవలో’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో రుద్రమ్మ ఇంటికి వెళ్లి రూ.4 వేలు పింఛన్ సొమ్ము అందజేశారు. వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. సమస్యలడిగి తెలుసుకున్నారు. రుద్రమ్మకు ఇంటితోపాటు గొర్రెల యూనిట్‌ను మంజూరు చేయాలని కలెక్టర్‌ను అక్కడిక్కడే సీఎం ఆదేశించారు. తర్వాత అదే కాలనీలోని దివ్యాంగురాలు బోయ భాగ్యమ్మ ఇంటికి వెళ్లి, రూ.15 వేలు పింఛన్ సొమ్ము అందజేశారు. అనంతరం ప్రజావేదికలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూ మాఫియా, గంజాయి మాఫియా లేకుండా చేస్తామన్నారు. వారి భరతం పడతానని స్పష్టంచేశారు. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని.. ప్రజల భూములు కాపాడేందుకు యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకొచ్చామని చెప్పారు.
మద్యం దోపిడీకి అడ్డుకట్ట వేశామని.. ఎక్కడైనా బెల్టుషాపులు పెడితే బెల్టు తీస్తామని తేల్చిచెప్పారు. మద్యం జోలికి నాయకులెవరూ ఎవరూ వెళ్లకూడదని స్పష్టం చేశారు. తహశీల్దారు కార్యాలయాలు, ఆస్పత్రులనూ తాకట్టుపెట్టి రుణాలు తెచ్చారని.. ఇలా చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారని దుయ్యబట్టారు.
ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లండి..
ఇసుక ప్రకృతి ఇచ్చిన వరం. గత పాలకులు దీనిపైనా వ్యాపారం చేశారు. అక్రమంగా రూ.వేల కోట్లు సంపాదించుకున్నారు. మీ ఊర్లోని ఇసుకను ట్రాక్టర్‌తో మీరే తీసుకెళ్లండి. ఎవరైనా అడ్డువస్తే నా పేరు చెప్పండి. నిలదీయండి.. అవసరమైతే తాటతీస్తామని చెప్పండి. గంజాయి, డ్రగ్స్‌తో పిల్లలు ఏమైపోతారోనని భయం వేస్తోంది. గత ఐదేళ్లలో విశాఖను గంజాయి రాజధానిగా చేసి.. ఎక్కడ చూసినా గంజాయి పంట పండించారు. గంజాయి సాగుపై డ్రోన్స్ ద్వారా డేగ కన్ను పెట్టాం. ఎవడైనా గంజాయి పండించినా.. విక్రయించినా అదే వారికి చివరి రోజు అవుతుంది. ఖబడ్దార్! పేద వాళ్లకు అందించే రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు. అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
‘వైసీపీ ఐదేళ్ల పాలనలో ధ్వంసమైన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యాం. రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రు.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రతి నెలా సకాలంలో జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు రూ.లక్షల కోట్ల అప్పులున్నా.. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలిస్తున్నాం. పింఛన్ సొమ్మును రూ.4వేలకు పెంచి ప్రతి నెలా 1నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నాం. మహిళల కన్నీళ్లు తుడిచేందుకు ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే.. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. విజన్-2047 అమలు చేస్తున్నాం. 2047 వచ్చేనాటికి మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉంటుంది. ఇష్టానుసారంగా అప్పులు చేశారు. ఎన్ని పాపాలు చేయాలో అన్నీ చేశారు. అందుకే రాష్ట్రం దివాలా తీసింది. దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలోపెట్టి మళ్లీ రాష్ర్టాన్ని గట్టెక్కిస్తా.
ఫోన్ చేస్తా.. వాస్తవాలు చెప్పండి..
అన్ని సేవలూ మీకు అందిస్తాం. నేను ఫోన్ చేసి అడిగినప్పుడు మనస్సాక్షిగా వాస్తవాలు చెప్పండి. తప్పులు చెప్పొద్దు. ఒకవేళ అబద్ధాలు చెబితే నేను కనిపెడతా. కృత్రిమ మేధ (ఏఐ) వచ్చింది. నువ్వు వాస్తవం మాట్లాడుతున్నావా.. రాజకీయం మాట్లాడుతున్నావా... తేల్చేస్తుంది. ధాన్యం సేకరణకు సంబంధించి వాట్సా్‌పలో మెసేజ్ పెడితే ధాన్యం కొనుగోలు చేసి, 48 గంటల్లో వారికి ఇవ్వాల్సిన డబ్బులు అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తాం. ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అందజేస్తాం. కుటుంబంలో భర్తను కోల్పోయిన వారికి తక్షణమే పింఛన్ అందించేలా చర్యలు తీసుకుంటాం. అధికారులు పింఛన్ పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు.
రాష్ట్రన్ని గుంతల మయం చేశారు
వైసీపీ పాలకులు రాష్ర్టాన్ని గుంతలమయం చేసి పోయారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టాం. సంక్రాంతిలోగా ఆ పనుల పూర్తికి కృషి చేస్తున్నాం. సీమను రతనాల సీమగా మార్చే బాధ్యత మాది. హార్టికల్చర్ హాబ్‌గా తీర్చిదిద్దుతాం. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే. జనాభాను మనం పెంచుకోవాలి.. జనాభానే మన ఆస్తి. బీసీలకు పుట్టినిల్లు టీడీపీయే. వారికి న్యాయం చేసే బాధ్యత మాది అంటూనే వివిధ వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు వివరించారు.
ఇంకా ఎన్నికల వేడి తగ్గలేదు..:!
చంద్రబాబు ఇందిరమ్మ కాలనీ నుంచి కాలినడకన ఆంజనేయ స్వామి ఆలయం, ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించి, వారితో ఫోటోలు దిగారు. ‘చంద్రన్నా... టీవీలో మిమ్మల్ని చూశాం. ఇప్పుడు నేరుగా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని మహిళలు అన్నారు. నేమకల్లు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యుల పేరిట అర్చన చేయించారు. ఆలయ పండితులు ప్రత్యేక పూజలు చేసి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. శాలువా కప్పి, పూల మాల వేసి సన్మానించారు. నేమకల్లు ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. అక్కడి నుంచి ప్రజావేదికకు చేరుకున్న చంద్రబాబు.. ‘తమ్ముళ్లూ.. హుషారుగా ఉన్నారా..? ఆడబిడ్డలూ బాగున్నారా’ అని ఆప్యాయంగా పలకరించారు. ‘మీ ఉత్సాహం చూస్తుంటే ఇంకా ఎన్నికల వేడి తగ్గలేదనిపిస్తోంది. మీకున్న ఈ ఉత్సాహం... ఆనందం.. ఈ జోష్ భవిష్యత్‌లో శాశ్వతంగా ఉండేలా పనిచేస్తున్నాను’ అని అన్నారు. నేను రాజకీయాల్లో 45 సంవత్సరాలుగా ఉన్నాను. ఎన్నడూ ఇవ్వనంత గెలుపును ప్రజలు ఇచ్చారు.
బాబు వచ్చాడు.. జాబ్ గ్యారెంటీ!
వచ్చే 5 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు
‘బాబు వస్తే.. జాబు వస్తుందని చాలా సార్లు చెప్పాను. మా తమ్ముళ్లు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అందుకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తాం. ఒకప్పుడు ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాను. 5 నెలల్లో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడితో 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. నైబర్‌హుడ్ పద్ధతి తీసుకొస్తున్నాం. సెల్ ఫోన్ ద్వారా పని నేర్చుకుని డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తాం. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం. వర్క్‌ఫ్రం హోం ద్వారా పనులు కల్పించేందుకు చొరవ చూపుతాం. ఆడ బిడ్డలు ఇంట్లో ఉంటూనే ఐదారు గంటలు పనిచేయగలితే డబ్బులు సంపాదించే పనులకు శ్రీకారం చుడతాం. సీఎంగా బా ధ్యతలు తీసుకున్న వెంటనే నేను చేసిన 5 సంతకాల్లో మెగా డీఎస్సీ ఫైలు ఉంది. త్వరలో పిల్లందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటా.
Updated Date - Dec 01 , 2024 | 03:44 AM