ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tender Manipulation : టెండర్‌.. రీటెండర్‌!

ABN, Publish Date - Dec 29 , 2024 | 05:37 AM

రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో అతిపెద్దదైన స్టేజ్‌-1 ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టు టెండర్ల ప్రక్రియలో ఎన్నెన్నో సిత్రాలు వెలుగుచూస్తున్నాయి.

  • పౌరసరఫరాల కార్పొరేషన్‌లో సిత్రాలు

  • స్టేజ్‌-1 ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టుకు 4 నెలల్లో రెండోసారి టెండర్‌

  • ఒకే నంబరు.. అవే నిబంధనలతో మళ్లీ నోటిఫికేషన్‌

  • ప్లాట్‌ఫాం మార్పుపై అనుమానాలు.. 22 జిల్లాలకు కుదింపు

  • టెండర్ల కాలక్షేపంతో పాత కాంట్రాక్టర్లకు రూ.కోట్లలో బిల్లులు

  • కమీషన్ల కక్కుర్తితోనే అంటూ అధికారులపై ఆరోపణలు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో అతిపెద్దదైన స్టేజ్‌-1 ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టు టెండర్ల ప్రక్రియలో ఎన్నెన్నో సిత్రాలు వెలుగుచూస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే టెండర్లను కావలసినవారికి కట్టబెట్టేందుకు పౌరసరఫరాల కార్పొరేషన్‌లో టెండర్లాట రసవత్తరంగా నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో టెండర్ల వ్యవహారాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పౌరసరఫరాల కార్పొరేషన్‌ అధికారులు ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. అధికారుల పనితీరులో మార్పు కనిపించడం లేదు. ‘టెండర్ల ప్రక్రియలో రూల్సూ గీల్సూ జాన్తా నై. భారీ మొత్తాల్లో కమీషన్లు, నెలవారీ మామూళ్లు ఇచ్చేవారికే జైజై’ అన్నట్టు వ్యవహరిస్తున్నారని టెండరుదారులు ఆరోపిస్తున్నారు. స్టేజ్‌-1 ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో తెరవెనుక జరుగుతున్న వ్యవహారాలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.


వైసీపీ కాంట్రాక్టర్లతో పెనవేసుకున్న అనుబంధం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులకు ప్రతినెలా ఉచిత బియ్యం, సబ్సిడీ ధరలపై పంచదార, కందిపప్పు తదితర సరుకులను పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా సరఫరా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోని బఫర్‌ గోడౌన్లు, ఎఫ్‌సీఐ, ఇతర ప్రైవేటు గోడౌన్ల నుంచి మండల కేంద్రాల్లోని గోడౌన్ల(మండల స్థాయి స్టాక్‌ పాయింట్లు)కు పీడీఎస్‌ బియ్యం, ఇతర సరుకులను రవాణా చేసేందుకు రెండేళ్ల కాల వ్యవధితో జిల్లాలవారీగా టెండర్లు పిలుస్తున్నారు. గత ఐదేళ్లూ వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లే స్టేజ్‌-1 టెండర్లు దక్కించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో చివరిసారిగా పిలిచిన టెండర్ల కాలపరిమితి గతేడాది ఫిబ్రవరితోనే ముగిసిపోవడంతో కార్పొరేషన్‌ అధికారులు కొత్తగా టెండర్లు పిలిచారు. అయితే ఆ టెండరు డాక్యుమెంటులో కొన్ని పాయింట్లను తప్పులుగా చూపిస్తూ పాత టెండరుదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వడంతో కొంతకాలం పాత టెండరు ప్రకారమే స్టేజ్‌-1 ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టును కొనసాగించి.. ఒక్కొక్క కాంట్రాక్టరుకు ప్రతి నెలా రూ.కోట్లలో బిల్లులు చెల్లించారు. గత ఐదేళ్లుగా పాత టెండరుదారులతో ఏర్పడిన విడదీయరాని అనుబంధంతో పౌరసరఫరాల అధికారులే తెరవెనుక ఉండి ఈ స్టే కథ నడిపించారనే ఆరోపణలున్నాయి. పాత టెండరు పొడిగింపు కుదరదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో అధికారులు మరో ఎత్తుగడ వేశారు. స్టేజ్‌-1 ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టు కోసం జిల్లాల వారీగా టెండర్లు పిలవడం.. ఆ తర్వాత జరిగే ప్రక్రియలో లేనిపోని కారణాలను చూపిస్తూ టెండర్లను అర్థంతరంగా నిలిపివేయడం.. మళ్లీ రీటెండర్లు పిలవడం... ఇలా గత 8 నెలలుగా కాలం గడుపుతూ వస్తున్నారు. అధికారికంగా టెండర్లు ఖరారు కాకపోవడంతో రేషన్‌ బియ్యం, ఇతర సరుకులను డిపార్ట్‌మెంటల్‌ మూవ్‌మెంట్‌ పేరుతో ఆయా జిల్లాల్లో వైసీపీకి చెందిన పాత కాంట్రాక్టర్ల ద్వారానే రవాణా చేయిస్తూ ప్రతినెలా రూ.కోట్లలో బిల్లులు దోచిపెడుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా కాంట్రాక్టర్ల నుంచి పెద్దమొత్తంలో కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ఒకే నెంబరు.. అవే నిబంధనలతో రెండోసారి..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పౌరసరఫరాల సంస్థ అధికారులు తమ పంథాను మార్చుకోవడం లేదు. జిల్లాలవారీగా స్టేజ్‌-1 ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టుల కోసం గత ఆగస్టు 13న ఎల్‌ఆర్‌ నెం: పీడీఎ్‌స.3/18/2755/2024-28తో టెండరు నోటీసు ఇచ్చారు. దీనిద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాలకు రెండేళ్ల కాలపరిమితితో విడివిడిగా టెండర్లు పిలిచారు. ఒక్కొక్క జిల్లాలో టెండరు విలువ దాదాపు రూ.15 కోట్లు. దీంతో పాత, కొత్త కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎలాంటి కారణాలూ చెప్పకుండానే టెండర్లను రద్దు చేసేశారు. డిపార్ట్‌మెంటల్‌ మూవ్‌మెంట్‌ పేరుతో పాత కాంట్రాక్టర్లతోనే పీడీఎస్‌ బియ్యం, ఇతర సరుకులను రవాణా చేయిస్తూ ప్రతినెలా వారికి యథావిధిగా రూ.కోట్లలో బిల్లులు చెల్లిస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఈనెల 13న తాజా టెండరు నోటీసులు ఇచ్చారు. సాధారణంగా తొలిసారి పిలిచిన టెండర్‌ నోటీసులో నిబంధనలు మార్చాల్సి వచ్చినప్పుడు దానిని రద్దు చేసి మరోసారి కొత్తగా టెండరు పిలుస్తారు. దానిని ‘సెకండ్‌ కాల్‌’ అని పేర్కొనాలి. కానీ, పౌరసరఫరాల కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టరు గత ఆగస్టులో ఇచ్చిన టెండరు నోటీసునే.. కనీసం టెండరు నెంబరు కూడా మార్చకుండా అదే నెంబరు.. అవే నిబంధనలతో తాజా టెండరు నోటిఫికేషన్‌ జారీ చేశారు. కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేయడానికి ఈనెల 27ను ఆఖరు తేదీగా పేర్కొన్నారు. అయితే రెండోసారి ఇచ్చిన టెండర్‌ నోటీసులో 26 జిల్లాలకు బదులు 22 జిల్లాలకు కుదించారు. పైగాముందు ఇచ్చిన టెండరులో గవర్నమెంట్‌ ఈ-మార్కెట్‌ ప్లేస్‌(జీఈఎం) ప్లాట్‌ఫాం ద్వారా టెండరుదారులు బిడ్లు వేయాలని పేర్కొనగా.. రెండో టెండరు నోటీసులో ఎన్‌ఈఎంఎల్‌(ఎన్సీడెక్స్‌ ఈ-మార్కెట్స్‌ లిమిటెడ్‌) ప్లాట్‌ఫాం ద్వారా టెండర్లు ఆహ్వానించారు. నిబంధనలు మార్చకుండా పదేపదే ఒకేలా టెండరు పిలవడం, ప్లాట్‌ఫారాలను మార్చడం వెనుక మతలబు ఏమిటి? ఎవరికి మేలు చేయడానికనే ప్రశ్నలకు కార్పొరేషన్‌ అధికారులే సమాధానాలు చెప్పాలి. పాత కాంట్రాక్టర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించేలా అవకాశం కల్పించడానికి కావాలనే తప్పుల తడకలతో టెండరు నోటీసులు జారీ చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ గుడుపుఠానీ గురించి తెలియని కొంతమంది కొత్త కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు తక్కువ మొత్తాలను కోట్‌ చేసి టెండర్లు వేస్తున్నారు.


కొత్తవారికి అడ్డంకులు.. బెదిరింపులు

కొత్త కాంట్రాక్టర్లకు టెండర్లు దక్కడం ఇష్టంలేని అధికారులు సహేతుకమైన కారణాలు చెప్పకుండా ఏకంగా టెండర్లనే రద్దు చేసేస్తుండం గమనార్హం. భవిష్యత్తులోనూ కొత్త కాంట్రాక్టర్లు టెండర్లు వేసే సాహసం చేయకూడదనేలా వారికి చుక్కలు చూపిస్తున్నారు. కార్పొరేషన్‌లో పాతుకుపోయిన పాత కాంట్రాక్టర్లకే మళ్లీ మళ్లీ టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. తెరవెనుక గోల్‌మాల్‌ వ్యవహారాలను నడిపిస్తూ కొత్తవారిని అడ్డుకునేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో టెండర్లు వేసిన కొత్త కాంట్రాక్టర్లకు పాత కాంట్రాక్టర్ల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు చెబుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని స్టేజ్‌-1 రవాణా కాంట్రాక్టును నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 05:37 AM