CPI D Raja: ఫర్ ది పీపుల్, బై ది పీపుల్‍కు స్వస్తి పలికిన పాలకులు
ABN, Publish Date - Dec 17 , 2024 | 11:39 AM
డిసెంబర్ 26వ తేదీన సీపీఐ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది ఛండీగఢ్‍లో సీపీఐ జాతీయ మహా సభలు నిర్వహిస్తామన్నారు. శత వసంతాల ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాల్లో సీపీఐ కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు.
విజయవాడ, డిసెంబర్ 17: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కుల, మతాల విభజన ఆధారంగా దేశంలో పాలన చేస్తోందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా విమర్శించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారన్నారు. అయినా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు, జేడీ (యూ) అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ సహకారంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సిపిఐ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు మంగళారం విజయవాడకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‍కు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని ఆరోపించారు. అయినా సీఎం చంద్రబాబు వారికే మద్దతు ఇచ్చారని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలకు అనుగుణంగా చంద్రబాబు పని చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు ఇతర ప్రాజెక్టులను సైతం ఇవ్వాలని ఈ సందర్బంగా ప్రధాని మోదీని డి. రాజా డిమాండ్ చేశారు.
Also Read: ట్రైయినీ వైద్యురాలి ఘటనలో ఏం జరిగిందో..?
మోదీ రాజ్యాంగం అమలు..
దేశంలో బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా మోడీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‍లు.. సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నాయన్నారు. ఇక ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అనే విధానాలకు నేటి పాలకులు స్వస్తి పలికారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆదేశాలను అమలు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం పని చేస్తుందని ఆరోపించారు. పూర్తి పారదర్శకంగా పని చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ సందర్భంగా ఆయన సూచించారు.
Also Read: మహిళామణులకు గుడ్ న్యూస్ .. మళ్లీ తగ్గిన పసిడి ధర
అదానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ వివిధ రూపాల్లో వేలాది కోట్ల రూపాయల అవినీతి చేశారని విమర్శించారు. దీనిపై విచారణ జరిపి అదానీని ప్రధాని మోడీ ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ప్ర్నశ్నించారు. ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పాలకులు కాలరాయడం ఏ మాత్రం సరికాదని ఈ సందర్భంగా డి. రాజా అభిప్రాయపడ్డారు.
Also Read: బైడెన్ నిర్ణయంపై ట్రంప్ అభ్యంతరం
జమిలి ఎన్నికలు సాధ్యం కాదు..
ఒక దేశం.. ఒక ఎన్నిక అనేది ఆచరణ సాధ్యం కాదని డి.రాజా స్పష్టం చేశారు. నిజంగా చిత్తశుద్ధితో అమలు చేస్తే.. ప్రజా ధనం ఆదా అవుతుందని ప్రధాని మోదీకి సూచించారు. కానీ ప్రధాని మోదీ పూర్తి స్వార్థ పూరితంగా వ్యవహరించి.. ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఒన్ నేషన్.. ఒన్ రిజియన్ అనే విధానంతో కేంద్రంలోని పాలకులు చూస్తున్నారని విమర్శించారు. దేశ్ బచావ్.. బీజేపీ హఠావ్ అనే నినాదంతో సీపీఐ ప్రజల్లోకి వెళ్తుందని డి రాజా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సీపీఐ శత వసంతాల ప్రయాణం..
డిసెంబర్ 26వ తేదీన సీపీఐ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహిస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది ఛండీగఢ్‍లో సీపీఐ జాతీయ మహా సభలు నిర్వహిస్తామన్నారు. శత వసంతాల సీపీఐ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. రైతులు, కార్మికులు, ప్రజల పక్షాన నిలబడిన పార్టీ సీపీఐ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇక ఈ ఏడాది శత వసంతాల సభ కాన్పూర్ లో ప్రారంభమవుతుందన్నారు. పార్టీ శత వసంతాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సభలు నిర్వహిస్తామని డి రాజా ఈ సందర్భంగా ప్రకటించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Dec 17 , 2024 | 11:39 AM