AP Elections 2024: సీఎస్, డీజీపీ ఔట్!?
ABN, Publish Date - Apr 19 , 2024 | 04:08 AM
ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని
మరో ఆరుగురు ఐఏఎస్, ఐపీఎస్‌లూ...
రంగం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్
నేడో, రేపో బదిలీ ఉత్తర్వులు జారీ!?
జగన్ సేవలో సీఎస్ జవహర్ రెడ్డి
షెడ్యూలు తర్వాతా మారని తీరు
ఈసీ ఆదేశాలు బేఖాతరు
పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టు నిల్
ప్రధాని సభలో భద్రతా వైఫల్యం
ఎన్నికలను సమర్థంగా నిర్వహించలేరనే అభిప్రాయం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని తెలుస్తోంది. వీరితోపాటు అరడజను మంది ఐఏఎస్, ఐపీఎ్‌సలపై ఈసీ కన్నెర్ర చేసిందని... వీరిని బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు అధికార వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనిపై నేడో, రేపో ఉత్తర్వులు వచ్చే అవకాశముంది. అదే జరిగితే... ఇటు సీఎ్‌సను, అటు పోలీస్ బాస్‌ను ఒకేసారి పక్కకు తప్పించడం ఇదే తొలిసారి అవుతుంది.
జగన్ సేవలో జవహర్..
సీఎస్ జవహర్ రెడ్డి తొలినుంచీ జగన్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. వైసీపీకి రాజకీయంగా లబ్ధి కలగడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ ఆదేశాలను ఆసరాగా తీసుకుని... ఉద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీని ఆలస్యం చేసి, ఆ పాపాన్ని విపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. తమ ఆదేశాలు అమలు చేయకుండా జవహర్ రెడ్డి ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నారని ఈసీ భావిస్తోంది. గీత దాటి వైసీపీ కోసం ప్రచారం చేస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేయాలని ఈ నెల 8న ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కానీ... జవహర్ రెడ్డి ఆ ఫైలును తొక్కి పెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో గురువారం సాయంత్రానికి వెంకట్రామి రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక... రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ కమిషనర్ చిలకల రాజేశ్వరరెడ్డి డిప్యుటేషన్‌ను రద్దు చేసి తిరిగి పంపించాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలనూ పట్టించుకోలేదు. ‘ఆయన సేవలు మాకు కావాలి’ అంటూ తిరుగు జవాబు పంపించారు. ఇలాంటి అనేక అంశాలను పరిశీలించిన ఈసీ... జవహర్ రెడ్డి వ్యవహార శైలి నిష్పాక్షికంగా లేదని, కోడ్‌కు అనుగుణంగా నడుచుకోవడం లేదనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. వీటన్నింటిపై తమ సొంత మార్గాల్లో విచారణ జరిపిన తర్వాతే... జవహర్ రెడ్డిని సీఎస్ పోస్టు నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
రాజేంద్రనాథ్ రెడ్డిపై...
పోలీస్ బాస్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిపైనా బదిలీ వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. పేరుకు ఆయన డీజీపీ అయినా పోలీస్ యంత్రాంగమంతా ‘తాడేపల్లి’ డైరెక్షన్‌లోనే నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. చిలకలూరిపేటలో ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్న విమర్శలున్నాయి. జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టు లేదనే ప్రచారం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను రాజేంద్రనాథ్ రెడ్డి సజావుగా, సమర్థంగా నిర్వహించలేరనే నిర్ణయానికి ఈసీ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
దేశ చరిత్రలోనే ప్రథమం...
రాష్ట్రంలోని పరిస్థితులు, అధికార పార్టీ అరాచకాలు, వాటికి యంత్రాంగం సహకారం తదితర అంశాలను ఈసీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఐపీఎ్‌సలు, ముగ్గురు ఐఏఎ్‌సలను తప్పించింది. ఎన్నికల సమయంలో ఇంతమంది సీనియర్ ఆఫీసర్లను బదిలీ చేయడం ఈసీ చరిత్రలో మొదటిసారని అధికార వర్గాలు చెబుతున్నాయి. త్వరలో సీఎస్, డీజీపీతోపాటు మరో ఆరుగురు ఐఏఎస్, ఐపీఎ్‌సలనూ బదిలీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
సిసోడియా, ద్వారకా తిరుమలరావుకు చాన్స్?
సీఎస్, డీజీపీపై వేటు పడిన పక్షంలో... వారి స్థానంలో ఆర్‌పీ సిసోడియా, ద్వారకా తిరుమలరావును నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ సిసోడియా ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతకుముందు ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఆయన్ను జగన్ సర్కారు అకారణంగా బదిలీ చేసి, రెండు నెలలపాటు పోస్టింగ్ ఇవ్వలేదు. చివరికి అప్రాధాన్య పోస్టుగా భావించే మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమించింది. ఇక సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వార కా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు.
జగన్ సేవా పరాయణ..
జగన్మోహన్ రెడ్డికి జవహర్ రెడ్డి బాగా ప్రీతిపాత్రుడు. ఆయనకు పోస్టింగ్‌లు ఇవ్వడంలో సరికొత్త ఒరవడి సృష్టించారు. టీటీడీ ఈవోగా పని చేస్తున్న అధికారికి అదే సమయంలో మరో పోస్టింగ్ ఇచ్చిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలో లేవు. కానీ... జవహర్ రెడ్డి టీటీడీ ఈవోగా ఉండగానే వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎ్‌సగా, ఇరిగేషన్ స్పెషల్ సీఎ్‌సగా నియమించారు. ఇవి చాలదన్నట్లు జవహర్‌ను జగన్ తన పేషీ హెడ్‌గా కూడా నియమించారు. ఆపై కొన్ని నెలలకే... సీనియర్ ఐఏఎ్‌సలను పక్కన పెట్టి మరీ జవహర్ రెడ్డికి సీఎస్ పోస్టు కట్టబెట్టారు. దీనివల్లే ఆయన స్వామి భక్తిని ప్రదర్శిస్తూ జగన్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని... కిందిస్థాయి అధికారులను ప్రభావితం చేస్తున్నారని ఈసీకి వరుస ఫిర్యాదులు అందాయి.
Updated Date - Apr 19 , 2024 | 08:56 AM