Rains: ఆ ప్రాంతాల్లో తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ
ABN, Publish Date - Nov 28 , 2024 | 02:59 PM
శ్రీలంక- తమిళనాడు మధ్య ఏర్పాడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్‌గా బలపడే అవకాశముంది. ఇది ఉత్తర తమిళనాడు, మహాబలిపురం మధ్య నవంబర్ మాసాంతంలో తీరం దాటే అవకాశముంది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
విశాఖపట్నం, నవంబర్ 28: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు - ఈశాన్యంగా 110 కిలోమీటర్లు.. నాగపట్టణానికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, అలాగే పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు.. చెన్నైకి దక్షిణ ఆగ్నేయముగా 480 కిలోమీటర్లు దూరంలో ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది.
అయితే ఇది రాగల 12 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరాన్ని తాకుతూ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముందని పేర్కొంది. ఈ తీవ్ర వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి లేదా శుక్రవారం ఉదయానికి తుఫాన్‌గా బలపడే అవకాశముందని చెప్పింది.
ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలలో.. కరైకల్, మహాబలిపురం మధ్య నవంబర్ 30వ తేదీ ఉదయం తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. రానున్న 24 గంటలలో తిరుపతి, నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆ క్రమంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇక ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే తుపాను తీరం దాటే సమయంలో.. దక్షిణ కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 వరకు గరిష్టంగా 65 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో సముద్రంలో చేపలు వేటకు వెళ్ల వద్దని మత్య్సకారులను హెచ్చరించింది. ఏపీలోని అన్ని పోర్టులలో ఒకటివ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. వ్యవసాయ పనులు చేసుకునే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు ఈ సందర్బంగా సూచించింది.
మరోవైపు ఈ తుఫాన్ కారణంగా.. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో తుఫానులు రావడం పరిపాటి అయిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో ఆగమేఘాల మీద పొలంలో వరి కోతలు చేపట్టి.. వాటిని రహదారులపై ఆరబెడుతున్నారు. ఇంకోవైపు.. పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Nov 28 , 2024 | 03:26 PM