Daggubati Purandeswari: పవన్ చేసింది కరెక్టే: ఎంపీ పురందేశ్వరి
ABN, Publish Date - Nov 30 , 2024 | 05:28 PM
కాకినాడ పోర్ట్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. శనివారం విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. పవన్ చర్యలు కరెక్ట్ అని స్పష్టం చేశారు.
విజయవాడ, నవంబర్ 30: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు చెందిన బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్వాగతించారు. పీడిఎస్‌పై పవన్ కళ్యాణ్ తీసుకున్న చర్యలు సరైనవేనని ఆమె స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే తప్పు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. శనివారం విజయవాడలోని నిర్వహించిన సంఘటన్ పర్వ్ 2024 రాష్ట్ర స్థాయి సదస్సులో బీజేపీ నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు.
Also Read: ఆర్కే రోజాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. అంతర్జాతీయ పీడీఎస్ మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం తప్పు కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా తనిఖీలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో భాగంగా కాకినాడ పోర్ట్‌కు తరలిస్తున్నారని విమర్శించారు.
Also Read: రాహుల్ గాంధీ స్వాతిముత్యం
గత పాలకుల్లో కొంత మంది ఈ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ బియ్యం వ్యవహారంపై తాము పలుమార్లు ప్రస్తావించిన విషయాన్ని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. పీడీఎస్ బియ్యం అంశంలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్న తీరు సరైనదేనని దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. పేదలకు అందించే బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.
ఈ ఏడాది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా చాలా తక్కువ సమయంలో.. 11 కోట్ల మంది సభ్యత్వం పొందారని దగ్గుబాటి పురందేశ్వరి వివరించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 25 లక్షల మంది కొత్తగా బీజేపీలో సభ్యత్వం పొందారన్నారు. అందుకు పార్టీ కార్యకర్తల కృషి ప్రశంసనీయమైనదన్నారు. కార్యకర్తల కృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.
భవిష్యత్తులో పారదర్శకంగా.. సమర్థవంతరంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మద్దతు పెరుగుతుందన్నారు. హర్యానా, మహారాష్ట్రలలో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా పెరిగిందని చెప్పారు.
జగన్ వ్యాఖ్యలపై స్పందించిన పురందేశ్వరి
అదానీ వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అదానీతో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. అదానీతో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈవీఎం టాంపరింగ్ అంటూ బీజేపీపై.. విపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని దుగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Nov 30 , 2024 | 05:32 PM