ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌ పెట్టిన జిల్లాల కష్టాలు

ABN, Publish Date - Dec 01 , 2024 | 03:20 AM

జగన్‌ జమానాలో జరిగిన వ్యవస్థల విధ్వంసంలో జిల్లాల పునర్విభజన ఒకటి. జగన్‌ సర్కారు పోయినా ఆయన చేసిన తప్పులకు ప్రజలు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు.

  • రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు 245 కి.మీ. దూరంలో ఉంది. రంపచోడవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి దూరం 225 కిలోమీటర్లు. అంటే... జిల్లా కేంద్రం కంటే రాష్ట్ర రాజధానే దగ్గరన్నమాట.

  • శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గాన్ని రాజకీయ కోణంలో విజయనగరం జిల్లాలోకి తెచ్చారు. ఓ కీలక నేత సామాజికవర్గ ప్రజలు రాజాం నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతో.. స్థానికులకు ఇష్టం లేకున్నా శ్రీకాకుళం నుంచి తొలగించి విజయనగరంలో కలిపారన్న విమర్శలున్నాయి.

  • విజయవాడను ఆనుకుని ఉన్న పెనమలూరు, గన్నవరం

  • మండలాలను తీసుకెళ్లి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న

  • మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాలో కలిపారు.

  • చాలా నియోజకవర్గాల్లో కొన్ని మండలాలను ఓ జిల్లాలో, మరికొన్ని మండలాలను ఇంకో జిల్లాలో కలిపేశారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా ఇలాగే విడదీశారు.

  • నాడు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా 13 కొత్త జిల్లాల ఏర్పాటు

  • ప్రజాభిప్రాయాలు, ప్రయోజనాలు గాలికి

  • భౌగోళిక పరిస్థితులు, పాలనా అవసరాలు పట్టించుకోకుండా జిల్లాల పునర్విభజన

  • రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట

  • ఈ తప్పులను సరిదిద్దుతామన్న హామీని

  • చంద్రబాబు నెరవేర్చాలని ప్రజల ఆకాంక్ష

  • ప్రజలను వెంటాడుతున్న సమస్యలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ జమానాలో జరిగిన వ్యవస్థల విధ్వంసంలో జిల్లాల పునర్విభజన ఒకటి. జగన్‌ సర్కారు పోయినా ఆయన చేసిన తప్పులకు ప్రజలు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు. నాడు ప్రజల అభిప్రాయాలు, భౌగోళిక పరిస్థితులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. పారదర్శకతకు, శాస్త్రీయతకు చోటు లేకుండా.. రాజకీయ ప్రయోజనాలు, స్వలాభం కోసం, అస్మదీయులకు లబ్ధి కలిగేలా వ్యవహరించారు. జగన్‌ నిర్వాకం వల్ల గత రెండున్నర సంవత్సరాలుగా ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా రాష్ట్రమంతా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలను వేర్వేరు జిల్లాలలో కలిపేశారు. ప్రతీ లోక్‌సభ స్థానాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తానన్న మాటను కూడా జగన్‌ నిలబెట్టుకోలేదు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను మరో జిల్లాలో కలిపారు.


ప్రజల సౌకర్యం గురించి ఆలోచించకుండా సుదూర ప్రాంతాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇలా చెబుతూ పోతే జిల్లాల పునర్విభజనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. చాలా జిల్లాలలో ఇదే పరిస్థితి. కొత్త జిల్లాల కేంద్రాలలో ఇప్పటికీ కార్యాలయాలు లేవు. నాడు జగన్‌ చేసిన తప్పులను సరిదిద్దుతామని ప్రతిపక్షనేతగా చంద్రబాబు పలు సభల్లో హామీ ఇచ్చారు. నాడు జిల్లాల విభజన ద్వారా జగన్‌ తెచ్చిపెట్టిన కష్టాల నుంచి కూటమి ప్రభుత్వం విముక్తి కల్పిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. జగన్‌ చేసిన తప్పిదాలను సరిదిద్దాలని ప్రజలు కోరుకుంటున్నారు.


  • అడ్డగోలుగా విభజన

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో 13 పెద్ద జిల్లాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల ఏర్పాటు చట్టం-1974 ప్రకారం కొత్త జిల్లాలను ప్రజా ప్రయోజనాలు, పాలనా అవసరాల మేరకు ఏర్పాటు చేయాలి. ప్రాంతాల జనాభా, వెనుకబాటుతనం తదితర కారణాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాజకీయ ప్రయోజనాలు, వాటి కారణాల ప్రాతిపదికన జిల్లాల విభజన జరగకూడదని చట్టం చెబుతోంది. బ్రిటీష్‌ పాలకులు కూడా ఈ నియమాన్ని పాటించారు. గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణ లో ఈ సూత్రమే ప్రామాణికం. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజలకు దూరభారం తగ్గించాలి. జిల్లా కేంద్రానికి తక్కువ సమయంలో చేరుకునేలా ఉండాలి. కానీ 2022లో నాటీ సీఎం జగన్‌ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకుసాగారు. సీఎస్‌ నేతృత్వంలో అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సిఫారసులను పక్కనపెట్టి, సొంత రాజకీ య అజెండాతో ముందుకెళ్లారు. 2022 జనవరిలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌లు ఇచ్చారు. జగన్‌ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ప్రజావ్యతిరేకత వచ్చింది. సొంత పార్టీ నేతలు, కేడర్‌ కూడా జిల్లాల విభజనను తప్పుపట్టారు. దీంతో ప్రజాభిప్రాయం తీసుకొని సవరణలు చేస్తామని ఓ పెద్ద నాటకానికి తెరలేపారు. జిల్లాలు, డివిజన్ల కూర్పును సవరించాలని వచ్చిన 18 వేల విన్నపాలను జగన్‌ బుట్టదాఖలు చేశారు. సొంత పార్టీ నేతలు, అందులోనూ సొంత కోటరీ చెప్పినట్టు చేశారు.


తనకు ఇష్టం వచ్చినట్లుగా, ఓ రాజు తరహాలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తూ జిల్లాల విభజనపై ఏప్రిల్‌లో తుది నోటిఫికేషన్‌లు ఇచ్చారు. ఆ తర్వాత కూడా సొంత మనుషుల సిఫారసుల మేరకు కొత్త డివిజన్‌లు ఏర్పాటు చేశారు. 13 జిల్లాలను 26కి పెంచారు. 65 రెవెన్యూ డివిజన్లను 77 చేశారు. వీకేంద్రీకరణ పేరిట ప్రజలకు తీవ్ర కష్టాలు కొనితెచ్చిపెట్టారు. మచ్చుకు కొన్ని ఉదంతాలు...

  • జిల్లా కేంద్రం 250 కి.మీ. దూరంలో

కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు దూరాభారం తగ్గాలి. కానీ రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లలోని 11 మండలాల ప్రజలు తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు కేంద్రంగా పాడేరుతో పాటు ఈ రెండు రెవెన్యూ డివిజన్లతో అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేశారు. రంపచోడవరం డివిజన్‌ నుంచి పాడేరు 245 కి.మీ. దూరంలో ఉంది. పునర్విభజనకు ముందు జిల్లా కేంద్రం కాకినాడకు చేరుకోవాలంటే 80 నుంచి 180 కి.మీ. వెళ్తే సరిపోయేది. ఇప్పుడు పాడేరుకు వచ్చి వెళ్లాలంటే ఒకరోజు పడుతుంది. చింతూరు డివిజన్‌ వాసులదీ ఇదే పరిస్థితి. పాడేరుకు వెళ్లాలంటే 250 కి.మీ. దూరం ప్రయాణించాలి. ఈ రెండు డివిజన్లు దూరంగా ఉండడంతో జిల్లా అధికారులు కూడా పాడేరు డివిజన్‌కే పరిమితమవుతున్నారు.

  • అటూ.. ఇటూ

సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలాన్ని తొలుత పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించారు. ఆ తర్వాత రాజకీయ ఒత్తిడితో విజయనగరం జిల్లాలో చేర్చారు. దీంతో మెంటాడ మండలం సాలూరు నియోజకవర్గంలో ఉన్నా మన్యం జిల్లాతో ఎటువంటి సంబంధం లేదు. ఆ మండల ప్రజలు పాలనాపరంగా ఇబ్బందులు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాను పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలు, వాటి పరిధిలో ఉన్న 15 మండలాలతో ఏర్పాటు చేశారు. పాలకొండ నియోజకవర్గంలో భామిని, సీతంపేట, పాలకొండ మండలాల ప్రజలు జిల్లా కేంద్రం పార్వతీపురానికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూరాభారంతో పాటు వ్యయ ప్రయాసలు భరించాల్సి వస్తోంది. ఇక పాలకొండ డివిజన్‌ పరిధిలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస మండలాల ప్రజలు డివిజన్‌ కేంద్రం పాలకొండ వెళ్లాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. గతంలో పార్వతీపురం డివిజన్‌లో ఉన్న ఈ మండలాలను కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత పాలకొండ డివిజన్‌లో కలిపారు.


  • రాజకీయ కోణంలో...

రాజంపేట జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టారు. జిల్లా ప్రధాన కేంద్రంగా రాయచోటిని ఎంపిక చేశారు. ప్రజలు వ్యతిరేకించినా జగన్‌ రాజకీయ కోణంలో తన పార్టీ నాయకుల కోరిక మేరకు కొనసాగించారు. జగన్‌ కార్యాలయంలో పనిచేసిన ఓ కీలక అధికారిది కూడా అదే ప్రాంతం కావడం మరో కారణం. జిల్లా కేంద్రం కాబోతోందని తెలియడంతో వైసీపీ నేతలు, ఆ అధికారి భారీగా భూములు కొనుగోలు చేసి రియల్‌ వెంచర్లు వేశారు. రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం ప్రజల కన్నా వారికే మేలు చేసిందన్న విమర్శలున్నాయి.

  • ఇష్టానుసారంగా విభజన

వెంకటగిరి నియోజకర్గంలో ఆరు మండలాలు ఉండగా.. వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి. మిగిలిన రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. అలాగే నగరి నియోజకవర్గంలో పుత్తూరు, వడమాలపేట మండలాలు తిరుపతి జిల్లాలో ఉండగా... నగరి, నిండ్ర, విజయపురం మండలాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఇలా నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలో ఉండటంతో అభివృద్ధి పరంగా, రాజకీయపరంగా సమస్యలు ఎదురవుతున్నాయి. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి సెగ్మెంట్‌ మొత్తం నెల్లూరు జిల్లాలో ఉంది. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో భాగమైన చంద్రగిరి సెగ్మెంట్‌ తిరుపతి జిల్లాలో ఉంది. రాజంపేట పార్లమెంటు పరిధిలోని పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో చేర్చారు. దీంతో ఎన్నికల సమయంలో అధికారులు ఇబ్బంది పడ్డారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలను రాజకీయంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యం కోసం చేశారన్న విమర్శలు ఉన్నాయి.


  • పెందుర్తి.. 2 ముక్కలు

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం రెండు ముక్కలైంది. పెందుర్తి మండలాన్ని విశాఖ జిల్లాలో, సబ్బవరం, పరవాడ మండలాలను అనకాపల్లి జిల్లాలో చేర్చారు. నియోజవర్గంలో అభివృద్ధి పనుల విషయంపై ఎమ్మెల్యే రెండు జిల్లాల అధికారులను కలవాల్సి ఉంటుంది. ఇక పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉంది. ఎంపీ కూడా రెండు జిల్లాల అధికారులను కలవాల్సి ఉంటుంది.

  • అంతా గజిబిజి

విజయనగరం జిల్లాను ప్రాంతీయ, సామాజిక మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజించినట్టు గత వైసీపీ ప్రభుత్వం చెప్పింది. దీని ప్రకారం ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని విజయనగరం పరిధిలోకి తేవాలి. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉంచింది. అలాగే ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గం విశాఖ పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఉంది. కానీ విజయనగరం జిల్లాలోనే కొనసాగించింది. ఆ నియోజకవర్గ ప్రజలు ఏమో విశాఖ జిల్లాలో కలపాలని కోరారు.

  • విజయవాడ నుంచి విడదీసి...

పెనమలూరు, గన్నవరం మండలాలు విజయవాడకు ఆనుకుని ఉంటాయి. ఈ ప్రాంత వాసులకు విజయవాడతో అనుబంధం ఎక్కువ. అయితే ఈ రెండు మండలాలను విజయవాడతో సంబంధం లేకుండా 70 కిలోమీటర్ల దూరంలోని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో కలిపారు. విజయవాడ నుంచి విడదీయవద్దని, ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలని 2,500 అభ్యంతరాలు వచ్చినా పట్టించోలేదు. గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్లింది. వాస్తవానికి ఇది విజయవాడ విమానాశ్రయం. విమానాశ్రయంలో ప్రొటోకాల్‌ విధులు నిర్వహించటానికి ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగానికి తేలిగ్గా ఉంటుంది. జిల్లాల పునర్విభజనతో దూరంగా ఉన్న మచిలీపట్నం నుంచి ఉన్నతాధికారులు రావాల్సి వస్తోంది. గన్నవరం విజయవాడ గ్రేటర్‌ విలీన ప్రతిపాదిత జాబితాలో ఉంది. అయినా అడ్డగోలుగా విభజించేశారు.


  • ప్రజాభీష్టానికి భిన్నంగా...

బాపట్ల జిల్లాలో అద్దంకి నియోజకవర్గ ప్రజలు జిల్లా కేంద్రానికి రావాలంటే దాదాపు 3గంటలు ప్రయాణం చేయాలి. అప్పట్లో ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. జిల్లా కేంద్రంగా చీరాలను చేయాలనే డిమాండ్‌ను కొన్ని రాజకీయ పక్షాలు చేశాయి. తద్వారా జంట నగరాలుగా బాపట్ల, చీరాల అభివృద్ధి చెందుతాయని, అద్దంకి వాసులకు దూరం తగ్గుతుందనే వాదనను తెచ్చారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా అశాస్త్రీయంగా జిల్లాను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ పాలనా పరమైన చిక్కులు తొలగకపోగా, భవిష్యత్తులో రాజకీయ పరమైన డిమాండ్లు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.

  • అభివృద్ధికి విఘాతం

జిల్లాల పునర్విభజన కోనసీమ అభివృద్ధికి అవరోధంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. చమురు సంస్థ ద్వారా రావాల్సిన నిధులు పక్క జిల్లాకు వెళ్తున్నాయి. దేశంలోనే అత్యధిక చమురు, సహజ వాయువులను ఉత్పత్తి చేసే గాడిమొగలోని రిలయన్స్‌, గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్లు ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవు మండలంలో ఉన్నాయి. వాటిని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కాకుండా కాకినాడ జిల్లాలో విలీనం చేశారు. దీంతో కోనసీమ అభివృద్ధిలో కీలకమయ్యే సీఎ్‌సఆర్‌ ఫండ్స్‌ కాకినాడకు వెళ్లిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • ప్రాంతం ఓ జిల్లా.. నేతలు మరో జిల్లా

రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. దీని పరిధిలోని పెదపూడి మాత్రం కాకినాడ జిల్లాలో ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వారు. చిన్న సమస్య అయినా ప్రజాప్రతినిధులు కాకినాడకు వెళ్లవలసిన పరిస్థితి. ఇక చిన తిరుమలగా ప్రసిద్ధి చెందిన ద్వారకాతిరుమల ఏలూరు జిల్లాలో ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు. ప్రస్తుతం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న మండపేట నియోజకవర్గ ప్రజలకు రాజమండ్రి దగ్గర. కానీ చాలా దూరంలోని కోనసీమలో కలిపారు.

Updated Date - Dec 01 , 2024 | 03:28 AM