Minister Ramanaidu: మాజీ సీఎం జగన్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - Jul 05 , 2024 | 06:11 PM
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్స్‌లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా జైలులో ఉంచారు.
అమరావతి: మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా జైలులో ఉంచారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి నిన్న ఆయనతో జైలులో ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్డీఏ కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) జగన్ తీరును తప్పుబట్టారు.
ఈవీఎం బద్దలు కొట్టడం తప్పు కాదని జగన్ మాట్లాడటం దారుణమని అన్నారు. ఈవీఎంలను బద్దలు కొట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టడమేనని చెప్పారు. జగన్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవీఎంల ధ్వంసంపై జగన్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకునేలా ఈసీ సుమోటోగా కేసును టేకప్ చేయాలని కోరారు. ఓటమి నుంచి జగన్ పాఠాలు నేర్చుకోకుండా.. ప్రజలనే తప్పుబడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఇలాగే మాట్లాడితే రెండు అంకెల నుంచి ఒక అంకెకు మాత్రమే మిగిలిపోతారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
Updated Date - Jul 05 , 2024 | 06:25 PM