AP Politics: వైసీపీని వదిలే ప్రసక్తే లేదు.. రోజుకోసారి పృథ్వీరాజ్ ప్రెస్‌మీట్!
ABN, Publish Date - Jan 26 , 2024 | 06:08 PM
వైసీపీ ప్రభుత్వంపై కమెడియన్ (30 ఇయర్స్ ఇండస్ట్రీ) పృథ్వీరాజ్ (Prithviraj) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో చేరిన తర్వాత సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు అమలాపురం వచ్చారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా (అమలాపురం): వైసీపీ ప్రభుత్వంపై కమెడియన్ (30 ఇయర్స్ ఇండస్ట్రీ) పృథ్వీరాజ్ (Prithviraj) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో చేరిన తర్వాత సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు అమలాపురం వచ్చారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ... వైసీపీ నేతలు ప్రకృతిని దోచుకోవడంతో ప్రకృతి తిరగబడిందని చెప్పారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనంతో ఎంత అనుభూతి పొందుతామో.. పవన్ కళ్యాణ్‌ను కలిసినప్పుడు అంతకుమించి అనుభూతిని పొందానని తెలిపారు. కల్తీ మద్యం తాగి ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారని.. కొంతమంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ షాపుల్లో ఫోన్ పే, గూగుల్ పేలు లేకుండా క్యాష్ మాత్రమే తీసుకుని ఎలక్షన్ కోసం వైసీపీ నేతలు దాచి పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ - జనసేన రెండు జెండాల కలయికతో శాంతి, సంక్షేమం, మహిళల భద్రత, రైతుల భరోసా, కులమతాలకు అతీతంగా ముందుకు పోవడం శుభ పరిణామమని చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 17 సీట్లు మాత్రమే..
గత ఎన్నికల విజయాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ నేతలు వై నాట్ 175 అని మురిసిపోతున్నారని.. ఈసారి ఎన్నికల్లో 175 సీట్లు రావని 17 మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు. రాబోయే ఎలక్షన్ తర్వాత సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్లతో పాటు అంబటి రాంబాబుని కూడా పిలవచ్చని.. లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వచ్చని దెప్పిపొడిశారు. వీళ్ల నోటి నుంచి ఎప్పుడు పవన్ కళ్యాణ్‌కు మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓడిపోయాడని అంటారన్నారు.పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ఆగిపోయిందా? రెండు చోట్ల ఓడిపోవడం వల్ల అమలాపురం రోడ్ల అభివృద్ధి ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తే ఎయిర్ పోర్టులో జనసేన కార్యకర్తలకు మధ్యవేలు చూపించిన రోజాను జనసేన కార్యకర్తలు అసలు వదిలిపెట్టరని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన - టీడీపీ కూటమి 136 అసెంబ్లీ స్థానాల్లోనూ, 21 ఎంపీ స్థానంలోనూ ఘన విజయం సాధిస్తుందని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
Updated Date - Jan 26 , 2024 | 06:52 PM