Raghu Rama: చంద్రబాబుకు విజన్ ఉంది: రఘురామ కృష్ణరాజు
ABN, Publish Date - Aug 06 , 2024 | 03:10 PM
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై తాను వేసిన కేసు రేపు విచారణకు వస్తుందని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా అడుగులేస్తుందని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishnam Raju) వివరించారు. అమరావతిలో వేసిన రోడ్లను వైసీపీ నేతలు మాయం చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందని గుర్తుచేశారు. కేంద్ర సంస్థలకు సీఎం చంద్రబాబు స్థలం కేటాయించారని, ఇప్పుడు రాజధానిలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే రఘురామ పేర్కొన్నారు. మంగళవారం నాడు రఘురామ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అభివృద్ధిలో ముందంజ..
ఏపీలో ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 55 రోజులు అవుతుందని గుర్తుచేశారు. సమయం ఇవ్వకుండా వైసీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో ఇంకా తెలియడం లేదని.. దీనిపై ఓ స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. చంద్రబాబుకు ఏపీని అభివృద్ధి చేసే సామర్థ్యం ఉందని ఎమ్మెల్యే రఘురామ తెలిపారు.
గజం రూ.40 వేలు
‘‘అమరావతిలో గజం ఇప్పుడు 40 వేలు ఉంది. ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం ఉంది. రాజధాని అమరావతి అని అందరికీ నమ్మకం కలిగింది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ స్తబ్ధత నెలకొంది. తెలంగాణలో రేట్లు 10 శాతం తగ్గాయి. దీనికి కారణం ఏపీలో చంద్రబాబు నాయుడు రావటం. చంద్రబాబు హయాంలో ఒక విజన్ ఉంది. గతంలో కొందరు కలెక్టర్లు వైసీపీకి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారు. ఐఏఎస్‌కు పూర్వవైభవం వచ్చేలా ఈ ప్రభుత్వం ఉంది. ఐఏఎస్‌లకు చంద్రబాబు గతంలో ఎక్కువ గౌరవం ఇచ్చే వారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు సమయం ఇస్తామని కూడా చెప్పారు. ఎమ్మెల్యేలను జగన్ గతంలో పట్టించుకోలేదు. అందుకే ఆయన11 సీట్లకే పరిమితం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి నుంచి గతంలో అందరికీ ముప్పు ఉండేది. ఇప్పుడు జగన్‌కి ప్రజల నుంచి ఎలాంటి ముప్పు లేదు’’ అని రఘురామ పేర్కొన్నారు.
ఎక్కడికి వెళ్తావు..?
‘‘900 వందల మంది సిబ్బందిని వేసుకుని జగన్ ఎక్కడికి వెళ్తాడు. జగన్‌ను ఎవరు ముట్టుకుంటారు...? పార్లమెంట్‌లో ప్రశ్నల సమయంలో ఎక్కువ సోది ఉండదు. పార్లమెంట్ ఏడాదికి పని దినాలు 90 రోజులు ఉంటాయి. గతంలో అసెంబ్లీ సగం రోజులు కూడా జరగలేదు. నియోజకవర్గంలో ఐదు రోజులు పాటు ఉంటూ, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాను. నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కారిస్తున్నా. స్కూల్స్ ఆధునీకరణ, హాస్టల్స్ , టాయిలెట్స్ నిర్మాణానికి ప్రజలంతా ముందుకు వస్తున్నారు’’ అని రఘురామ పేర్కొన్నారు.
జగన్‌పై కేసు ఏమన్నారంటే..
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై తాను వేసిన కేసు రేపు విచారణకు వస్తుందని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని అన్నారు.
Updated Date - Aug 06 , 2024 | 04:00 PM