Share News

నలుగురు ఎస్పీలపై ఈసీ కత్తి..!

ABN , Publish Date - May 16 , 2024 | 04:51 AM

రాష్ట్రంలో మరో నలుగురు ఎస్పీలపై ఎన్నికల సంఘం కత్తి వేలాడుతోంది. ఎన్నికల విధుల్లో వైఫల్యం.. హింసను కట్టడి చేయలేక పోవడంపై చర్యలు

నలుగురు ఎస్పీలపై ఈసీ కత్తి..!

పల్నాడు హింస బిందు మాధవ్‌ మెడకు

పులివర్తి నానిపై దాడి.. తిరుపతి ఎస్పీపై వేటు..

తాడిపత్రి బీభత్సం.. అమిత్‌ బర్దార్‌కు సంకటం..

నంద్యాలలో‘పుష్ప’ర్యాలీ.. రఘువీర్‌రెడ్డి ఫైర్‌..?

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో నలుగురు ఎస్పీలపై ఎన్నికల సంఘం కత్తి వేలాడుతోంది. ఎన్నికల విధుల్లో వైఫల్యం.. హింసను కట్టడి చేయలేక పోవడంపై చర్యలు తీసుకోబోతోంది. బుధవారం రాత్రి పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు అందిన సమాచారం మేరకు గురువారం రాయలసీమలో ముగ్గురు, పల్నాడులో ఒకరిపై వేటుపడే అవకాశం ఉంది. పోలింగ్‌ సందర్భంగా జరిగిన హింసపై సీరియస్‌ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్‌... ఆ తర్వాతా కొనసాగడాన్ని క్షమించలేక పోతోంది. ఎప్పుడూ గొడవలు జరిగే పల్నాడు జిల్లాలో విధ్వంసాన్ని ఉపేక్షించే ప్రసక్తేలేదని ఢిల్లీ ఈసీ వర్గాలు రాష్ట్ర పోలీసు పెద్దలకు హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది. మహిళా ఏజెంట్‌పై గొడ్డలితో దాడి, మరో ఏజెంట్‌ ఇంటికెళ్లి చిన్నపిల్లల్ని చంపుతామంటూ వీడియోలు తీసి పంపడం, అధికార వైసీపీ అభ్యర్థి కాన్వాయ్‌లోనే కత్తులు, రాడ్లు తీసి టీడీపీ ఆఫీసు ధ్వంసం చేయడం తదితర ఘటనలపై ఎన్నికల పరిశీలకుడు మిశ్రా ఇచ్చిన నివేదిక జిల్లా ఎస్పీపై చర్యకు ఆయుధంగా మారిందని సమాచారం. నరసరావుపేటలో ఎంతో సౌమ్యుడిగా పేరున్న వెనుకబడిన వర్గాలకు చెందిన చదలవాడ అరవింద్‌ బాబు వాహనాన్ని వెంబడించి దాడి చేయడం, అందుకు బాధ్యుడైన వైసీపీ అభ్యర్థి ఇంటిపైకి టీడీపీ శ్రేణులు వెళ్లడం, ఇతర హింసాత్మక ఘటనలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌ మెడకు చుట్టుకోబోతున్నట్లు సమాచారం. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో టీడీపీ చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం దృశ్యాలు సీఈసీకి ఆగ్రహం తెప్పించాయి. విద్యా సంస్థ ప్రాంగణంలోకి మద్యం సీసాలు, సమ్మెట, కర్రలు, రాడ్లు పట్టుకెళ్లి అభ్యర్థిపై హత్యాయత్నం చేస్తుంటే జిల్లా ఎస్పీ కనీస భద్రతా చర్యలు చేపట్టలేక పోయారని ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది. అభ్యర్థి అంగరక్షకుడిపైనే దాడి చేసేందుకు అధికార పార్టీ మూకలు తెగబడ్డాయంటే ఎన్నికల ముందు అక్కడికి ఎస్పీగా వచ్చిన కృష్ణకాంత్‌ పటేల్‌పై అధికార పార్టీ ప్రభావం ఎంతుందో అర్థం చేసుకుంది. దీంతో గురువారం సాయంత్రంలోగా తిరుపతి ఎస్పీ బదిలీ తప్పక పోవచ్చని ఐపీఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అనంతపురం జిల్లా ఎస్పీగా ఇటీవలే ఎన్నికల కమిషన్‌ ఎంపికతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అమిత్‌ బర్దార్‌ హింసాత్మక ఘటనలు అరికట్టడంలో పూర్తిగా విఫలం అయ్యారని ఈసీ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ముందస్తుగానే అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ట్రాక్టర్లతో రాళ్లు తెప్పించి ప్రతిపక్షాలతోపాటు పోలీసులపైనా రాళ్లవర్షం కురిపిస్తుంటే ఏమీ చేయలేక చేతులెత్తేయడం చేతగానితనంగా భావిస్తోంది. రాళ్ల దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఇళ్లల్లోకి దూరి తలుపులేసుకుని దాక్కోవడం, జిల్లా ఎస్పీ వాహనంపైనే అధికార పార్టీ అల్లరి మూకలు దాడి చేయడం ఊహించడం కూడా కష్టంగా ఉందని ఎన్నికల అధికారి ఒకరు పోలీసు పెద్దలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తనను తాను కాపాడుకోలేని వ్యక్తి జిల్లా ఎస్పీగా శాంతి భద్రతలు ఏమేరకు పరిరక్షించగలరో అర్థం అవుతోందని అన్నట్లు సమాచారం. మరోవైపు నంద్యాలకు పోలింగ్‌కు 48 గంటల ముందు వచ్చిన సినీ నటుడు అల్లు అర్జున్‌, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి తరఫున వేలాది మందితో అనుమతిలేని ర్యాలీ తీయడంపై ఈసీ ఇప్పటికే జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు ఆదేశించింది. ప్రతిపక్ష నేత సభ ఉన్న సమయంలో వేలాది మందితో ర్యాలీకి అధికార పక్షం ముందు రోజు రాత్రి నుంచి సిద్ధం చేసుకున్నా కనీసం అడ్డు చెప్పక పోవడం ఏకపక్ష పోలీసింగ్‌కు ప్రత్యక్ష ఉదాహరణగా భావిస్తోంది. ఇదే కారణంతో రఘువీరా రెడ్డిని సైతం బదిలీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈసీ చర్యలు ఉండకపోవచ్చని భావించిన అధికారులకు అంతకు మించి కౌంటింగ్‌ ముందుందని గుర్తు చేస్తోంది. ఇప్పుడు ఉపేక్షిస్తే కౌంటింగ్‌ సందర్భంగా హింస, ఆ తర్వాత రాజకీయ ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని అనుమానిస్తోంది. ఇవన్నీ గమనించి ఆ నాలుగు జిల్లాలకు సమర్థులైన అధికారులను ఎస్పీలుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - May 16 , 2024 | 04:51 AM