Kakinada Port Case: రంగంలోకి ఈడీ!
ABN, Publish Date - Dec 19 , 2024 | 05:39 AM
కాకినాడ సీపోర్టులో వాటాలను కారుచౌకగా కొట్టేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఇందులో లోగుట్టు వెలికి తీసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.
వైవీ తనయుడికి నోటీసులు!
కాకినాడ పోర్టు కేసులో మరో మలుపు
మనీలాండరింగ్‌పై ప్రాథమికంగా నిర్ధారణ.
జగన్ హయాంలో చేతులు మారిన వాటాలు.
బెదిరించి, భయపెట్టి కొట్టేశారని ఫిర్యాదు.
విక్రాంత్ రెడ్డి, సాయిరెడ్డి తదితరులపై
ఇప్పటికే సీఐడీ కేసు నమోదు.
పోర్టులో సోదాల్లో కీలక ఫైళ్లు స్వాధీనం
(కాకినాడ - ఆంధ్రజ్యోతి): కాకినాడ సీపోర్టులో వాటాలను కారుచౌకగా కొట్టేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఇందులో లోగుట్టు వెలికి తీసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. జగన్ హయాంలో చోటు చేసుకున్న ఈ బలవంతపు డీల్ వెనుక భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కాకినాడ సీపోర్టు అసలు యజమాని కేవీరావును జగన్ సన్నిహితులు బెదిరించి, భయపెట్టి కారుచౌకగా వాటాలు కొట్టేసిన వైనంపై ఈడీకి పలు ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. వాటిని పరిశీలించిన ఈడీ... ఈ ‘డీల్’లో మనీలాండరింగ్ చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు విక్రాంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.
విక్రాంత్ ప్రత్యక్ష ప్రమేయం...
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు, గనులు, పోర్టులు చేతులు మారిపోయాయి. అందులో... కాకినాడ సీపోర్టు కూడా ఒకటి! ఇందులో 41శాతం వాటాను తాడేపల్లి పెద్దలకు బాగా దగ్గరైన ‘అరబిందో’ దక్కించుకుంది. తనను బెదిరించి, భయపెట్టి మరీ వాటాలు రాయించుకున్నారని పోర్టు యజమాని కేవీ రావు ఇటీవల సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కాకినాడ సీపోర్టులో ఇటీవల సీఐడీ అధికారుల బృందం సోదాలు జరిపింది. బలవంతపు డీల్ వెనుక జరిగిన లావాదేవీలపై కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కేవీరావు వాటాను కారుచౌకగా కొట్టేయడం, అరబిందో కంపెనీ పేరిట షేర్లను బలవంతంగా రాయించిన ఘటనలో వందల కోట్లు చేతులు మారాయని... మనీలాండరింగ్ జరిగిందని ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో... ఈ డీల్‌లో కీలక పాత్ర పోషించిన విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
ఇదీ విషయం...: కాకినాడ సీపోర్టులోని తన వాటాలను బలవంతంగా రాయించుకున్న వైనంపై కేవీ రావు సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. ‘పోర్టులో 2500 కోట్ల వాటాను 494కోట్లకు లాక్కున్నారు’ అని తెలిపారు. జగన్ సీఎం అయిన తర్వాతే తమకు ఇక్కట్లు మొదలయ్యాయని, మారిటైమ్ బోర్డు సహకారం కరువైందని చెప్పారు. ‘‘చెన్నైకి చెందిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీతో ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. ముంబైకి చెందిన మరో సంస్థతోనూ ఆడిట్ అంటూ సమాచారం ఇచ్చారు. రెండు సంస్థలకూ మేం సహకరించాం. రికార్డులన్నీ వారి ముందుంచాం. మా సంస్థ ప్రభుత్వానికి 994కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్లు ఆడిట్ కంపెనీ వైసీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇదే సమయంలో... మాకు విజయసాయి రెడ్డి ఫోన్ చేశారు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని కలవాలని సూచించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న విక్రాంత్ ఇంటికెళ్లి కలిసి మాట్లాడగా.. ‘మీరు ప్రభుత్వానికి వెయ్యి కోట్లు ఎగ్గొట్టారు. మొత్తం కుటుంబం జైలుకు వెళ్లకూడదు అనుకుంటే మీ కంపెనీ షేర్లన్నీ విక్రయించేయండి. ఇది నా మాట కాదు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశం’ అని భయపెట్టారు. 41.14శాతానికి 494కోట్ల రూపాయలు ఖరారు చేశామని, డీల్ సెట్ చేసుకోమని ఏకపక్షంగా చెప్పారు’’ అని కేవీరావు తన ఫిర్యాదులో తెలిపారు. వేలకోట్ల ఆస్తులను కొట్టేసిన అనంతరం... వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తాడేపల్లిలోని జగన్ ప్యాలె్‌సకు తనను తీసుకెళ్లారని... ‘ఇది చాలా అన్యాయం’ అని చెప్పబోతుండగా... ‘విక్రాంత్ చెప్పినట్లు చెయ్యండి’ అంటూ జగన్ హుకుం జారీ చేశారని తెలిపారు. అంతకుముందు తాము ప్రభుత్వానికి రూ.994 కోట్లు ఎగ్గొట్టామని నివేదిక ఇచ్చిన శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ... ఆ తర్వాత పన్ను ఎగవేత తొమ్మిది కోట్లే అని తేల్చిందని వెల్లడించారు.
ఇప్పటికే సీఐడీ కేసు...
కేవీ రావు ఫిర్యాదు మేరకు సీఐడీ వై.విక్రాంత్ రెడ్డి (వైవీ సుబ్బారెడ్డి కుమారుడు)ని ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ, అరబిందో సంస్థను నిందితులుగా చేర్చింది. ప్రస్తుతానికి విక్రాంత్ రెడ్డికి మాత్రమే ఈడీ నోటీసులిచ్చినట్లు తెలిసింది.
Updated Date - Dec 19 , 2024 | 08:51 AM