గుట్టు చప్పుడు కాకుండా గనుల ఘనుడు వెంకటరెడ్డి విడుదల
ABN, Publish Date - Nov 18 , 2024 | 04:43 AM
వైసీపీ పాలనలో మైనింగ్ శాఖను మడత పెట్టేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డికి బెయిల్ లభించింది.
తీవ్ర అభియోగాలున్న కేసులో చడీచప్పుడు లేకుండా బెయిల్
సమర్థ వాదనలు వినిపించడంలో ఏసీబీ విఫలం
బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం చెప్పని వైనం
దేశం విడిచి వెళ్లరాదని అధికారికి కోర్టు షరతు
ప్రతి శనివారం ఏసీబీ సీఐయూ అధికారుల
ముందు హాజరు కావాలని ఆదేశం
విజయవాడ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో మైనింగ్ శాఖను మడత పెట్టేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డికి బెయిల్ లభించింది. శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. గత ప్రభుత్వంలో ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన వెంకటరెడ్డి వ్యవహారంలో బెయిల్, జైలు నుంచి విడుదల చడీచప్పుడు లేకుండా జరిగిపోయాయి. జగన్ పాలనలో వెంకటరెడ్డి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి సహజ వనరులను వైసీపీ నేతలకు దోచి పెట్టారన్న అభియోగాలు ఉన్నాయి. సెప్టెంబరు 11న ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) ఆయనపై కేసు నమోదు చేసింది. అదే నెల 26వ తేదీ రాత్రి హైదరాబాద్‌లో అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. 50 రోజులపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వెంకటరెడ్డి అరెస్టయిన తర్వాత రిమాండ్‌కు వెళ్లగానే ఆరోగ్యపరమైన కారణాలను చూపించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గనుల శాఖకు చెందిన రూ.160 కోట్లను ఆయన ఎవరి ప్రమేయమూ లేకుండా దారి మళ్లించారని సీఐయూ అధికారులు నిర్ధారించారు.
వెంకటరెడ్డిపై నమోదు చేసిన అభియోగాలకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సంపాదించారు. వాటిని కోర్టు ముందు పెట్టి వెంకటరెడ్డి తరఫున న్యాయవాదులు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలను తిప్పికొట్టడంలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు గనుల శాఖలో వెంకటరెడ్డి చేసిన అక్రమాలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఆ తీవ్రత ఏసీబీ అధికారుల్లో కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలైనప్పటి నుంచి బలంగా కౌంటర్లు దాఖలు చేయలేకపోయారనే వాదన వినిపిస్తోంది. పైగా కోర్టుకు ఆధారాలను సమర్పించడానికి కొన్నిసార్లు గడువు అడిగినప్పటికీ వాటిని సకాలంలో సమర్పించలేకపోయారు. మరోవైపు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ ఎలాంటి అభ్యంతరాలు కూడా చెప్పకపోవడం వల్లే న్యాయస్థానం వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేసిందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. చివరికి బెయిల్ మంజూరైందన్న విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఏసీబీ కోర్టు ఆయనకు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. అదేవిధంగా ప్రస్తుత, పూర్వ చిరునామాను కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. ప్రతి శనివారం ఏసీబీ సీఐయూ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పూచీకత్తును ఆయన శనివారం కోర్టుకు అందజేశారు. అనంతరం విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
చంద్రబాబు విషయంలో అలా..
జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు సహా పలువురు నాయకులు, అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటి విచారణ విజయవాడలోని ఏసీబీ కోర్టులో జరిగింది. అప్పుడు పనిచేసిన అధికారులు, సిబ్బంది ప్రతి చిన్న విషయానికి చాలా హడావిడి చేసేవారు. కోర్టులో ఏయే పిటిషన్లు, మెమోలు దాఖలు చేయబోతున్నారో ముందుగానే లీక్‌లు ఇచ్చేవారు. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో సరైన ఆధారాలు లేకపోయినా చంద్రబాబుకు బెయిల్ లభించడానికి 2 నెలలు పట్టింది. కానీ వెంకటరెడ్డి విషయంలో తీవ్ర అభియోగాలతో పాటు ఆధారాలు ఉన్నా ఏసీబీ సమర్థంగా వ్యవహరించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Updated Date - Nov 18 , 2024 | 05:16 AM