ఐదేళ్లుగా అశాంతి!
ABN , Publish Date - Jul 23 , 2024 | 03:05 AM
గత ఐదేళ్లలో జగన్ దుష్పరిపాలన, విధ్వంసంతో ప్రజల్లో మానసిక అశాంతి, వేదన చెలరేగాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం మొదలు.. జగన్ దిగేదాకా కొనసాగింది
2014 నాటి విభజన నష్టం కంటే గత ఐదేళ్లలో జరిగిన నష్టమే ఎక్కువ
ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశారు.. జనం జీవించే హక్కునే కోల్పోయారు
అమరావతిని నాశనం చేశారు.. పోలవరం పూర్తిగా పట్టాలు తప్పింది
కొత్తగా ఒక్క నీటి ప్రాజెక్టు లేదు.. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు
ఖనిజ సంపదను కొల్లగొట్టారు.. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను దెబ్బతీశారు
ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అపూర్వ తీర్పు.. ఉమ్మడి భేటీలో గవర్నర్ నజీర్ ప్రసంగం
అడ్డుకోవడానికే సభకు జగన్ అండ్ కో.. 16 నిమిషాలు నినాదాలు.. వాకౌట్
అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో జగన్ దుష్పరిపాలన, విధ్వంసంతో ప్రజల్లో మానసిక అశాంతి, వేదన చెలరేగాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఇది రాష్ట్ర భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాలేదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలంతా ఆ ప్రభుత్వ చర్యలతో కలత చెందారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను పలు దఫాలు విభజించడంతో ప్రజలు సుదీర్ఘ కాలం పాటు అభివృద్ధికి, పురోగతికి నోచుకోలేకపోయారని.. అయితే 2014లో రాష్ట్ర విభజన కారణంగా జరిగిన నష్టం కంటే జగన్ జమానాలో జరిగిన నష్టమే అధికంగా ఉందని పేర్కొన్నారు. సోమవారమిక్కడ అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని వివరించారు. కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లను తెలియజేశారు. 2014లో అశాస్త్రీయ విభజన వల్ల నవ్యాంధ్రకు 46 శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయన్నారు. ఆర్థిక వ్యవస్థపై కనీవినీ ఎరుగని ఒత్తిడి కలిగించిందని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో సాధించిన మైలురాళ్లన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం వల్లే సాధ్యమయ్యాయని.. రాష్ట్రం అత్యున్నత అభివృద్ధి పథంలో పయనిస్తున్న సమయంలో 2019లో జరిగిన పాలన మార్పు.. మళ్లీ నవ్యాంధ్రప్రదేశ్‌కు విఘాతం కలిగించిందని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన భారాన్ని చవిచూసిన రాష్ట్రం.. ఆ ఐదేళ్ల అసమర్థ పాలన రూపంలో మరో పెద్ద పరాజయాన్ని చూసిందని.. ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించిన విధ్వంసం గత నెలలో పదవీకాలం ముగిసే వరకు నిరంతరాయంగా కొనసాగించిందని విమర్శించారు. ‘ఈ ఐదేళ్లలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జీవించే స్వేచ్ఛను కోల్పోయారు. ప్రతీకార రాజకీయాలు రాష్ట్ర శ్రేయస్సు, అభివృద్ధి అవకాశాలను దెబ్బతీశాయి’ అని తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగపరమైన విచ్ఛిన్నం జరిగిందా అనే అంశంపై న్యాయ విచారణ జరిపించాలని హైకోర్టు కోరిన విషయం గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న కారణంగా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరగడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని.. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిల్లుల చెల్లింపుల కోసం 25 వేల కేసులు దాఖలయ్యాయని తెలిపారు. అనేక కేసుల్లో అధికారులు వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావడం, అరెస్టు, ధిక్కార కేసులు నమోదుతో బ్యూరోక్రసీ అవమానాలపాలైందని.. అధికారులను బలిపశువులను చేయడంతో పాటు పరిపాలన యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆక్షేపించారు. గవర్నర్ ఇంకా ఏం చెప్పారంటే...
అమరావతి కలను నీరు కార్చారు..
నవ్యాంధ్ర వృద్ధికి కేంద్ర బిందువుగా భావించిన అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశనమైంది. అమరావతి కలను నీరుగార్చేందుకు గత ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ ముసుగులో మూడు రాజధానుల ఆలోచనలతో ప్రజలను గందరగోళానికి గురిచేసింది. మూడు రాజధానుల ఏకపక్ష ప్రకటన ఫలితంగా రాజధానివాసులు 1,631 రోజులు నిరసన చేయాల్సి వచ్చింది. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్‌డీఏ) అధికార పరిధిని 6993 చ.కి.మీ.కు కుదించడం, ప్రాంతీయ బృహత్తర ప్రణాళికలను రూపొందించకుండా పక్కనబెట్టేయ డంతో అమరావతి ప్రాంత పురోగతిని అడ్డుకున్నాయి.
మౌలిక వసతులేవీ..?: గత ఐదేళ్లలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పూర్తికాలేదు. కొత్త పరిశ్రమలేవీ రాలేదు. రోడ్లు, భవనాలు, ఆస్పత్రులు, తాగునీటికి సంబంధించి ఎలాంటి మౌలిక సదుపాయాలు చేపట్టలేదు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరాన్ని పూర్తి చేయడం అత్యంత ముఖ్యం. కానీ గత ఐదేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తిగా పట్టాలు తప్పింది. కాంట్రాక్టులను రద్దుచేసి రివర్స్ టెండరింగ్‌ను ప్రవేశపెట్టి, ప్రాజెక్టుకు మాత్రమే కాకుండా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరం భూమికీ సాగునీటిని అందించాలనే భావన కు కూడా తీరని నష్టం చేశారు. రాష్ట్ర ఇంధన రంగం రూ.1,29,503 కోట్ల మేర భారీ నష్టాలకు గురైంది. ఐదేళ్లలో భూమి, గనులు, ఖనిజాలు, అడవుల వంటి సహజ వనరుల దుర్వినియోగం, దోపిడీ ఎక్కువయ్యాయి. భూ ఆక్రమణలు, ఇంటి స్థలాల పట్టాల కేటాయింపులో అక్రమాలు, భూ కేటాయింపులో ఉల్లంఘనలు, అనర్హులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, రీసర్వే, ఏపీ భూహక్కు చట్టం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఇసుక, ఖనిజ సంపదను కొల్లగొట్టడంతో ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. ఈ రంగాల్లో అక్రమ కార్యకలాపాల వల్ల ప్రాథమికంగా రూ.19 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ అనైతిక ఇసుక విధానం వల్ల 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. అసమర్థ, అసమంజస విధాన రూపకల్పన, అమల్లో అలసత్వం కారణంగా ఖనిజ రాబడిలో రూ.9,750 కోట్ల మేర నష్టం వచ్చింది. ఎర్రచందనంలో 2014-19 మధ్య రూ.1,623 కోట్ల ఆదాయం రాగా, గత ఐదేళ్లలో అక్రమ రవాణా కారణంగా ఆ ఆదాయం రూ.441 కోట్లకు పడిపోయింది. విశాఖపట్నంలోని రుషికొండ, మడ అడవుల విధ్వంసంతో రాష్ట్ర వారసత్వ సంపదను, సంస్కృతిని కూడా దెబ్బతీశారు.
జగన్‌తో రఘురామ ముచ్చట్లు
సభ్యులందరికీ అభివాదం చేస్తూ జగన్ సభలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ముందు వరుసలో ఉన్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును పలకరించా రు. జగన్ కదిలి ముందుకెళ్తుంటే రఘురామరాజు కాసేపు ఆపి ఏదో మాట్లాడడం కనిపించింది. ఈ సమయంలో సభ్యులంతా వారి వైపు దృష్టి సారించా రు. ఏం మాట్లాడుకుంటున్నారోనని ఆసక్తిగా గమనించారు. తర్వాత 10 నిమిషాలకు రఘురామ జగన్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లి ఏదో మాట్లాడడం ప్రా రంభించారు. ఒక నిమిషం పాటు ముచ్చటించడం క నిపించింది. అనంతరం సభ వెలుపల పలువురు జగన్‌తో ఏం మాట్లాడారని రఘురామరాజును ప్ర శ్నించారు. తాను కనిపించిన వెంటనే జగన్ హాయ్ అని పలకరించారని.. తన భుజంపై రెండుసార్లు చేయి వేసి మాట్లాడారని ఆయన తెలిపారు. రోజూ అసెంబ్లీకి రావాలని జగన్‌ను కోరానని, రెగ్యులర్‌గా వస్తాను.. మీరే చూస్తారుగా అని ఆయన చెప్పినట్లు తెలిపారు. తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ను లాబీలో రఘురామ కోరగా.. తప్పకుండా అని పయ్యావుల కేశవ్ నవ్వుతూ సమాధానమిచ్చారు.
సూపర్‌సిక్స్ అమలు దిశగా..
పరిపాలనను తిరిగి గాడిలో పెట్టడం చాలా సవాళ్లతో కూడిన పని. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రా రంభించింది. సూపర్ సిక్స్ హమీల అమలుకు కట్టుబడి ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటిం చాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, పింఛన్లను రూ.4 వేలకు పెంచడం, నైపుణ్య గణన నిర్వహించడం, పేదలకు నాణ్యమైన ఆహారాన్ని రూ.5లకు అందించేందుకు అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం, ఉచిత ఇసుక వంటి వివిధ చర్యల తో తన ట్రేడ్‌మార్క్ అయిన ప్రజాకేంద్రీకృత పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమర్థ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడాన్ని అన్ని ప్రయత్నాలూ చేస్తుందని విశ్వసిస్తున్నా. ఎన్నికల్లో గెలవడం, బాధ్యతలను స్వీకరించడం సంతోషకరమైన విషయమే అయినా.. దేశంలోనే మొదటిసారి గా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నందున సామరస్యపూర్వక పరిష్కారాలను త్వర గా కనుగొనాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను, అధికారులను కలిశారు. తెలంగాణ ప్రభుత్వంతోనూ సమావేశమయ్యారు.
పునర్నిర్మాణానికి సహకరించాలి..
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అపూర్వమైన తీర్పుతో ప్రజాహిత ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఐదు కోట్ల మంది ప్రజలు చూపిన సంకల్పా న్ని అభినందించాలి. అలాగే ప్రస్తుత ఆందోళనకర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వానికి సహకరించాలి. సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించడానికి సమష్టి ఆలోచన, మేధావులు, విద్యావేత్తలతో విస్తృతమైన చర్చలు అవసరం. 2047 నాటికి వికసిత్ భారత్ అ నే నూతన అభివృద్ధి నమూనా దృష్ట్యా స్వల్ప, మధ్య స్థ, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా అభివృద్ధి సంబంధిత వ్యవస్థను ప్రారంభించే చర్యలు తీసుకుంటాం.