8 లేన్ల విస్తరణ
ABN, Publish Date - Oct 29 , 2024 | 12:47 AM
తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న హైదరాబాద్ - విజయవాడ ఎన్‌హెచ్ - 65 విస్తరణకు అడుగు పడింది. ఈ మార్గాన్ని ఆరు వరసలుగా నిర్మించాలని తొలుత డీపీఆర్ రూపకల్పనకు టెండర్లు పిలిచినప్పటికీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన, ప్రజా ప్రతినిధుల అభ్యర్థన, స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు ఎనిమిది లేన్ల విస్తరణ అంశంపైనా ఎన్‌హెచ్ అధికారులు దృష్టి సారించారు.
- హైదరాబాద్ - విజయవాడ ఎన్‌హెచ్-65 అభివృద్ధికి అడుగులు
- డీపీఆర్ రూపకల్పన ప్రారంభం.. ఎన్టీఆర్ జిల్లాలో 87 కిలోమీటర్లు
- కోదాడ నుంచి గొల్లపూడి వరకు కొత్త ప్రతిపాదన
- ఆరు వరసలుగా చేయాలని ముందు నిర్ణయం
- ఆ తర్వాత 8 లేన్లకు పరిశీలించాలని నిర్దేశం
- 6, 8 వరసలపై అధ్యయనం చేస్తున్న కన్సల్టెన్సీ
- తుది డీపీఆర్ ప్రకారం ఎన్‌హెచ్ - 65 విస్తరణ
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హైదరాబాద్ - విజయవాడ ఎన్‌హెచ్ - 65 విస్తరణకు అడుగు ముందుకు పడింది. ఈ మార్గాన్ని ఆరు వరసలుగా నిర్మించాలని తొలుత డీపీఆర్ రూపకల్పనకు టెండర్లు పిలిచినప్పటికీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన, ప్రజా ప్రతినిధుల అభ్యర్థన, స్థానిక ప్రజల ఆకాంక్ష అయిన ఎనిమిది లేన్ల విస్తరణ అంశంపైనా ఎన్‌హెచ్ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు వాహనాల రద్దీపై కన్సల్టెన్సీ అధ్యయనం ప్రారంభించింది. తుది డీపీఆర్ ప్రకారం ఎన్‌హెచ్-65 విస్తరణ జరుగనుంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్- విజయవాడల మధ్య ఎన్‌హెచ్- 65ను ఎనిమిది వరసలుగా విస్తరించాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎనిమిది వరసలుగా విస్తరించేందుకు ఉన్న ఫీజుబిలిటీని అధ్యయనం చేయాల్సిందిగా నిర్దేశించింది. దీంతో ఎన్‌హెచ్ అధికారులు ప్రస్తుత డీపీఆర్‌లోనే 6, 8 వరసలకు సంబంధించి ఏది అవసరమో దానిని ఖచ్చితత్వంతో నిర్దేశించాల్సిందిగా కన్సల్టెన్సీకి సూచించారు. తుది డీపీఆర్ వచ్చిన తర్వాతే ఆరు వరసలా? ఎనిమిది వరసలా అన్న దానిపై స్పష్టత వస్తుందని విజయవాడ డివిజన్ ఎన్‌హెచ్ పీడీ శ్రీధర్ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ప్రస్తుత అవసరాల నేపథ్యంలో విజయవాడ-హైదరాబాద్ ఎన్‌హెచ్-65 ఎన్ని లేన్లు అవసరమో నిర్ణయించి భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్‌ను ఇవ్వవలసి ఉంది. ప్రస్తుతం ఎన్‌హెచ్ - 65 నాలుగు వరసలుగా ఉంది. విజయవాడ - హైదరాబాద్ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంది. ఈ రద్దీ కారణంగా రెండు నగరాల మధ్యన ప్రయాణం ఐదు గంటలకుపైగా సమయం పడుతోంది. వారాంతాలు, ప్రత్యేక సందర్భాలు, పండుగల వేళ అయితే ఇక చెప్పనక్కర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్‌హెచ్- 65ను ఆరు వరసలుగా విస్తరించాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో వస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో ఆరు వరసలుగా విస్తరించినా.. సరిపోదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రస్తుత అవసరాల రీత్యా ఆరు వరసలు చేయడం తధ్యం. రెండు తెలుగు రాష్ర్టాలను కలిపేటటువంటి జాతీయ రహదారి కావటంతో ఖచ్చితంగా దీర్ఘకాలిక అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చూస్తే కన్సల్టెన్సీ ఎనిమిది వరసలుగా విస్తరించేందుకు ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది.
వాహన రాకపోకలపై అధ్యయనం
హైదరాబాద్ - విజయవాడల మధ్య వాహనాల రద్దీపై కన్సల్టెన్సీ సంస్థ అధ్యయనం ప్రారంభించింది. ఇందులో భాగంగా కలకత్తా నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలతో పాటు, మచిలీపట్నం, గుంటూరు మీదుగా వచ్చే వాహన రాకపోకలపై అధ్యయనం చేపట్టింది. దీని కోసం ఇంజనీరింగ్ విద్యార్థులతో టోల్‌గేట్ల దగ్గర వాహన గణాంకాలను నమోదు చేయిస్తున్నారు. వాహనాల రద్దీ ప్రాతిపదికన కూడా ఎనిమిది వరసలుగా విస్తరించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో కీసర, చిల్లకల్లు టోల్‌గేట్ల దగ్గర, కృష్ణాజిల్లాలో పొట్టిపాడు టోల్ ప్లాజా, దావులూరు టోల్‌ప్లాజాల దగ్గర వాహన లెక్కలు తీస్తున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. విజయవాడ - హైదరాబాద్ మార్గంపై వాహనాల రద్దీని తెలుసుకోవటమనేది ఒకటైతే.. ఈ వాహనాల ఆధారంగా టోల్ చార్జీల వసూలు అంచనాలకు రావడం మరో కారణం.
87 కిలో మీటర్ల మేర విస్తరణ
విజయవాడ - హైదరాబాద్‌ల మధ్య ఎన్‌హెచ్-65 విస్తరణ ఎన్టీఆర్ జిల్లాలో 87 కిలో మీటర్ల మేర సాగనుంది. విజయవాడను ఆనుకుని గొల్లపూడి నుంచి కోదాడ వరకు 6/8 వరసలుగా విస్తరించనున్నారు. గతంలో కోదాడ నుంచి నందిగామ వరకు మాత్రమే 6 వరసల విస్తరణ ప్రతిపాదన ఉంది. నందిగామ వరకు విస్తరించటం కంటే విజయవాడ దగ్గర వరకు తీసుకురావటం మంచిదన్న ప్రతిపాదనలు రావటంతో.. ఎన్‌హెచ్ అధికారులు కూడా గొల్లపూడి వరకు పొడిగించారు. ఈ మేరకు డీపీఆర్ తయారు చేయాల్సిందిగా కన్సల్టెన్సీకి కూడా నిర్దేశించారు.
ఇది కూడా చదవండి:
సీఎంకాగానే మమ్మల్ని పక్కన పడేశారు
Updated Date - Oct 29 , 2024 | 07:27 AM