Ram Mohan Naidu: ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ABN, Publish Date - Nov 29 , 2024 | 07:54 PM
ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయం కోసం పని చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పాటు కృష్ణా, కర్ణాటక ఫెస్టివల్ జరగబోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారని వెల్లడించారు.
ఢిల్లీ: కేంద్ర టూరిజం శాఖ గండికోట, పుష్కర్ ఘాట్‌కు నిధులు విడుదల చేసిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. రాష్ట్రంలో గండికోటకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ప్రజలకు కూడా ఉపయోగ పడేలా అభివృద్ధి చేస్తామని వివరించారు. రాజమహేంద్రవరం కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని పుష్కర్ ఘాట్ నిర్మాణం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయం కోసం పని చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పాటు కృష్ణా, కర్ణాటక ఫెస్టివల్ జరగబోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారని తెలిపారు. అరసవిల్లిని ప్రసాద్ స్కీమ్‌లో పెట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. పర్యాటకానికి అవకాశం ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరామని అన్నారు. కేంద్ర సహకారం తీసుకుని ఏపీని అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
కేంద్రప్రభుత్వం నిధులు..
కాగా.. అమెరికాలోని గ్రాండ్ క్యాన్యన్ తరహాలో గండికోటను అభివృద్థి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పారు. గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్లను మంజూరు చేసినందుకు కేంద్రప్రభుత్వానికి, కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
చరిత్రాత్మక గండికోట వైభవాన్ని పునరుద్ధరించడానికి, పర్యాటకంగా అభివృద్థి చేయడానికి కేంద్రప్రభుత్వం ఆ నిధులు మంజూరు చేసింది. కోట అభివృద్థితో పాటు స్థానిక నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆ నిధులను వినియోగించనున్నారు. కాగా, గండికోట ప్రాభవం, ప్రాశస్త్యం భవిష్యత్ తరాలకు తెలియజేసేలా అభివృద్థి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈనెల 4న లేఖ రాశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ నిధుల మంజూరుకు కృషి చేశారు.
Updated Date - Nov 29 , 2024 | 08:04 PM