YS Sharmila: విద్యుత్ చార్జీలపై వైఎస్ షర్మిల
ABN, Publish Date - Nov 05 , 2024 | 02:57 PM
విద్యుత్ ఛార్జీలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఛార్జీలు పెంచొద్దని ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపటినుంచి ఆందోళన చేపడుతామని వైఎస్ షర్మిల ప్రకటించారు.
విజయవాడ: విద్యుత్ ఛార్జీలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గళమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాల గురించి ప్రస్తావించారు. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి, ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తిన మోపేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీల వసూళ్ళ విషయంలో మా తప్పేం లేదని, మాకసలు సంబంధమే లేదని, భారం మాది కాదని, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారని విరుచుకుపడ్డారు.
ప్రజలకు కరెంట్ షాక్
విద్యుత్ ఛార్జీల గురించి కూటమి ప్రభుత్వ తీరును వైఎస్ షర్మిల తప్పు పట్టారు. ‘విద్యుత్ ఛార్జీలపై సర్కార్‌ది సర్దుబాటు కాదు ఇది, ప్రజలకు "సర్దుపోటు". కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్. విద్యుత్ ఛార్జీల విషయంలో వైసీపీ చేసింది పాపం అయితే రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతుంది శాపం. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధం? ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా ? ఐదేళ్లలో వైసీపీ భారం రూ.35 వేల కోట్లు అయితే 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా? వైసీపీకి మీకు ఏంటి తేడా ? వైసీపీ 9 సార్లు ఛార్జీలు పెంచిందని, కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే, తప్పు ఎవరు చేసినా ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దనే చిత్తశుద్ది మీకుంటే.. వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయండి అని’ వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రధానిని అడగండి
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని గల్లా పట్టి అడగండి. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోబోం. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది. ప్రజల ముక్కు పిండి ట్రూఅప్ ఛార్జీల రూపంలో, అధిక కరెంటు బిల్లులు వసూల్ చేయడం దారుణం. వసూల్ చేయడాన్ని నిరసిస్తూ రేపటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తున్నాం అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష
AP HighCourt: ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసు.. హైకోర్టులో వైసీపీ నేతకు షాక్
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 05 , 2024 | 03:28 PM