AP News: హోంమంత్రి అనితకు ఏపీ హైకోర్టులో ఊరట.. ఎందుకంటే..
ABN, Publish Date - Dec 10 , 2024 | 06:46 PM
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. అనితపై 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది. తన వద్ద తీసుకున్న రూ.70 లక్షల అప్పు చెల్లించేందుకు అనిత ఇచ్చిన చెక్ చెల్లలేదని పిటిషన్ దారుడు వేగి శ్రీనివాసరావు కేసు పెట్టారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. అనితపై 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది. తన వద్ద తీసుకున్న రూ.70 లక్షల అప్పు చెల్లించేందుకు అనిత ఇచ్చిన చెక్ చెల్లలేదని పిటిషన్ దారుడు వేగి శ్రీనివాసరావు కేసు పెట్టారు. దీనిపై విశాఖపట్నం కోర్టులో విచారణ జరగగా.. అనంతరం ఆ కేసు కాస్త ఏపీ హైకోర్టుకు చేరింది. అయితే తాజాగా హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు శ్రీనివాసరావు రాజీ కుదుర్చుకున్నారు. కేసు విచారణలో భాగంగా ఇవాళ (మంగళవారం) దృశ్య మాధ్యమం ద్వారా హోంమంత్రి, ఫిర్యాదు దారుడు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఈ మేరకు తాము రాజీ కుదుర్చుకున్న విషయాన్ని కోర్టుకు నివేదించారు. వివరాలు నమోదు చేసుకున్న హైకోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
కాగా, తనపై నమోదైన చెక్‌బౌన్స్ కేసు విషయంలో హైకోర్టును హోంమంత్రి వంగలపూడి అనిత ఆశ్రయించారు. ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరిందని, ఈ మేరకు తనపై విశాఖ 7వ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆమె కోరారు. దీనికి సంబంధించిన విచారణ ఈనెల 3న జరిగింది. అయితే ఇరుపక్షాలు ఏ విధంగా రాజీ కుదుర్చుకున్నారో చెప్పకపోవడాన్ని ఆక్షేపించింది హైకోర్టు. అలాగే పిటిషనర్ శ్రీనివాసరావుతో ధర్మాసనం నేరుగా మాట్లాడింది. ఎంత మెుత్తానికి రాజీ కుదుర్చుకున్నారని ప్రశ్నించింది. అనితపై తప్పుడు కేసు పెట్టారంటూ కింది కోర్టులో వచ్చిన అభియోగాలపైనా ఆరా తీసింది.
అయితే తాను తప్పుడు కేసు పెట్టలేదని శ్రీనివాసరావు కోర్టుకు చెప్పారు. నగదు కోసం తిరగలేకే రాజీ చేసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. హోంమంత్రి అనిత తరఫు న్యాయవాది సైతం ఇద్దరూ రాజీ కుదుర్చుకున్నట్లు హైకోర్టుకు తెలిపారు. అయితే దానికి రాజీకి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక అందించాలని అనితను న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు కేసు విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేసింది. కాగా, ఇవాళ జరిగిన విచారణలో అనిత ఇచ్చిన నివేదికపై సంతృప్తి చెందిన ధర్మాసనం విశాఖ కోర్టులోని కేసును కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakha: జాయ్ జమీమా.. మాజీ ఎంపీ హర్ష కుమార్ వ్యాఖ్యలను ఖండించిన బాధితుడి తల్లి..
vasamsetti subhash: అసలు జగన్‌కు మతిస్థిమితం ఉందా..
Updated Date - Dec 10 , 2024 | 07:05 PM