నాకు బిర్యానీ పెట్టండి
ABN, Publish Date - Oct 30 , 2024 | 04:37 AM
నాకు బిర్యానీ తినాలని ఉంది. తెప్పించండి. లేదా ఇంటి నుంచైనా ఆహారం తెప్పించండి అని బోరుగడ్డ అనిల్ పోలీసు అధికారులను కోరారు.
ఇంటి నుంచైనా తెప్పించండి.. కస్టడీలో బోరుగడ్డ డిమాండ్
ఒప్పుకోని గుంటూరు పోలీసులు .. స్థానిక మెస్ నుంచే భోజనం
మట్టి గడ్డలు, రాళ్లు ఉన్న అన్నం పెట్టారని జడ్జికి అనిల్ ఫిర్యాదు
విచారణలో బోరుగడ్డ అబద్ధాలపై నివేదిక సిద్థం చేసిన పోలీసులు
గుంటూరు అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ‘‘నాకు బిర్యానీ తినాలని ఉంది. తెప్పించండి. లేదా ఇంటి నుంచైనా ఆహారం తెప్పించండి’’ అని పోలీస్ కస్టడీలో ఉన్న వైసీపీ సానుభూతిపరుడు, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్‌కు పోలీసులు ససేమిరా అన్నారు. సాధారణ నిందితులకు తెప్పించే విధంగానే మెస్ నుంచి భోజనం తెప్పించారు. అయితే, మంగళవారం బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు న్యాయాధికారి ఎదుట హాజరుపరిచిన సమయంలో ఆయన ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ‘‘నాకు మట్టి గడ్డలు, రాళ్లు ఉన్న అన్నం పెట్టారు’’ అని చెప్పారు. దీనికి న్యాయాధికారి స్పందిస్తూ తాము తినేది కూడా అదే భోజనమని అనడంతో అనిల్ మిన్నకుండిపోయారు. అనిల్‌ను కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో ఆది, సోమవారాల్లో అరండల్‌పేట ేస్టషన్‌లో పోలీసులు విచారించారు. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మంగళవారం గుంటూరులోని జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం, ఆయనను ఐదవ అదనపు మున్సిఫ్ మెజిరేస్టట్ కోర్టులో హాజరు పరచగా న్యాయాధికారి మళ్లీ రిమాండ్ విధించడంతో అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
చర్చనీయాంశంగా బోరుగడ్డ వ్యాఖ్యలు
కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల నిమిత్తం బోరుగడ్డను జీజీహెచ్‌కు తీసుకెళ్లిన సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తరువాత ఆయన పేరుతో ప్రకటనలు కూడా విడుదల చేశారు. తన వ్యక్తిత్వ హననం జరిగిందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇదిలావుంటే, పోలీసుల విచారణ సందర్భంగా కూడా అనిల్ తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారంటూ చెప్పగా పోలీసులు ‘‘నువ్వు ఇతర జిల్లాలకు వెళ్లి బోరుగడ్డ అనిల్ అనే పేరు గురించి ఎవరినైనా అడిగితే వారు ఎలాంటి కామెంట్ చేస్తారో ఒకసారి విను’’ అని సలహా ఇచ్చారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలకు తాను జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారానే సమాధానం చెప్తానని బోరుగడ్డ హెచ్చరించారు. ఇదంతా రాజకీయ కక్షని, తాను జగన్ అన్నకు సానుభూతిపరుడుగా ఉన్నానని, జగన్ అన్న మనిషినని కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసుల కస్టడీ ముగీయడంతో అరండల్‌పేట పోలీసులు మంగళవారం మధ్యాహ్నం బోరుగడ్డ అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.
వచ్చేది తమ ప్రభుత్వమే అంటూ..
అయితే, గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మే 9న రాత్రి తుళ్లూరులో జరిగిన రెండు ఘటనల్లో బోరుగడ్డ అనిల్ నిందితునిగా ఉన్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి, హౌసింగ్ ఏఈ గోపికృష్ణను బెదిరించారు. బోరుగడ్డ అనిల్ రెండు కార్లలో రావడంతో అక్కడ విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ వి. ప్రసాద్ ఆయా కార్లను తనిఖీ చేేసేందుకు ప్రయత్నించగా ఆయనను తీవ్ర స్థాయిలో బెదిరించారు. రాబోయేది తమ ప్రభుత్వమని, మేం వైసీపీ నాయకులమని, మా వాహనాలు తనిఖీ చేస్తారా అంటూ బెదిరించారు దీనిని చిత్రీకరించిన ఏబీఎన్ విలేకరిపై కూడా దాడి చేశారు. ఏఎస్‌ఐ ప్రసాద్ ఫిర్యాదు మేరకు తొలుత పోలీస్‌స్టేషన్‌లో బోరుగడ్డ అనిల్, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. ఆ తరువాత అనిల్ సమీపంలో ఉన్న ఓ రూములోకి తన అనుచరులతో దౌర్జన్యంగా వెళ్లి అక్కడ ఉన్న ఒడిశా రాష్ర్టానికి చెందిన యువకుడిపై దాడికి ప్రయత్నించారు. ఆ గదిలో టీడీపీ జెండాలు ఉండడంతో వారు ప్రస్తుత కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరులు అంటూ ఒడిశాకు చెందిన హేమచంద్రపై దాడి చేసి కొట్టారు. దీనిపై కూడా తుళ్లూరు పోలీస్ ేస్టషన్లో కేసు నమోదు అయింది. ఆ రెండు కేసుల్లో నిందితుడైన బోరుగడ్డను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి బుధవారం మంగళగిరి కోర్టులో హాజరు పరచనున్నారు. మరోవైపు, బోరుగడ్డపై శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ పలు కేసులు నమోదైనట్లు సమాచారం.
బోరుగడ్డ అబద్థాలపై నివేదిక సిద్థం
అరండల్‌పేట పోలీస్ ేస్టషన్‌లో నమోదైన కేసులో రెండు రోజులపాటు పోలీసులు అనిల్‌ను విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాధానం చెప్పినట్లు పోలీసులు నిర్ధారించారు. కనీసం ఫోన్ నెంబర్ కూడా తనకు తెలియదని చెప్పడాన్ని పోలీసు తప్పుబడుతున్నారు. ప్రాథమికమైన అంశాల్లోనూ కేసులు తప్పుదారి పట్టించేలా అబద్థాలు చెప్పారని పేర్కొంటూ నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు.
ఇది కూడా చదవండి:
వంశీ కోసం.. లాయర్ వేషం
పెట్టుబడులకు ఇదే మంచి సమయం ఏపీకి రండి
జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయ్
Updated Date - Oct 30 , 2024 | 07:55 AM