ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమరావతికి అందలం

ABN, Publish Date - Nov 12 , 2024 | 06:29 PM

అమరావతికి అందలం.. సంక్షేమానికి జవసత్వాలు.. వివిధ పథకాలకు పూర్వ వైభవం.. పడకేసిన సాగునీటి ప్రాజెక్టులకు పునరుజ్జీవం.. గత వైసీపీ ఐదేళ్లలో పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రతి రంగాన్ని గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

అమరావతి

రాష్ట్ర బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు

సంక్షేమానికి జవసత్వాలు.. పథకాలకు పూర్వవైభవం

రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులకు రూ.4 వేల కోట్లకు పైగా

మెట్రో రైలుకు రూ.50 కోట్లు, హైకోర్టు భవనాలకి రూ.13.3 కోట్లు

కృష్ణా డెల్టాకు రూ.138.76 కోట్లు.. భూసేకరణకు మరో రూ.50 కోట్లు

పులిచింతల నిర్వహణకు రూ.29.45 కోట్లు.. గుండ్లకమ్మకు రూ.13 కోట్లు కేటాయింపు


అమరావతికి అందలం.. సంక్షేమానికి జవసత్వాలు.. వివిధ పథకాలకు పూర్వ వైభవం.. పడకేసిన సాగునీటి ప్రాజెక్టులకు పునరుజ్జీవం.. గత వైసీపీ ఐదేళ్లలో పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రతి రంగాన్ని గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతో పాటు ఆయా రంగాలపై బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రాథాన్యం ఇవ్వడంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు జరగడంతో ఇక అభివృద్ధి పనులు పరుగులు తీయనున్నాయి. గత పాలనలో పూర్తిగా నిర్వీర్యమైన సాగునీటి రంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలో కృష్ణా డెల్టా, పులిచింతలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అదేవిధంగా భారీ వర్షాలతో తెగిపోయి రైతులను నిండా ముంచేస్తోన్న సాగునీటి కాల్వల బాగుకు కూడా నిధులు కేటాయింపులు జరిగాయి. ఇక విద్యా పరంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌, విదేశీ విద్య కోసం గతంలో అమలు చేసిన అంబేడ్కర్‌ విదేశీ విద్యోన్నతి పథకం పునరుద్ధరణతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


గుంటూరు, బాపట్ల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా పడకేసిన రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు నీర్వీర్యమైన వివిధ రంగాలు, ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా దృష్టి సారించింది. సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో కూడా ఆయా అంశాలకు ప్రత్యేకంగా ప్రాథాన్యం ఇచ్చారు. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల 20 రోజుల్లో ముగియనున్న దృష్ట్యా ఆ మేరకు ఆశాజనకంగానే కేటాయింపులు చేసింది. ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రతి రంగాన్ని గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతికి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై బడ్జెట్లో ప్రస్తావనకు కూడా నోచుకోని అమరావతికి కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్లో అత్యంత ప్రాథాన్య అంశంగా కనిపించింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. అమరావతి క్యాపిటల్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా రూ.3 వేల కోట్లు కేటాయించింది. స్మార్ట్‌ సిటీల కార్యక్రమంలో భాగంగా అమరావతికి వేర్వేరుగా నిధుల కేటాయింపు జరిగింది. ఇందులో సీఐటీఐఐఎస్‌ చాలెంజ్‌ ప్రోగ్రామ్‌ కింద రూ.32 కోట్లు, మిషన డెవలప్‌మెంట్‌ స్మార్ట్‌సిటీలో అమరావతికి రూ.50 కోట్లు కేటాయించారు. ఏపీసీఆర్‌డీఏ సహాయ నిధి కింద బడ్జెట్‌లో రూ.1053.70 కోట్లు కేటాయించారు. ల్యాండ్‌ పూలింగ్‌ ఫర్‌ కేపిటల్‌ సిటీ కోసం రూ.400 కోట్లు కేటాయించారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించిననాటి నుంచి మెట్రో రైలు ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలను ఊరిస్తూనే ఉంది. 2014- 19ల మధ్య ప్రాఽథాన్యతను సంతరించుకున్న ఈ ప్రాజెక్టు 2019- 24 మధ్య వైసీపీ హయాంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదు. తాజా బడ్జెట్లో మెట్రో రైలు విభాగానికి రూ.50 కోట్లు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పట్ల తన చిత్తశుద్ధిని ప్రకటించింది. దీంతోపాటు హైకోర్టు భవనాల నిర్మాణాల కోసం రూ.13.3 కోట్లు, ఏపీ సైన్స సిటీ కోసం రూ.2.6 కోట్లు కేటాయించింది. అమరావతికి బడ్జెట్‌ కేటాయింపులు జరిగిన సోమవారం రోజే రాజధాని అమరావతి మరో మైలురాయిని అధిగమించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి వస్తున్న నిధులకు సంబంధించి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులతో సీఆర్డీఏ కమిషనర్‌ సంతకాలతో రుణ ఒప్పందం పూర్తయి నిధులు మంజూరవనున్నాయి. ఇక మంగళగిరిలోని ఎయిమ్స్‌లో నీటి సరఫరా కోసం రూ.5 కోట్లు కేటాయించారు.


సేతు బంధన కింద రూ.115.2 కోట్లు

కేంద్ర ప్రభుత్వ పథకమైన సేతబంధన కింద చేపట్టబోతున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జీల నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.115.2 కోట్లను చూపించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఆర్‌వోబీలు మంజూరైనప్పటికీ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ చొరవతో గుంటూరులోని శంకర్‌విలాస్‌ ఆర్‌వోబీ విస్తరణకు వేగవంతంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్‌లో సేతబంధన కింద కేటాయించిన రూ.115.2 కోట్లలో సింహభాగం నిధులు శంకర్‌విలాస్‌ ఆర్‌వోబీకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.


ఎన్జీ రంగా వర్సిటీకి.. రూ.507 కోట్లు

గుంటూరు సిటీ: గుంటూరు సమీపంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. వైసీపీ హయాంలో వర్సిటీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇటీవల రంగా జయంతి కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు వర్సిటీకి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అందుకును అనుగుణంగా బడ్జెట్‌లో రూ.507 కోట్లు కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుతో వర్సిటీకి ప్రభుత్వం జీవం పోసినట్లైంది. భూసార పరీక్షలకు పెద్ద పీట వేయడంతో పాటు, రైతులకు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ కృతనిశ్చయం ఈ నిధుల కేటాయింపుతో నెరవేరుతుందని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. రైతులకు యంత్ర పరికరాలు, క్రమం తప్పకుండా భూసార పరీక్షలు, ఉద్యాన పంటలకు రాయితీలు, ఆక్వాసాగుకు ప్రోత్సహకాలకు కూటమి ప్రభుత్వం సుమచిత ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా యంత్ర పరికరాలకు దాదాపు రూ.11 కోట్లు, భూసార పరీక్షలకు రూ.3 కోట్ల వరకు కేటాయింపు ఉండొచ్చని తెలుస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌కు రూ.2.50 కోట్లు, ఉద్యాన పంటల రాయతీల కింద రూ.300 కోట్ల వరకు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. వడ్డీలేని రుణాలలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వాటా రూ.45 కోట్ల వరకు , రైతు సేవా కేంద్రాలకు సంబంధించి రూ.3 కోట్ల వరకు నిధుల కేటాయింపు దక్కే అవకాశం ఉంది.


సాగునీటి ప్రాజెక్టులకు పునరుజ్జీవం

పడకేసిన సాగునీటి ప్రాజెక్టుల పునరుజ్జీవానికి కూటమి ప్రభుత్వం భారీగా నిధుల కేటాయించింది. గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో కృష్ణా పశ్చిమ డెల్టా కింద 5.50 లక్షల ఎకరాలు సాగవుతుండగా రూ.138.76 కోట్లు కేటాయించారు. డెల్టా కింద భూసేకరణ కోసం రూ.50 కోట్లను కేటాయించారు. ఇది గుంటూరు చానల్‌ పొడిగింపు ప్రాజెక్టు కోసమా.. గోదావరి - పెన్నా నదుల అనుసంధానం కోసమా అనేది తేలాల్సి ఉన్నది. డెల్టాలో పెండింగ్‌లో ఉన్న ఆధునికీకరణ పనుల పూర్తిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.37.53 కోట్లను కేటాయించింది. దీంతో ఆయా పనులు పూర్తి అవుతాయని అధికారవర్గాలు తెలిపాయి. పులిచింతల ప్రాజెక్టు నిర్వహణని కూడా గత ప్రభుత్వం మరిచింది. దాంతో ఒక దఫా భారీ వరద వచ్చినప్పుడు రేడియల్‌ క్రెస్టు గేటు కొట్టుకుపోయింది. దాని స్థానంలో స్టాప్‌లాక్‌ గేటు అమర్చేందుకు జలాశయంలోని నీటిని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేయించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పులిచింతల ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ.29.45 కోట్లను కేటాయించింది. దీని వలన నిర్వహణ పనులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గత ప్రభుత్వ వైఫల్యంతో ఏకంగా గేట్లే కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.13 కోట్ల నిధుల కేటాయింపు జరిగింది. ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో పరిధిలో ఉన్నా బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గ ప్రజలకు సాగునీటి విషయంలో గుండ్లకమ్మ దోహదపడుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో కాల్వలు, వాగుల గట్లు తెగిపోయి పంటలు నీట మునిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద నియంత్రణ ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో రూ.19.55 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది.


గోతుల్లేని రోడ్ల కోసం..

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో రోడ్ల మరమ్మతుల కోసం దాదాపు వెయ్యి కోట్ల వరకు అవసరమవుతుందనే అంచనాలను రూపొందించారు. ప్రభుత్వం తాజాగా జరిపిన కేటాయింపుల్లో భాగంగా జిల్లాలకు ఇతోధికంగానే వాటా దక్కనున్నట్లు గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కింద రూ.800 కోట్లు, ఆర్‌అండ్‌బీ కింద వెయ్యి కోట్ల వరకు నిధులు మూడు జిల్లాల పరిధిలో దక్కనున్నాయి.


సంక్షేమం.. నైపుణ్యం

నామినేటెడ్‌ పదవుల కోసమే అన్నట్లుగా వెనకబడిన వర్గాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని కుదేలు చేసిన ఘనత గత ప్రభుత్వానిది కాగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు ఆయా వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్‌లో ఇతోధికంగా నిధులు కేటాయించింది. ఎస్సీ సంక్షేమం కింద దాదాపు రూ.600 కోట్లు, ఎస్టీ వెల్ఫేర్‌ కింద రూ.200 కోట్లు, బీసీ సంక్షేమం కింద దాదాపుగా రెండు వేల కోట్లవరకు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. నైపుణ్యాభివృద్ధి కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధుల కేటాయించగా ఈ నిధుల వ్యయంలో గుంటూరు, బాపట్ల జిల్లాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలకు అంకురార్పణ జరిగే అవకాశాలున్నాయి.

Updated Date - Nov 13 , 2024 | 09:06 AM