హే రఘురాం
ABN, Publish Date - Oct 29 , 2024 | 05:44 AM
నాడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ సంపాదించిన అక్రమాస్తుల్లో రఘురాం సిమెంట్స్ ముఖ్యమైనది.
నాడు జగన్మాయలు ఎన్నెన్నో
నాడు జగన్ పెట్టుబడి 45 కోట్లే
2008కి ఆ విలువ 6,500 కోట్లు
భారతి సిమెంట్స్‌గా పేరు మార్పు
ప్రస్తుత వాటా 20 వేల కోట్లకు పైనే
తండ్రి సీఎంగా ఉన్నప్పుడు 2006లో
జగన్ చేతికి రఘురాం సిమెంట్స్
కడప జిల్లాలో అడ్డగోలుగా 2 వేల
ఎకరాల సున్నపురాయి గనులు లీజుకు
గతంలోనే సీబీఐ తీవ్ర అభియోగాలు
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని
క్విడ్ ప్రోకోకు పాల్పడినట్టు ఆరోపణలు
దాల్మియాకు 1017 ఎకరాల గనులు లీజుకు
ప్రతిఫలంగా భారతిలో 50 కోట్ల పెట్టుబడి
దాల్మియాతో క్విడ్ ప్రోకో
భారతి సిమెంట్స్‌కు చెందిన షేర్లను దాల్మియా సిమెంట్స్ కొనుగోలు చేయడం వెనుక క్విడ్ ప్రోకో జరిగింది. నాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వందాల్మియా సిమెంట్స్‌కు కడప జిల్లాలో 1017 ఎకరాల సున్నపు రాయి గనులను 30 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా భారతి సిమెంట్స్‌లో దాల్మియా రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టింది. దాల్మియాకు గనుల లీజు వ్యవహారంపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాలను.. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్, కార్యదర్శి వై.శ్రీలక్ష్మి పక్కాగా అమలు చేశారు. గనుల అక్రమాల గురించి సీబీఐ విచారణలో నాటి ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ఎ.దయాకరరెడ్డి, ఆ శాఖ సూపరింటెండెంట్ కె.వెంకట్రావు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం ‘ఆంధ్రజ్యోతి’కి చిక్కింది.
ఓ కంపెనీలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రెండేళ్లలో ఎంత సంపాదించవచ్చు? రెండు లక్షలు.. మూడు లక్షలు..? ప్చ్.. కష్టమే! అలాంటిది.. ఏకంగా 144 రెట్లు సంపాదిస్తే..? కచ్చితంగా ‘వింతే’. దిగ్గజ పారిశ్రామిక వేత్తలకు సైతం సాధ్యం కాని విధంగా మాజీ సీఎం జగన్ ఇలా ఆస్తులు పోగేసుకున్నారు. ఎలా సాధ్యమో ఆయనకు మాత్రమే తెలుసు!
తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006లో రఘురాం సిమెంట్స్ జగన్ చేతికి వచ్చింది. ఈ కంపెనీలో 82 శాతం వాటాగా జగన్, ఆయన బంధువులు, స్నేహితులు పెట్టిన పెట్టుబడి రూ.45 కోట్లు. 2008 నాటికి జగన్ అండ్ కో వాటాల విలువ ఏకంగా రూ.6,500 కోట్లకు పెరిగింది. రఘురాం సిమెంట్స్‌నే భారతి సిమెంట్స్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ కంపెనీకి జగన్ ప్రమోటర్ కాగా, ఆయన భార్య భారతి యజమాని. ఇప్పుడు వారి వాటా విలువ 20 వేల కోట్లకు పైనేనని అంచనా!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నాడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ సంపాదించిన అక్రమాస్తుల్లో రఘురాం సిమెంట్స్ ముఖ్యమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కడప జిల్లాలో ఈ కంపెనీకి దాదాపు 2 వేల ఎకరాల గనులు కేటాయించారు. వైఎస్ ఆదేశాలతో అన్ని స్థాయుల్లో అధికారులు ఇందుకు సహకరించారు. కడప జిల్లాలో అప్పటికే ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన గుజరాత్ కంపెనీ అంబూజా సిమెంట్స్ లిమిటెడ్‌ను బలవంతంగా పక్కకు తప్పించి మరీ కట్టబెట్టారు. ఎవరో స్థాపించిన కంపెనీకి జగన్ యజమాని అయ్యారు. నాడు తనయుడి కోసం వైఎస్ అడ్డదారులు తొక్కగా, జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడి పెట్టుబడులు పెట్టించుకున్నారు. కడప జిల్లాలోనే దాల్మియా సిమెంట్స్‌కు వెయ్యి ఎకరాల సున్నపురాయి గనులు లీజుకిచ్చి ప్రతిఫలం పొందారు. భారతి సిమెంట్స్‌లో దాల్మియా 50 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇలా స్వల్ప వ్యవధిలోనే జగన్ వేల కోట్లు సంపాదించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నాడు జగన్ అక్రమాస్తుల కేసులో దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్న అంశాలివీ. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే 2008లో రఘురాం సిమెంట్స్ పేరును భారతి సిమెంట్స్‌గా మార్చేశారు.
45 కోట్ల నుంచి 6,500 కోట్లకు
రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ అక్రమాస్తులను భారీగా సంపాదించారు. జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కట్టేవారు. మార్కెట్లో జగన్ కంపెనీ షేర్లు అమాంతం పెరిగేవి. పెట్టుబడిదారులు ఉదారంగా అత్యధిక మొత్తంతో వాటాలు కొనేవారు. అంతా క్విడ్ ప్రోకో వ్యవహారం అన్నమాట. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ‘మేళ్లు’ పొందినవారు జగన్‌కు లబ్ధి చేకూర్చడానికి ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారు. రఘురాం సిమెంట్స్ వ్యవహారం కూడా ఇలాంటిదే. రఘురాం సిమెంట్స్‌ను 1999లో స్థాపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2006లో ఈ కంపెనీ జగన్ చేతికి వచ్చింది. ఈ కంపెనీలో జగన్ అండ్ కో పెట్టిన పెట్టుబడి రూ.45 కోట్లే. అయితే రెండేళ్లలోనే కంపెనీలో వాటాల విలువ ఏకంగా రూ.6,500 కోట్లకు చేరింది. కంపెనీలో ఒక్కొక్కటి రూ.10 ముఖ విలువ కలిగిన ఐదున్నర కోట్ల షేర్లు ఉండగా... ఇందులో 82 శాతం వాటాకు జగన్ అండ్ కో కేవలం రూ.45 కోట్లు సమకూర్చగా... మిగిలిన 18 శాతం వాటాకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడి మొత్తం రూ.129 కోట్లు. దాల్మియా సిమెంట్స్, మ్యాట్రిక్స్ నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన జీ2 కార్పొరేట్ సర్వీసెస్ దాదాపు రూ.112 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. నిమ్మగడ్డ ప్రసాద్ వ్యక్తిగత హోదాలో మరో రూ.8 కోట్లు పెట్టారు. దాల్మియా సిమెంట్స్ 2007 మార్చి 29వ తేదీన 16.66 లక్షల షేర్లను ఒక్కోదాన్ని రూ.110 ముఖ విలువకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరోసారి 2008 ఫిబ్రవరి 26న దాల్మియా 1,37,931 షేర్లను ఒక్కోదాన్ని రూ.1440 చొప్పున కొనుగోలు చేసింది. ఏడాదిలోనే షేర్ విలువ ఏకంగా 13 రెట్లు పెరిగిపోవడం గమనార్హం. ఒకవైపు రఘురాం సిమెంట్స్‌లో అధిక ధరలకు షేర్లు కొంటూనే... అదే సమయంలో కడప జిల్లాలోనే జగన్ కంపెనీకి సమీపంలో దాల్మియా కూడా సిమెంట్ కంపెనీని స్థాపించింది. ఇదే గమ్మత్తైన విషయం. దీని వెనుక క్విడ్ ప్రోకో జరిగిందన్నది ఆరోపణ. 2007 ఏప్రిల్ 9వ తేదీన జీ2 కార్పొరేట్ సంస్థకు రూ.94 చొప్పున 64.42 లక్షల షేర్లను జగన్ కేటాయించారు. 2007సెప్టెంబరులో ఇండియా సిమెంట్స్ రూ.110 చొప్పున 12.5 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. మరో రెండు నెలలకు నిమ్మగడ్డ ప్రసాద్ రూ.175 చొప్పున 4.59 లక్షల షేర్లను కొన్నారు. ఇలా భారీ ధరలకు షేర్లు కొనుగోలు చేయడంతో కంపెనీ విలువ, జగన్ వాటా అమాం తం పెరిగిపోయాయి. రఘురాం/భారతి సిమెంట్స్ ప్రధాన ప్రమోటర్ జగన్, ఆయన బంధువుల (నికర పెట్టుబడి రూ.45 కోట్లు) విలువ 2008నాటికి ఏకంగా రూ.6,500 కోట్లకు చేరింది.
2000 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ముడిసరుకు కోసం నిక్షేపాలను కేటాయించాలంటే గనుల శాఖ గింగిరాలు తిప్పుతుంది. కానీ నాడు రఘురాం సిమెంట్స్‌కు గనుల శాఖ రెడ్‌కార్పెట్ పరచిమరీ కడప జిల్లాలో 2000 ఎకరాల సున్నపురాయి నిక్షేపాలను కట్టబెట్టింది. కడప జిల్లా నవాబుపేట, తాలమంచిపట్నం గ్రామాల్లోని 1017 ఎకరాల సున్నపురాయి నిక్షేపాల ప్రాస్పెక్టింగ్ లీజు కోసం 1997లో జయా మినరల్స్ గనుల శాఖకు దరఖాస్తు చేసుకుంది. దీన్ని పరిశీలించిన గనుల శాఖ జేడీ మేనకేతనరెడ్డి జయా మినరల్స్‌కు సిమెంట్ ఫ్యాక్టరీని స్థాపించేంత ఆర్థిక స్థోమత లేదని భావించారు. దరఖాస్తుదారుడి నుంచి వివరణ కోరుతూ పలుమార్లు లేఖలు రాసినా... ఆ కంపెనీ స్పందించలేదు. దీంతో ఈ ఫైలును గనుల శాఖ తిరస్కరించింది. అయితే 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఈ ఫైలుకు రెక్కలు వచ్చాయి. కంపెనీ ఆర్థిక స్థోమతను వివరిస్తూ సమాచారం ఇవ్వాలంటూ జయా మినరల్స్‌కు గనుల శాఖ లేఖ రాసింది. చాలా ఏళ్లుగా స్పందించని జయా మినరల్స్ ఈ లేఖకు వెంటనే స్పందించింది. ఈ కంపెనీకి ప్రాస్పెక్టింగ్ లీజు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్ ఫైలు పంపారు. ఈ సంస్థకు ప్రాస్పెక్టింగ్ లీజు ఇవ్వాలంటే కచ్చితంగా ఈశ్వర్ సిమెంట్స్‌కు లీజు భూములు బదిలీ చేయాలంటూ రాజగోపాల్ షరతు విధించారు. అలా కుదరదని గనుల శాఖ సంయుక్త కార్యదర్శి దయాకరరెడ్డి ఫైలులో రాశారు. అయినా ఈశ్వర్ సిమెంట్స్‌కు ప్రాస్పెక్టింగ్ లీజు ఇవ్వాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి రాజగోపాల్ నోట్‌ఫైల్‌ను పంపారు. ఈ నోట్ ఫైల్‌కు గనులశాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి ఆమోద ముద్ర వేశారు. గనుల శాఖ మంత్రి కూడా ఓకే చేశారు. 2006 జూలై 14న 183 జీవో నంబరుతో తొలుత జయా మినరల్స్‌కు.. తర్వాత 236 జీవో నంబరుతో ఈశ్వర్ సిమెంట్స్‌కు గనులు కేటాయిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. లీజు పొందనున్న ప్రాంత సమీపంలోనే ఈశ్వర్ సిమెంట్స్ కంపెనీ స్థాపించనుందని రాజగోపాల్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనల మేరకు 2008 జనవరిలో 30 ఏళ్లకు మైనింగ్ లీజు మంజూరు చేస్తూ 10వ నంబరు జీవో జారీ చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఈ ప్రతిపాదలు పంపేనాటికి ఈశ్వర్ సిమెంట్స్ ఏర్పాటు కాలేదు. తర్వాత గనుల శాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి మరో ప్రతిపాదన పంపుతూ ఈశ్వర్ సిమెంట్స్‌కు కేటాయించిన మైనింగ్ లీజును దాల్మియా సిమెంట్ (భరత్ లిమిటెడ్)కు బదిలీ చేయాలని సిఫారసు చేశారు. ఈశ్వర్ సిమెంట్స్ దాల్మియా సిమెంట్స్‌కు 100 శాతం అనుబంధ సంస్థగా ఉందని గనుల శాఖ ఈ లేఖలో పేర్కొంది. వీటి ఆధారంగా 2008లో జీవో నంబర్ 321 జారీ చేశారు.
ఏ1 జగన్.. ఏ2 విజయసాయి
రఘురాం/భారతి సిమెంట్స్ కేసులో సీబీఐ ఏ1గా జగన్‌ను, ఏ2గా విజయసాయి రెడ్డిని చేర్చింది. ఇదే కేసులో నాటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, జగన్ సన్నిహితుడు జేజే రెడ్డి, పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి కృపానందం తదితరులు నిందితులుగా ఉన్నారు. కుట్రలో జగన్, విజయసాయి రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది.
ఇది కూడా చదవండి:
సీఎంకాగానే మమ్మల్ని పక్కన పడేశారు
Updated Date - Oct 29 , 2024 | 07:48 AM