వంశీ కోసం.. లాయర్ వేషం
ABN, Publish Date - Oct 30 , 2024 | 04:50 AM
అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా వైసీపీ నాయకుల పంథా మారలేదు.
దాడి భయంతో వైసీపీ నేతలను భద్రతకు తెచ్చుకున్న వల్లభనేని
బెజవాడ కోర్టుల ప్రాంగణంలో హల్చల్
విజయవాడ, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా వైసీపీ నాయకుల పంథా మారలేదు. పవిత్రమైన న్యాయవాద వృత్తికి కళంకం తెచ్చేలా తమ అనుచరులు కొందరితో న్యాయవాదుల వేషం వేయించి.. రక్షణగా నియమించుకున్నారు. దీనికి సోమవారం విజయవాడ కోర్టులో జరిగిన డ్రామానే నిదర్శనం. ఒకింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చర్చనీయాంశం అయింది. ఒకే కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గూడవల్లి నరసయ్య సోమవారం విజయవాడలోని కోర్టుకు హాజరయ్యారు. కేసు నమోదు చేసిన సమయంలో ఒకే పార్టీలో ఉన్న వంశీ, నరసయ్య ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇరుపక్షాలు దాడులకు తెగబడతారన్న ఉద్దేశంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మరోవైపు వంశీ తనపై ప్రత్యర్థులు దాడి చేస్తారన్న భయంతో తన ఏర్పాట్లు తాను చేసుకున్నారు. తనకు రక్షణగా ఉన్న బౌన్సర్లను, అనుచరులను కోర్టు ప్రాంగణంలోకి అనుమతించరని భావించిన వంశీ..
లాయర్ల అవతారంలో
వైసీపీ నాయకులను లాయర్ల అవతారం ఎత్తించి రక్షణగా తెచ్చుకున్నారు. గన్నవరంనియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు నల్లకోటు, తెల్ల టై ధరించి లాయర్లుగా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించారు. వీరిలో రామవరప్పాడు గ్రామ వైసీపీ అధ్యక్షుడు సమ్మెట సాంబయ్య కూడా ఉన్నారు. కేవలం పదో తరగతి చదివిన సాంబయ్య వంశీ కోసం లాయర్‌గా మారిపోయారు. లాయర్ డ్రెస్‌లో ఉన్నాను కదా అని సరదాగా ఫొటో తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసుకోవడంతో గుట్టు రట్టయింది. ఈ విషయంపై టీడీపీ నేతలు ఆరాతీసి, కోర్టు ప్రాంగణంలో తీసిన ఫొటోలను, వీడియోలను పరిశీలించారు. పలువురు వైసీపీ నాయకులు సాంబయ్య తరహాలోనే నల్లకోట్లతో కనిపించడం గమనార్హం. ఈ వ్యవహారంపై మరింత లోతుగా ఆరా తీసిన టీడీపీ నాయకులకు.. వీరంతా వంశీకి రక్షణ కోసమే లాయర్ల అవతారం ఎత్తారని తెలిసింది. కాగా, వంశీకి సోమవారం పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు కల్పించడం వివాదాస్పదమైంది. వంశీ కాన్వాయ్‌కు ముందు, వెనుక పెట్రోలింగ్ జీపులతో రక్షణ కల్పించడం ఏమిటని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారని, అలాంటి వ్యక్తికి పోలీసులు భారీ రక్షణ కల్పించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:
పెట్టుబడులకు ఇదే మంచి సమయం ఏపీకి రండి
జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయ్
Updated Date - Oct 30 , 2024 | 07:13 AM