ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేస్తా: చైర్మన్ జీవీ రెడ్డి
ABN, Publish Date - Dec 21 , 2024 | 06:21 AM
దివాలా దశలో ఉన్న ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేసి అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని, ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని చైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు
సెట్ టాప్ బాక్స్‌లు అందుబాటులోకి తేవాలన్న ఆపరేటర్లు
గుంటూరు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దివాలా దశలో ఉన్న ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేసి అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని, ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని చైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు. గుంటూరులో శుక్రవారం కేబుల్ ఆపరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఫోన్ (ట్రిపుల్ ప్లే) సర్వీసును నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీఫైబర్ నెట్‌ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. అయితే, వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏపీ ఫైబర్ నెట్‌ను సర్వనాశనం చేశారని ఆరోపించారు. వైసీపీ ఏపీ ఫైబర్ నెట్‌ను తన జేబు సంస్థగా వాడుకుందని, అడ్డగోలు నియామకాలు చేపట్టారని, ఆఖరికి రాంగోపాల్‌వర్మ వ్యూహం సినిమాకు రూ.2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ నుంచే దోచి పెట్టారని దుయ్యబట్టారు. ఆదాయం సమకూర్చే సంస్థను నష్టాల్లోకి నెట్టారన్నారు. సంస్థపై ఈరోజు రూ.1262 కోట్ల అప్పు ఉందన్నారు.
ఏపీ ఫైబర్ నెట్‌లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు. ఇకపై నియామకాల నుంచి ఏ నిర్ణయమైనా అంతా పారదర్శకంగా ఉంటుందన్నారు. కాగా, సెట్‌టాప్ బాక్స్‌ల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇకనైనా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని పలువురు ఆపరేటర్లు చైర్మన్ జీవీ రెడ్డిని కోరారు. ఫైబర్ నెట్ లైన్లో ఏర్పడుతున్న అంతరాయాలను తరితగతిన పరిష్కరించాలని, గుంటూరులో సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలం చెల్లిన బాక్సులకు నేటికీ రూ.59 రెంటల్ వసూలు చేస్తున్నారని, దానిని రద్దు చేయాలని కోరారు. పోల్ ట్యాక్స్ జీవోను రద్దు చేసి, ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఆపరేటర్లు ఆందోళన చెందవద్దని, వీలైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరిస్తానని జీవీ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
Updated Date - Dec 21 , 2024 | 06:22 AM