AP Floods: అందరికీ సాయం..
ABN, Publish Date - Sep 14 , 2024 | 05:31 AM
భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రతి బాధితుణ్ని ఆదుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
17న వరద పరిహారం అందిద్దాం
మంత్రులు, అధికారులకు సీఎం నిర్దేశం
శాస్త్రీయంగా వరద నష్టం జాబితాలు రూపొందించాలి
పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్తవి ఇద్దాం
మొదటి, రెండో అంతస్తుల్లోని వారికీ పరిహారం
దెబ్బతిన్న వాహనాలు, వస్తువులకు కొంత సాయం
వరద నష్టాల క్లెయిమ్‌లు వారంలో పరిష్కరించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషికి మీరూ సహకారమివ్వండి
బ్యాంకర్లు, బీమా సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు
మూడు నెలల్లోగా గుంతల్లేని రోడ్లు కనిపించాలి
రహదారి మరమ్మతులకు రూ.476 కోట్లు ఖర్చు
ఆర్‌అండ్‌బీ, ఆర్థిక శాఖలకు సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి), విజయవాడ వన్‌టౌన్ : భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రతి బాధితుణ్ని ఆదుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చివరి బాధితుడి వరకు ప్రభుత్వ సాయం చేరాలని స్పష్టం చేశారు. వరద సహాయక చర్యల పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని, వారికి పరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచన చేసి, జాబితా రూపొందించాలని సూచించారు. నష్టం అంచనాలు, పరిహారం విషయమై శుక్రవారం అమరావతి సచివాలయంలోను, విజయవాడ కలెక్టరేట్‌లోనూ ముఖ్యమంత్రి.... పలువురు మంత్రులు, అధికారులు, బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే 17న బాధితులకు సాయం అందిద్దామని తెలిపారు. ఎన్యుమరేషన్ జరుగుతున్న విధానాన్ని అధికారులు.... సీఎంకు వివరించారు. ఎన్యుమరేషన్‌లో రీ-వెరిఫికేషన్ జరిపి, ప్రతి బాధితుడికీ జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని తెలిపారు.
క్లెయిమ్‌లను వారంలో పరిష్కరించండి
ఇళ్లు పూర్తిగా మునిగి, ఆస్తినష్టం జరిగిన వారితో పాటు మొదటి ఫ్లోర్‌లో ఉన్నవారికి సైతం సాయం అందిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్‌లో ఆయన మంత్రులు, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య కార్యదర్శి (ప్లానింగ్) పీయూష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెన్సీల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో వరద నష్టాల క్లెయిమ్‌ల పరిష్కారం, రుణాల రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చర్, మారటోరియం, కొత్త రుణాల మంజూరు, ఎలక్ర్టానిక్స్ వస్తువుల రిపేరింగ్, తదితర అంశాలపై చర్చించారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసింది అంతా చేస్తున్నాయి. ఇన్సూరెన్స్, బ్యాంక్‌లు కూడా సహకరించాలి. సంస్ధలపై విశ్వసనీయత పెరిగేలా వాటి కృషి ఉండాలి. ఇప్పటి నుంచి ఏడు రోజుల్లో క్లెయిమ్‌లు పరిష్కరించండి’’ అని చంద్రబాబు కోరారు. మానవతా కోణంలో బాధితులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ‘‘వరద కారణంగా ఇంటిలో వస్తువులన్నీ పాడైపోయిన మొదటి అంతస్ధువారికి ఒక మొత్తం, రెండవ ఫ్లోర్ నుంచి ఆ పైన ఉన్నవారికి కొంత మొత్తం ఇద్దాం. దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా పరిహారం ఇద్దాం. పూర్తిగా ఇళ్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇళ్లు నిర్మించి ఇద్దాం. క్లెయిమ్‌ల పరిష్కారంలో వేగంతో పాటు సరైన న్యాయం అందడం అవసరం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదు. చివరి బాధితుడి వరకు న్యాయం జరగాలి’’ అని సీఎం స్పష్టం చేశారు. ‘‘110కి పైగా ఫైరింజన్‌లతో గృహాలు, రహదారులు శుభ్రం చేశాం. ప్రజలకు భరోసా కల్పించేలా వ్యవస్థ పట్ల విశ్వసనీయత పెరిగేలా బాధిత ప్రజలకు సేవలు అందించాలి. సంక్షోభంలో ఉన్న ప్రజలను కష్టాల నుంచి గటెక్కించేందుకు సహకారం బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు అందించాలి’’ అని చంద్రబాబు కోరారు.
రోడ్ల మరమ్మతులకు 476 కోట్లు..
రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖను ఆదేశించారు. గుంతలు పూడ్చేందుకు రూ.290 కోట్లు, భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకోసం మరో రూ.186 కోట్లు మంజూరు చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. విపత్తు స్పందన నిధి కింద ఈ నిధులు సర్దుబాటు చేసుకోవాలన్నారు. మొత్తంగా రహదారుల మరమ్మతుల కోసం రూ.476 కోట్లు ఇస్తామని చంద్రబాబు ఆర్‌అండ్‌బీకి హామీ ఇచ్చారు. శుక్రవారం ఇక్కడి సచివాలయంలో రోడ్లు భవనాలశాఖ పనులపై ఆయన సమీక్ష చేశారు. ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఇంజనీరింగ్ చీఫ్ నయీముల్లా, జాతీయ రహదారుల చీఫ్ ఇంజనీర్ రామచంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రహదారుల మరమ్మతుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన అధికారులు.. గతంలో ప్రకటించిన రూ.290 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరగా.. సీఎం అంగీకరించారు. వెంటనే ఆర్‌అండ్‌బీకి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్‌ఓ) ఇవ్వాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. మరో రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులిస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు తదితర జిల్లాల పరిధిలో 4వేల కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని చీఫ్ ఇంజనీర్ నయీమూల్లా సీఎంకు నివేదించారు. మరమ్మతులకు తక్షణంగా రూ.186 కోట్లు అవసరమని తెలిపారు. ఈ నిధులను కూడా త్వరలో అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, సీఆర్‌ఎఫ్ కింద రూ.500 కోట్ల బకాయిలున్నాయని ఈఎన్‌సీ నయీమూల్లా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కాంట్రాక్టర్ల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని వివరించగా, ఆ నిధులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది.
పీపీపీ రోడ్లపై సర్వే..
రాష్ట్రంలో స్టేట్ హైవేలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) కింద చేపట్టే విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతోనే ఉంది. ఈ ప్రాజెక్టుపై సర్వే చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆర్‌అండ్‌బీని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రహదారి అభివృద్ధి సంస్థ (ఏపీఆర్‌డీసీ) కింద 3,931 కి.మీ రహదారులను పీపీపీ మోడల్‌లో చేపట్టేందుకు సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం తొలుత సమగ్ర ప్రాజెక్టును రూపొందించాల్సి ఉంది. ఈ పని పూర్తి చేసేందుకు కన్సల్టెంట్‌లను ఆర్‌అండ్‌బీ సమకూర్చుకోవాల్సి ఉంది.
ఆ పనులు బాగా చేయడం లేదు..
జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ తీరుతెన్నులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సరిగ్గా పనిచేయడం లేదని సమీక్షా సమావేశంలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రహదారి పనులు సకాలంలో పూర్తయ్యేలా, నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డిని ఆదేశించారు.
మూడు మల్టీ మోడల్ లాజిస్టిక్స్..
రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయనున్నామని సీఎం ప్రకటించారు. అనంతపురం, విశాఖ, విజయవాడల్లో ఇవి రాబోతున్నాయని చెప్పారు. వీటి ద్వారా రైల్, రోడ్, సముద్ర, విమానాయాన మార్గాల ద్వారా కనెక్టివీటీ పెరగనుందని సీఎం చెప్పారు. విదేశీ ఎగుమతులు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చివరి బాధితుడి వరకు న్యాయం..
‘వరద కారణంగా ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయిన మొదటి అంతస్తువారికి ఒక మొత్తం, రెండో ఫ్లోర్ నుంచి ఆ పైన ఉన్నవారికి కొంత మొత్తం ఇద్దాం. దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా పరిహారం ఇద్దాం. పూర్తిగా ఇళ్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇళ్లు నిర్మించి ఇద్దాం. వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినదంతా చేస్తున్నాయి. బ్యాంకర్లు, బీమా సంస్థలు కూడా మాకు సహకరించాలి. ఇప్పటి నుంచి వారంలోగా వరద నష్టం క్లెయిమ్‌లను పరిష్కరించాలి. క్లెయిమ్‌ల పరిష్కారంలో వేగంతో పాటు సరైన న్యాయం అందడం కూడా అవసరమే’’
- మంత్రులు, బ్యాంకర్లతో చంద్రబాబు
Also Read:
ఇంకా జగన్ జపమేనా
బంగారం, వెండి ధరలు భారీగా జంప్.. ఎంతకు చేరాయంటే
అందరికీ సాయం
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Sep 14 , 2024 | 07:04 AM