Ap Govt : లేబర్ సెస్ పంపకానికి ఓకే
ABN, Publish Date - Dec 03 , 2024 | 05:47 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేబర్‌సెస్ విభజనకు ఏకాభిప్రాయం కుదిరింది. ఆ సెస్ విభజనకు రెండు ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేశాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం
క్లాస్, 3, 4 ఉద్యోగుల చేరికకు మరో 45 రోజుల సమయం
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ నిధుల వివాదాలు కొలిక్కి
విద్యుత్ బకాయిలు, షెడ్యూల్ 9పై కుదరని పరిష్కారం
విభజన సమస్యలపై సీఎస్‌ల నేతృత్వంలోని అధికారుల కమిటీ భేటీ
పరిష్కారంకాని అంశాలపై తదుపరి సమావేశంలో చర్చ
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేబర్‌సెస్ విభజనకు ఏకాభిప్రాయం కుదిరింది. ఆ సెస్ విభజనకు రెండు ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఏపీలో తొలిసారి సోమవారం ఉన్నతస్థాయి అధికారుల కమిటీ భేటీ అయింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జరిగిన ఈ భేటీకి రెండు రాష్ట్రాల సీఎ్‌సలు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలు సంస్థల ఆస్తుల పంపకాలపై ప్రధానంగా చర్చ జరిగింది. దాదాపు 15 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై 5వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలోని ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో చర్చించిన అంశాలపై కొనసాగింపుగా ఉన్నతాధికారుల చర్చలు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీకి మరో 45 రోజుల సమయం ఇవ్వాలని భేటీలో నిర్ణయించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ నిధుల పంపకాలపై ఉన్న వివాదాలపై చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ఎక్సైజ్ ట్యాక్స్‌లో ఏపీకి అదనంగా రూ. 81 కోట్లు సెటిల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అత్యంత కీలకమైన షెడ్యూల్ 9లోని సంస్థల విభజన, విద్యుత్ బకాయిలపై ఇంకా పరిష్కారం లభించలేదు.
తదుపరి సమావేశంలోనూ ఈ సమస్యలపై చర్చలు కొనసాగుతాయి. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలను తీవ్రంగా వేధిస్తున్న డ్రగ్స్, గంజాయి నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అఽధికారులు అభిప్రాయపడ్డారు. డ్రగ్ ట్రాఫికింగ్ నిరోధం కోసం ఇరురాష్ట్రాల అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని, పోలీసు, ఎక్సైజ్ శాఖలతో పాటు సీనియర్ అధికారులతో ఆ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంతో పాటు విభజన పూర్తికాని సంస్థలకు చెందిన నగదు నిల్వలపైనా చర్చించారు. ఇరు రాష్ట్రాలకు షెడ్యూల్ 9, 10లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో పంపకం కాకుండా మిగిలిపోయిన రూ. 8 వేల కోట్ల అంశంపైనా చర్చించారు.
లేబర్ సెస్‌పై ఫ్రీజింగ్ ఎత్తివేత
లేబర్ సెస్‌కు సంబంధించి రూ. 861.35 కోట్లలో రూ. 732.18 కోట్ల ఎఫ్‌డీలను తెలంగాణ ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. రూ. 129.19 కోట్లు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి. ఎఫ్‌డీలపై ఫ్రీజింగ్ ఎత్తేయమని ఏపీ కోరగా తెలంగాణ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఇక ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి శాశ్వతంగా వెళ్లాలనుకుంటున్న ఉద్యోగులకు రెండు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు వారు కోరుకున్న రాష్ట్రానికి వెళ్తున్నారు. కానీ, ఇంకా పూర్తవలేదు. దీంతో మరో 45 రోజుల సమయం ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ నిధుల వివాదాలు కొలిక్కి
వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఉండే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ 2014 మే నాటికి రూ. 208.24 కోట్లు ఉందని రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో 2017 జూన్ 6న ఏజీ నిర్ణయించింది. అయితే, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను డీలర్లవారీగా సర్దుబాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా డీలర్లవారీ సర్దుబాటు పూర్తిచేయాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ నివేదిక వచ్చాకే ఈ అంశంపై ముందుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
2014 మే నెలకు సంబంధించిన ఎక్సైజ్ ఆదాయం వివాదంపై స్పష్టత రావడం కోసం ఏజీ వద్ద ఉన్న వివరాలు పరిశీలించి దాని ప్రకారం ఈ వివాదం పరిష్కరించుకోవాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏపీ ఖాతాలో జమ చేసిన కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల గ్రాంట్లను రెండు ప్రభుత్వాలు లెక్క చూసుకుని పంచుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రం విడిపోయేనాటికి 15 ఈఏపీ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరోసారి రెండు రాష్ట్రాలు లెక్కలు చూసుకుని చెల్లింపులు చేసుకోవాలని నిర్ణయించారు. విభజన సమస్యల్లో అత్యంత కీలకమైన షెడ్యూల్ 9లోని సంస్థల విభజనపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందే
విద్యుత్ బకాయిలు చర్చకు వచ్చిన సమయంలో ‘‘ఆపర్చ్యునిటీ’’ విధానంలో తమకు రూ. 21,000 కోట్లను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ డిమాం డ్ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తమకు ఏపీ అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరాను ఆపేసిందని, అందువల్ల తాము బయట నుంచి అధిక ధరలు చెల్లించి విద్యుత్తును కొనుగోలు చేశామంటూ చెప్పుకొచ్చింది. ఈ వాదనను ఆంధ్రప్రదేశ్ సమర్థంగా తిప్పికొట్టింది. తమకు తెలంగాణ నుంచి విద్యుత్తు బకాయిల కింద రూ. 14,000 కోట్ల వరకు రావాల్సి ఉందని ఏపీ స్పష్టం చేసింది. తాము సరఫరా చేసిన విద్యుత్తుకు తెలంగాణ ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించి ఉంటే.. తామెందుకు కరెంటు సరఫరాను నిలిపివేసేవారమని ప్రశ్నించింది. రాష్ట్రావసరాల కోసం బయట నుంచి అధిక ధరలకు విద్యుత్తు కొంటే తమకేమి సంబంధమని నిలదీసింది. ఆస్తులు, అప్పుల పంపకంలో భాగంగా.. రెవెన్యూ రిజర్వు నుంచి విద్యుత్తు బకాయిలను మినహాయించుకోవాలని తెలంగాణ సలహా ఇచ్చింది.
దీనిపై ఏపీ స్పందిస్తూ.. ఆస్తులూ అప్పులు పంపకాలు తేలాక ఇక రెవెన్యూ రిజర్వు ఎక్కడ ఉంటుందని తెలంగాణను ప్రశ్నించింది. విద్యుత్తు బకాయిల వివాదం రెండు కంపెనీల మధ్య తేల్చుకోవాలని ఏపీ సీఎస్ సూచించారు. బకాయిల వివాదం న్యాయస్థానంలో తేలాల్సిందేనని తెలంగాణ సీఎస్ స్పష్టం చేశారు. వాద ప్రతివాదాల మధ్య విద్యుత్తు వివాదంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులూ ఎటూ తేల్చలేకపోయారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరబ్ కుమార్‌ప్రసాద్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారితో పాటు తెలంగాణకు చెందిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా తదితరులు హజరయ్యారు. ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖే్‌షకుమార్ మీనా, ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్‌బాబు, వాణిజ్యపన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు.
సీఎంతో సీఎస్ భేటీ..
తెలుగు రాష్ట్రాల సీఎస్ కమిటీ భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. సీఎ్‌సల కమిటీలో చర్చించిన అంశాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. విద్యుత్ బకాయిలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. లేబర్‌సెస్ పంపకానికి దాదాపు అంగీకారం కుదిరిందని, మిగిలిన అంశాలపై మరోసారి భేటీలో చర్చించే విధంగా నిర్ణయించినట్లు సీఎంకు వివరించారు.
Updated Date - Dec 03 , 2024 | 05:49 AM