రాయి తగిలితే హత్యాయత్నం.. గొడ్డలితో నరికితే గుండెపోటా?
ABN , Publish Date - Apr 21 , 2024 | 04:29 AM
అధికారంలో ఉన్నవారు పెద్ద కొండల్లా తయారయ్యారు. ఇంత పెద్దవాళ్లు అడ్డుతగులుతుంటే.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే న్యాయమెలా జరుగుతుంది?
రాయి తగిలితే హత్యాయత్నం..
దమ్ముంటే కేసు గురించి మాట్లాడండి
మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి
మీకు ఓట్లు ఎందుకు వేయాలో చెప్పండి
ఒకరి వ్యక్తిగత జీవితంతో మీకేంటి పని?
నిందితుడికి ఎంపీ టికెట్ ఎందుకిచ్చారు?
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు
కడప(ఆంధ్రజ్యోతి)/కోడుమూరు, ఏప్రిల్ 19: ‘అధికారంలో ఉన్నవారు పెద్ద కొండల్లా తయారయ్యారు. ఇంత పెద్దవాళ్లు అడ్డుతగులుతుంటే.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే న్యాయమెలా జరుగుతుంది? జగన్మోహన్‌రెడ్డికి రాయి తగిలితే హత్యాయత్నం అంటూ పెద్దపెద్ద అక్షరాలతో కథనాలు రాస్తున్నారు. గొడ్డలితో ఏడుసార్లు నరికితే.. హార్ట్‌అటాక్ ఎలా అవుతుందో ఆయనే చెప్పాలి’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేశారు. సోదరి సునీత, పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డితో కలసి కలెక్టర్ విజయరామరాజుకు నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం కలెక్టరేట్ వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. ‘వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి క్రూరంగా చంపిన విషయం మీకందరికీ తెలుసు. ఇప్పటికి ఐదేళ్లు అయింది. ఇప్పటి వరకు న్యాయం జరిగిందా? రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి విషయంలోనే న్యాయం చేసుకోలేకపోయారంటే.. వైఎస్ కుటుంబం అధికారంలో ఉండి ఏం లాభం? న్యాయం కోసం వివేకానందరెడ్డి బిడ్డ తొక్కని గడప లేదు, తట్టని తలుపు, ఎక్కని మెట్లు లేవు. ఐదేళ్లుగా పోరాడుతూనే ఉంది. ఈ రోజు నేను పోటీ చేస్తున్నానంటే అది న్యాయం కోసమే. మీరు న్యాయం వైపా, లేక నేరం వైపా.. అనేది ప్రజలందరూ నిర్ణయించుకోవాలి.. జగన్ ఐదేళ్లుగా అవినాశ్‌రెడ్డిని కాపాడుతున్నారు. అవినాశ్‌రెడ్డి నిందితుడని సీబీఐ సాక్ష్యాలు, ఆధారాలు చూపుతోంది. చంపిన వాళ్లు, చంపించిన వాళ్లు ఒకే ప్రదేశంలో ఉన్నారు అని గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించామని చెబుతోంది. ఫోన్‌లో మాట్లాడుకున్నారని, లావాదేవీలు జరిగాయని, అడ్వాన్స్‌లు తీసుకున్నారని స్పష్టం చేస్తోంది. ఇవన్నీ హత్య జరిగినరోజు మాకు తెలియవు. సీబీఐ దర్యాప్తు చేసి చెబుతున్నదే మేమూ చెబుతున్నాం. సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు శిక్ష పడలేదు?
సీబీఐ విచారణంటే భయమెందుకు?
జగన్మోహన్‌రెడ్డికి మొన్న ఒక రాయి తగిలింది.. దానిపై ఆయన పేపర్‌లో హత్యాయత్నం అని పెద్దపెద్ద అక్షరాలతో రాశారు. గురిచూసి కాల్చడం కాదు.. ఒక రాయితో హత్య చేయాలని చూశాడట... అది కూడా ఒక కుర్రోడు. దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ రాశారు. జగన్ సమాధానం చెప్పాలి. ఒక రాయి తగిలితే మీకది హత్యాయత్నంలా కనిపించింది.. అదే వివేకానందరెడ్డిని గొడ్డలితో ఏడుసార్లు నరికి నరికి చంపితే... ఆయన తలలో ఎముకలు, మెదడు బయటకు కనిపించాయి. అలాంటిది మీకు హార్ట్‌అటాక్ అని ఎలా అనిపించింది? వివేకానందరెడ్డి చనిపోతే సీబీఐ ఎంక్వైరీ కావాలన్న జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు వద్దన్నారు? సీబీఐ విచారణ చేసుకుంటే మీకేంటి భయం? సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నా ఐదేళ్లుగా అవినాశ్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? అదే అవినాశ్‌రెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారో జగన్ సమాధానం చెప్పాలి. వీటి గురించి జగన్ మాట్లాడరు. అయితే వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితం గురించి ఎంతగా అవమానిస్తున్నారో చూస్తున్నాం. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది కాదా? ప్రజానాయకుడు అయితే... వ్యక్తిగత జీవితం ఉండకూడదా? కేసు గురించి మాట్లాడే దమ్ముంటే మాట్లాడండి, మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడండి, మీకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పండి.. ఇదంతా మానేసి వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి అవమానించే హక్కు మీకెక్కడిది? ఎమ్మెల్సీగా పోటీ పెట్టినపుడు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీకు తెలియదా? అవినాశ్‌రెడ్డి కోసం ఆఖరి నిమిషం వరకు ఎన్నికల ప్రచారానికి తిరిగాడే.. అప్పుడు తెలియదా ఆయన వ్యక్తిగత జీవితం గురించి? అందుకే రాజశేఖర్‌రెడ్డి బిడ్డ, వివేకానందరెడ్డి బిడ్డ కొంగుచాచి అడుగుతున్నారు.. న్యాయం చేయండి. మేము మీ ఆడబిడ్డలం.. ఇక్కడ పుట్టిన వాళ్లం. ఎక్కడెక్కడో తిరిగి న్యాయం జరగకపోతే ప్రజాకోర్టుకు వచ్చాం. ప్రజలే న్యాయం చేస్తారని ఆశపడుతున్నాం.. మీరు న్యాయంవైపు నిలబడతారని, నేరం వైపు కాదని నిరూపించాలి’ అని షర్మిల కోరారు. ‘ఐదేళ్లుగా సునీత ఎంతగా పోరాటం చేసిందో ప్రజలందరూ చూశారు. ఈ ఐదేళ్లలో న్యాయం జరిగి ఉంటే ఆమెకు రోడ్లమీద తిరిగే పరిస్థితి ఉండేది కాదు. నేను ఇక్కడకు వచ్చి పోటీ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. న్యాయం జరగలేదు కాబట్టి ఇపుడు ప్రజాకోర్టులో న్యాయం కోరే అవకాశం వచ్చింది కాబట్టి, కొంగుచాచి న్యాయం చేయండని అడుగుతోంది. ఇందులో తప్పేముంది?’ అని షర్మిల ప్రశ్నించారు.
కడపలో షర్మిలకు ఘనస్వాగతం
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప పార్లమెంట్‌కు నామినేషన్ వేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత ఇడుపులపాయలో నామినేషన్ పత్రాలను వైఎస్ సమాధిపై ఉంచి ప్రార్థనలు చేశారు. అనంతరం కడపకు చేరుకుని ఐటీఐ, కోటిరెడ్డి సర్కిల్, ఎర్రముక్కపల్లె మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. కడపలో చాలా ఏళ్ల తర్వాత షర్మిల రాకతో కాంగ్రెస్ జండాలు మళ్లీ పెద్ద సంఖ్యలో కనిపించాయి.
పోలీసుల అత్యుత్సాహం
షర్మిల నామినేషన్ సందర్భంగా ర్యాలీగా వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం వైసీపీ సిటింగ్ ఎంపీ అవినాశ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తే ఆయనవెంట పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులను అనుమతించారు. శనివారం మాత్రం 100 మీటర్ల దూరంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. షర్మిల రాక సందర్భంగా ఇద్దరు డీఎస్పీలు బందోబస్తును పర్యవేక్షించారు. షర్మిల నామినేషన్ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వివేకా హత్యను ఎన్నికలకు వాడుకున్నారు: షర్మిల
‘2019లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే నారాసుర రక్తచరిత్ర అని ఎన్నికలకు బాగా వాడుకున్నారు. ఐదేళ్లు అయినా న్యాయం జరగకపోతే.. ఇప్పుడు మేము అడుగుతుంటే మాట్లాడకూదని అంటున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించాలి’ అని షర్మిల అన్నారు. శనివారం కడప పార్లమెంట్‌కు నామినేషన్ వేసిన అనంతరం ఆమె రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కడప ఎంపీ స్థానానికి నామినేషన్ వేశా. రాజశేఖర్‌రెడ్డిని, వివేకానందరెడ్డిని వాళ్లు చేసిన పనులను గుర్తుపెట్టుకుని ఓటు వేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నా. రైట్ టు స్పీచ్ అనే రాజ్యాంగ హక్కుకు కూడా విలువ లేకుండా మేము మాట్లాడకూడదు అన్నట్లు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే వివేకానందరెడ్డిని ఏడుసార్లు నరికితే మీ పత్రికలో హార్ట్‌అటాక్ అని ఎందుకు వచ్చిందో జగన్ సమాధానం చెప్పాలి. అవినాశ్‌రెడ్డి దోషి అని సీబీఐ చెబుతున్నా.. కర్నూలులో నిందితుడిని అరెస్టు చేయడానికి వస్తే రాష్ట్ర పోలీసులనే కంచెగావేసి అఽధికార దుర్వినియోగానికి పాల్పడి ఎందుకు కాపాడారు? వివేకాను చంపించడం ఒక ఎత్తు అయితే..ఈ ఐదేళ్లలో ఆయన వ్యక్తిత్వాన్ని 500సార్లు హత్య చేశారు. ఆయన బిడ్డను కూడా వదిలిపెట్టకుండా దూషిస్తూనే ఉన్నారు, బెదిరిస్తూనే ఉన్నారు. మీకోసం పాదయాత్ర చేసి, మీ గెలుపు కోసం పనిచేసిన నన్ను కూడా రాజశేఖర్‌రెడ్డి బిడ్డవు కావు అని విజయమ్మను అవమానించే స్థాయికి దిగజారారే.. అసలు మీది గుండెనా బండనా.. మనసు, మానవత్వం అనేవాటి గురించి మీకు తెలుసా? మేం న్యాయం కోసం పోరాడుతున్నాం, హత్యా రాజకీయాలను ప్రోత్సహించకండి. ఇలాంటి వారు చట్టసభలకు వెళ్లకూడదు. వీళ్లు అధికారంలో ఉండడానికి వీలులేదు. రాజశేఖర్‌రెడ్డి బిడ్డను గెలిపించండి.. ఇక్కడే మీకు తోడుగా, అండగా ఉంటా.. మీకోసం కొట్లాడతా’ అని షర్మిల హామీ ఇచ్చారు.
ఓట్ల కోసం జనంలోకి జగన్: షర్మిల
‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని చూస్తే కుంభకర్ణుడు గుర్తుకొస్తున్నాడు. ఐదేళ్లపాటు ఇంట్లో కుంభకర్ణుడిలా ఉంటూ ఇప్పుడు ఓట్ల కోసం జనంలో తిరుగుతున్నాడు’ అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఏపీ న్యాయ్‌యాత్ర’లో భాగంగా శనివారం కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘గుండ్రేవుల ప్రాజెక్టు వైఎస్ కల. ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలని వైఎ్‌సఆర్ అనుకున్నారు. ఆయన మరణం తర్వాత దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. జగన్ హామీ ఇచ్చి కూడా ఇంతవరకూ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయాడు. తుంగభద్ర నుంచి చుక్క నీరు తీసుకురాలేదు. కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 2019 ఎన్నికల ముందు చేనేత కార్మికులకు రుణమాఫీ అన్నారు. ఇచ్చిన హామీని మరిచి చేనేత కష్టాల వైపు కన్నెత్తి చూడలేదు. రైతులకు ధర స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు ఏర్పాటు చేస్తానని వారిని నట్టేట ముంచేశాడు. మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వమే నాసిరకం మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుంది’ అని షర్మిల హామీ ఇచ్చారు.