AP News: బరితెగించిన ఇసుకాసురులు.. నదిలో ఏకంగా..
ABN, Publish Date - Dec 19 , 2024 | 12:41 PM
Andhra Pradesh News: నదీ గర్భంలోని ఇసుక తవ్వి తీసుకురావాలంటే కష్టమనుకున్నారేమో.. ఏకంగా నదిలోనే రోడ్డు వేసుకుంటున్నారు. నది మధ్య వరకు వాహనాలను తీసుకెళ్లి ఇసుక తవ్వి..
అచ్చంపేట, డిసెంబరు 19: నదీ గర్భంలోని ఇసుక తవ్వి తీసుకురావాలంటే కష్టమనుకున్నారేమో.. ఏకంగా నదిలోనే రోడ్డు వేసుకుంటున్నారు. నది మధ్య వరకు వాహనాలను తీసుకెళ్లి ఇసుక తవ్వి తరలించుకునేందుకు అధికార పార్టీ నేతలు బరితెగించారు. ఇసుక జోలికి వెళ్ల వద్దని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నా నేతలు లక్ష్య పెట్టడంలేదు. నదీ ప్రవాహానికి అడ్డుగా రోడ్డు వేస్తున్నా అధికారులు అటు వైపు దృష్టి సారించడంలేదు. అధికారం మాది అడిగేదెవరు.. ఆపేదెవరు అన్న రీతిలో నేతలు రెచ్చిపోతున్నారు. అక్రమార్కులకు ఇద్దరు ప్రజాప్రతినిధులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నదిలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునే సాహసం అధికారులు చేయడంలేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గక తప్పడంలేదు.
నాడు వైసీపీ నేతలు ఇసుక అక్రమాలకు పాల్పడగా వారిని తీవ్రస్థాయిలో విమర్శించిన టీడీపీ నేతలు కొందరు అంతకు మించి అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆక్రమంగా ఇసుక తవ్వకాల్లో వైసీపీకి ఏమీ తీసిపోమని టీడీపీ నేతలు కొందరు నిరూపిస్తున్నారు. అచ్చంపేట మండలంలోని కోనూరు రీచ్‌లో కాంట్రాక్టర్లు బరితెగిస్తున్నారు. రేవు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఇసుకను కాజేసేందుకు కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడ వరకు వెళ్లాలంటే నదికి రోడ్డు అడ్డంగా వేయాల్సి ఉంది. దీంతో నదిని చీల్చుతూ సుమారు కిలో మీటరున్నరకు పైగా రోడ్డు నిర్మిస్తున్నారు.
రోడ్డు నిర్మాణానికి పెద్దసంఖ్యలో ఇసుక బస్తాలు, సిమెంట్ తూములు వినియోగించారు. నదికి అడ్డుకట్ట వేయడం వల్ల నీటి ప్రవాహం తగ్గి దిగువన వ్యవసాయ మోటార్లకు సరిగా నీరు అందడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా రివర్ కార్యాలయం, ఏ అధికారి నుంచి గాని రోడ్డుకు అనుమతులు లేవు. చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తే వారిపై ప్రజా ప్రతినిధుల ద్వారా అక్రమార్కులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అచ్చంపేట మండలం అంబడిపూడి, అమరావతి మండలం మల్లాది ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరగుతున్నట్లు ఇటీవల విజిలెన్స్ అధికారులు తేల్చారు. వారు నిర్వహించిన తనిఖీల్లో ఇసుక అక్రమాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. నది మధ్యలో 360 టన్నుల ఇసుక డంపు కూడా గుర్తించారు. నదీ గర్భంలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు రెండు చోట్ల జరుగుతున్నట్లు తేల్చారు. కేసుల నమోదుకు సిఫార్సు చేశారు. అయినా అక్రమార్కులు తగ్గకపోగా మరింత బరితెగిస్తున్నారని ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి.
రోడ్డు నిర్మాణం ఆ పేదేవరు?
నదిలో ప్రవాహానికి అడ్డంగా రోడ్డు నిర్మాణ పనులు పట్టపగలే జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. ఫిర్యాదు చేసినా చర్యలకు సాహసించడంలేదు. అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చు అడ్డు ఉండదని నదిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణమే ఒక ఉదాహరణగా ఉంది.
ర్యాంపు నిర్మాణానికి అనుమతి లేదు..
కోనూరు వద్ద నదిలో ర్యాంపు నిర్మాణానికి అనుమతి లేదని జిల్లా మైనింగ్ అధికారి నాగిని తెలిపారు. సదరు కాంట్రాక్టర్లను కృష్ణా రివర్ కన్జర్వేటర్, కృష్ణా సెంట్రల్ డివిజన్ విజయవాడ నుంచి అనుమతులు తీసుకోవాలని కాంట్రాక్టర్లు సాయిక్యూ అండ్ సొల్యూషన్స్, గోదావరి కృష్ణా వాటర్ వేస్ అండ్ ట్రాన్స్పోర్టు కంపెనీకి లేఖ ద్వారా తెలియజేశామన్నారు. ర్యాంపు నిర్మాణానికి అనుమతి పొందినట్లుగా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని నాగిని చెప్పారు.
Also Read:
మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా..
ఆ విధంగా తీర్పు ఇవ్వలేం: బందర్ కోర్టు
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Dec 19 , 2024 | 12:42 PM