Share News

Justice NV Ramana : తెలుగు భాష అంతరిస్తే జాతి అంతరించినట్లే!

ABN , Publish Date - Dec 15 , 2024 | 05:25 AM

తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉందని, ఇదే జరిగితే తెలుగు జాతి అంతరించిపోయినట్లేనని భారత సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

Justice NV Ramana : తెలుగు భాష అంతరిస్తే జాతి అంతరించినట్లే!

  • విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

  • జానమద్ది శతజయంతిలో స్మారకోపన్యాసం

  • జీఓ 585ను రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

కడప ఎన్టీఆర్‌ సర్కిల్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉందని, ఇదే జరిగితే తెలుగు జాతి అంతరించిపోయినట్లేనని భారత సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో శనివారం బ్రౌన్‌ గ్రంథాలయంలో.. డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్ర్తి శతజయంతి స్మారకోపన్యాస కార్యక్రమాన్ని జానమద్ది కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘తెలుగు భాష వైభవం’ అనే అంశంపై జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రసంగించారు. తెలుగు రాష్ర్టాల విభజనతో తెలుగు అతి త్వరగా మరుగునపడే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగ ఉపాధి కోసం తెలుగును పూర్తిగా వదిలిపెట్టి ఇంగ్లీష్ కు అలవాటుపడుతున్నారన్నారు. తాను ఎన్నో దేశాల్లో చూశానని, అక్కడ ఇప్పటికీ వారి మాతృభాషలోనే బోధన జరుగుతోందని చెప్పారు. మాతృభాషలో ఉన్న అంశాలను నేర్చుకుంటే ఇతర భాషలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తాను ఏడో తరగతికి వచ్చేంత వరకు ఇంగ్లీష్‌ నేర్చుకోలేదన్నారు. కానీ భారత అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ, భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులాంటి వ్యక్తులు మాతృభాషలోనే చదివారని వివరించారు. పాఠశాలలో ఇంగ్లీష్‌ మాత్రమే బోధించాలని ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబరు 585ను రద్దు చేయాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.


ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఉన్న స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌లను తాను కోరానని వివరించారు. పాత విద్యా విధానాన్ని కొనసాగించాలని సూచించినట్లు తెలిపారు. తెలుగు భాష అభివృద్ధి కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు తెలుగు అకాడమీ స్థాపించారని, దానిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు మన సంప్రదాయాలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారని, ఇక్కడ కనీసం మనం ఇంట్లోనైనా పిల్లలతో తెలుగు మాట్లాడాలని కోరారు. తెలుగు భాషపై ఒక పరిశోధన కేందం ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం వివిధ సంస్థల ప్రతినిధులు జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి, జేసీ అదితిసింగ్‌, పలువురు సాహితీ ప్రియులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 05:25 AM