SAND MAFIA:యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
ABN, Publish Date - Nov 02 , 2024 | 10:20 AM
ఏపీలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలను ఉమ్మడి కడపజిల్లా కేంద్రంగా మారింది.
అన్నమయ్య జిల్లా: ఉమ్మడి కడపజిల్లాలో విచ్చల విడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. తెలుగుదేశం, వైసీపీ శ్రేణులు కలసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నందలూరు టంగుటూరు ఇసుక క్వారీల నుంచి లారీలు, టిప్పర్‌లతో అక్రమంగా ఇసుక మాఫియా తరలిస్తుంది. ఒక్కరోజే ఒంటిమిట్టలో ఐదు టిప్పర్లు నందలూరులో నాలుగు టిప్పర్లు రెండులారీలను రెండు జేసీబీలను పోలీసులు, రెవెన్యూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లారీలు, టిప్పర్లతో తమిళనాడు కర్నాటక రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలిస్తూ.. నిత్యం లక్షలాది ఇసుక మాఫియా దండుకుంటుంది. బెంగళూరు నుంచి తమిళనాడుకు ప్రతిరోజు 50 లారీలకు పైన ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా..
ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా లారీలకు ఇసుక లోడింగ్ చేస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను కొన్నేళ్లుగా తవ్వేసి.. తరలించి.. కోట్లు గడించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొంతమంది కూటమి నాయకుల అండతో వైసీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాలు ఆపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
రాత్రి వేళ లారీల్లో అక్రమ రవాణా..
ఈ ఇసుక అక్రమ దందాకు కొందరు ప్రభుత్వ అధికారుల, అధికారపార్టీ నాయకుల అండదండలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను, వారి ఆగడాలతో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం అన్ని రహదారులపై పోలీసులు గస్తీ తిరుగుతుండటం, మరో వైపున రెవెన్యూ, మైనింగ్ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ అక్రమ ఇసుక దందా ఎలా కొనసాగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఇసుక డంపుల నుంచి దూర ప్రాంతాలకు రాత్రి వేళ లారీల్లో తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ఇసుక దందాకు పూర్తి మద్దతు ఇస్తుండటంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చట్టాలను, ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు కొందరు అక్రమార్కులతో చేతులు కలపడంతో ఇసుకమాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఉమ్మడి కడపజిల్లాలో ఉన్న నదులు, చెరువుల్లో సుమారు 40 నుంచి 50 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వేసి.. ఇసుక తీసేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలూ అడుగంటిపోతున్నాయి. దీనిపై గతంలో, ప్రస్తుతం ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. వీటిని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో తవ్వకాలను అడ్డుకుంటున్నామని గ్రామస్తులు చెప్పారు కలెక్టర్ సకాలంలో స్పందించి ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల ప్రేక్షక పాత్ర
నాటి జగన్ పాలనలో అక్రమాలకు పూర్తిస్థాయిలో తెరదీసిన అధికార యంత్రాంగం అదే ధోరణి అవలంభించడం సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమ ఇసుక అమ్మకాల వెనుక ఎవరి హస్తం ఉందనేది క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇసుక అక్రమ అమ్మకాలపై దృష్టి పెట్టాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇసుక అక్రమ అమ్మకాలు ఇలాగే కొనసాగితే నూతన ప్రభుత్వం అప్రదిష్ట పాలవుతుందని కూటమి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, సంబంధిత మంత్రి ఇసుక అక్రమ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ప్రభుత్వం ఎన్నిపాలసీలు తీసుకువస్తున్నా..
ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని రకాల పాలసీలు తీసుకువస్తున్నా క్షేత్రస్థాయి అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా నీరుగారుతోంది. సామాన్యులు ఎక్కడైనా చిన్న చిన్న అవసరాల కోసం ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేసి, ఇబ్బందులు పెట్టే అధికారులు తమ కనుసన్నల్లో ఇసుకను తరలిస్తూ మామూళ్లు ముట్టజెప్పే వారికి మాత్రం సలాం కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరైనా ప్రశ్నించినా, మీడియాపై దాడులకు తెగబడుతున్నారంటే ఇసుక మాఫియా ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల ఈ ఇసుక మాఫియా ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎత్తయినా ఉంది. లేకపోతే మాఫియా ఆగడాలు పెరిగి, సామాన్యులపైనా దాడులు చేసే పరిస్థితి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
YSRCP: లైంగికంగా వేధించాడు.. మోసం చేశాడు
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 02 , 2024 | 11:16 AM