Rave Party: బెంగళూరు రేవ్ కేసులో సూత్రధారి ఇతడే.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి..!
ABN, Publish Date - May 23 , 2024 | 09:51 AM
సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ మూలాలు బెజవాడలోనే ఉన్నాయా..? వన్‌టౌన్‌లోని ఆంజనేయ వాగుకు చెందిన వాసు ఆధ్వర్యంలోనే ఈ పార్టీ జరిగిందా..? ఒకప్పుడు పూరింట్లో కఠిక పేదరికం అనుభవించిన వాసు ఇప్పుడు రూ.కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు..? వాసు డాన్‌గా జిల్లాలో బెట్టింగ్ బుకీల వ్యవస్థ నడుస్తోందా..? అన్నీ తెలిసి పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారా..? వీటన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది..
నాడు వన్‌టౌన్ వాగు సెంటర్‌లోని పూరింట్లో పేదరికం
నేడు రూ.కోట్లకు అధిపతి.. ఖరీదైన విల్లాలు, కార్లు
కేదారేశ్వరపేట లోటస్‌లో బెట్టింగ్‌లకు ఓనమాలు
దక్షిణాదిలో ఏ ఎన్నికలు జరిగినా భారీగా పందేలు
క్రికెట్ బెట్టింగ్‌ల్లోనూ ఆరితేరిన ఘటికుడు
నగరం సహా జిల్లా అంతటా అనుచర బుకీలు
సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ (Rave Party) మూలాలు బెజవాడలోనే ఉన్నాయా..? వన్‌టౌన్‌లోని ఆంజనేయ వాగుకు చెందిన వాసు ఆధ్వర్యంలోనే ఈ పార్టీ జరిగిందా..? ఒకప్పుడు పూరింట్లో కఠిక పేదరికం అనుభవించిన వాసు ఇప్పుడు రూ.కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు..? వాసు డాన్‌గా జిల్లాలో బెట్టింగ్ బుకీల వ్యవస్థ నడుస్తోందా..? అన్నీ తెలిసి పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారా..? వీటన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది. బెంగళూరు శివారులోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశాక వాసు పేరు వెలుగులోకి రావడంతో విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అమరావతి, విజయవాడ: లంకపల్లి వాసు.. ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. క్రికెట్ బెట్టింగ్ మొదలుకుని రాజకీయ బెట్టింగ్‌ల వరకు అన్నీ కలిసొచ్చి రూ.కోట్లకు అధిపతి అయ్యాడు. క్రికెట్ సహా దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు జరిగినా బెట్టింగ్‌లు నిర్వహించేవాడు. దీనిద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. ఈ బెట్టింగ్‌లపై వాసు రూ.200 కోట్ల వరకు సంపాదించినట్టు తెలుస్తోంది.
పూరింటితో మొదలై..
కొత్తపేటలోని ఆంజనేయ వాగు కొండపై గతంలో ఒక పూరింట్లో నివాసం ఉండేవాడు. తల్లిదండ్రులు తొలుత కూలీ పనులు చేసుకుని జీవించేవారు. తండ్రి చనిపోవడంతో తల్లి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషించింది. కేదారేశ్వరపేటలో లోటస్‌కు చెందిన ఒక బుకీని పరిచయం చేసుకుని, అతని వద్ద చేరి, బెట్టింగ్‌లపై పూర్తి పట్టు సాధించాడు. అనతికాలంలోనే రూ.కోట్లు కూడగట్టాడు. ఎన్నో ఇళ్లు, విల్లాలు కట్టాడు. వాటన్నింటికీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. ఆంజనేయ వాగు కొండ ప్రాంతంలో పైభాగాన ఒక రేకుల షెడ్‌ను అత్యాధునికంగా నిర్మించి, సీసీ కెమెరాలు అమర్చాడు. స్థానికంగా ఉండే బుకీలు ఈ షెడ్‌లో బెట్టింగ్‌లు నిర్వహించేవాడు.
బెంగళూరు పార్టీ నిర్వహించింది ఇతనే..
బెంగళూరులోని ఫాంహౌస్‌లో సన్‌సెట్-సన్‌రైజ్ పేరుతో వాసు పార్టీ నిర్వహించాడు. దీనికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాడు. అందులోనే ఆహ్వానాలు పంపాడు. పుట్టినరోజు పార్టీ కోసమని ఫాంహౌస్‌ను తీసుకున్నాడు. కెంపెగౌడ్ పోలీసులు నమోదు చేసిన కేసును గురువారం బెంగళూరు సీసీబీ (సెంట్రల్ క్రైం బ్యూరో)కు బదిలీ చేశారు. బెట్టింగ్‌ల వ్యవహారం పూర్తిగా వెలుగులోకి వచ్చినప్పటికీ డ్రగ్స్ వ్యవహారం తేలాల్సి ఉంది. పార్టీలో ముగ్గురు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులను అరెస్టు చేశారు. వాసుతో స్నేహం లేకుండా వారు పార్టీలోకి రావడం అసాధ్యమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వాసు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం. అతడి తల్లి అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది.
అంతుచిక్కని కథ
వాసు బెట్టింగ్‌కు ప్రధాన బుకీ. అతడికి అనుబంధంగా విజయవాడలో 150 మంది, జిల్లాలో 400 మంది వరకు బుకీలు ఉన్నారు. క్రికెట్ సీజన్ ప్రారంభమైన ప్రతిసారీ పోలీసులు లాడ్జీలు, బ్యాచిలర్స్ రూంల్లో తనిఖీలు చేసి కొంతమంది బుకీలను పట్టుకుంటున్నారు. ప్రధాన బుకీ గురించి మాత్రం పోలీసులు వివరాలు వెల్లడించేవారు కాదు. ప్రధాన బుకీలు ఢిల్లీ, ముంబయి, బెంగళూరుల్లో ఉంటారని చెప్పుకొచ్చేవారు. వన్‌టౌన్, కొత్తపేట ప్రాంతాల్లో వాసు అనుచరులు ఎంతోమంది పలుమార్లు అరెస్టయ్యారు. వారంతా బుకీలని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాసు 150 గజాల స్థలంలో పూరిల్లు తొలగించి రూ.50 లక్షలతో ఇల్లు నిర్మించాడు. గట్టువెనుక కబేళా ప్రాంతంలో 500 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి విలాసవంతమైన గెస్ట్‌హౌస్‌ను నిర్మించు కున్నాడు. ఒకప్పుడు టిఫిన్‌కు, భోజనానికి స్నేహితుల వద్ద డబ్బు అడిగి తీసుకునే వాసు కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో అర్థంకావడం లేదని స్థానికులు చెబుతున్నారు. స్నేహితుడు నాగరాజు అనే వ్యక్తికి క్రికెట్ బుకీ నేర్పించి ప్రధాన అనుచరుడిగా పెట్టుకున్నాడు. అతడు బెట్టింగ్‌లు నిర్వహిస్తూ రూ.10 కోట్లకు పైగానే సంపాదించినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..
Rave Party: ఆ గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి: సోమిరెడ్డి
Updated Date - May 23 , 2024 | 09:58 AM