Rain Alert: తీరం దాటిన 'ఫెంగల్' తుపాన్
ABN, Publish Date - Dec 01 , 2024 | 07:04 AM
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుపాన్ తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాను తీరం దాటింది. దీని ప్రభావంతో ఆదివారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుపాన్ (Fengal Cyclone ) తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి (Puducherry) సమీపంలో ఫెంగల్ తుఫాను తీరం దాటింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుంది. దీని ప్రభావంతో ఆదివారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఫెంగల్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష
కాగా బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో అంచనా వేసి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఫెంగల్ తుఫానుపై జిల్లా కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖ, సీఎంవో, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో సీఎం సమీక్షించారు. ‘తుఫాను పరిస్థితిని ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయాలి. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని, పూర్తి సమన్వయంతో పని చేయాలి. ఆకస్మిక వరదలు వస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సహాయ, పునరావాస కార్యక్రమాలకు కలెక్టర్లు సమాయత్తం కావాలి. ధాన్యం రైతులకు నిర్దిష్ట సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలి’ అని అధికారులను ఆదేశించారు.
అధికారులు అందుబాటులో ఉండాలి: అచ్చెన్న
తుఫాన్ నేపథ్యంలో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని కోరారు. కాగా, తుఫాను ప్రభావంతో ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఆకస్మికంగా వరదలు సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తుఫాను ప్రభావంతో తిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ ప్రాంతం, మాడవీధులు, అఖిలాండం, అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, రోడ్లు, కాటేజీలు, బస్టాండ్, పార్కులు తడిసి ముద్దయ్యాయి. చలి గాలులతో కూడిన వర్షానికి యాత్రికులు వణికిపోయారు. సాయంత్రం నుంచి భక్తులు గదులకే పరిమితమయ్యారు. సాయంత్రం ఆలయం ముందు నిర్వహించే సహస్రదీపాలంకరణ సేవను వైభవోత్సవ మండపంలో నిర్వహించారు.
మరోవైపు ఫెంగల్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన ప్రాంతాల్లో సైతం ఎటుచూసినా చెరువులు, నదుల్లా కనిపిస్తున్నాయి. టి.నగర్ తదితర ప్రాంతాలు సైతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వ రవాణా స్తంభించింది. కొన్నిచోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో పాదచారులు సైతం తిరగలేని పరిస్థితి నెలకొంది. మూడు రోజుల నుంచి వణికిస్తున్న ఫెంగల్ తుఫాను తీరానికి సమీపించేకొద్దీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించడంతో తమిళనాడులోని 9 జిల్లాల్లో శుక్రవారం నుంచి విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. మరోవైపు, తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. తీర ప్రాంతాల్లో 75-95 కి.మీ వేగంతో గాలులు వీయడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల సముద్రపు అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి. తిరుచ్చెందూర్‌లో సముద్రపు నీరు 80 అడుగుల మేర వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. చెన్నైలో విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు కూడా మూతబడ్డాయి. సహాయ చర్యల కోసం 30 వేల మంది పోలీసులు, 18 ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలోనూ, సముద్రతీ ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నైలోని ప్యారీస్ ప్రాంతం విద్యుదాఘాతానికి ఓ వ్యక్తి మరణించారు. చెంగల్పట్టు,కాంచీపురం జిల్లాల్లోనూ ఒక్కొక్కరు చొప్పున విద్యుదాఘాతానికి గురై మరణించారు. ఆదివారం చెన్నైతో పాటు 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
విమానాల మళ్లింపు..
ఈదురు గాలులతోపాటు రన్‌వేపై వరదనీరు చేరడంతో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం వరకు చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై రావాల్సిన 10 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. చెన్నై నుంచి బయలుదేరాల్సిన 55 విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెన్నైలో శనివారం మధ్యాహ్నం నుంచి సబర్బన్ రైలు సేవలు సైతం పాక్షికంగా నిలిచిపోయాయి. కాగా, చెన్నైవ్యాప్తంగా వరదనీరు చేరడంతో ఉపాధిలేని కూలీలు, హోటళ్లు లేక సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడే అవకాశముందన్న కారణంగా శనివారం చెన్నైలోని అమ్మా క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రామ్‌చరణ్ కోసం బాలీవుడ్ నటుడు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 01 , 2024 | 08:17 AM