Home Minister Anita: నేషనల్ క్రైం రికార్డులో ఏపీ మూడో స్థానం...
ABN, Publish Date - Jun 27 , 2024 | 02:01 PM
విజయవాడ: వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని, పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని, పోలీసు అకాడమీ, గ్రేహౌండ్ అకాడమీ కూడా లేదని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
విజయవాడ: వైసీపీ (YCP) ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను (Police system) నాశనం చేశారని, పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని, పోలీసు అకాడమీ, గ్రేహౌండ్స్ అకాడమీ కూడా లేదని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anita) అన్నారు. గురువారం మంత్రి డీజీపీ (DGP), ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ 12 రోజుల్లో చాలా అంశాలపై పరిశీలన చేశానని, గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగిందని, నేషనల్ క్రైం రికార్డులో ఏపీని మూడో స్థానంలోకి తెచ్చారని అన్నారు. నేటికీ విశాఖ జిల్లాలో ఒక పోలీస్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి రూ. 50 కోట్లు చొప్పున రూ.250 కోట్లు పోలీసు శాఖకు రావాలని అన్నారు. ఈ ఐదేళ్లల్లో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇప్పుడు జీరో నుంచి తాము పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఎస్కార్ట్ వాహనాలు కూడా పని చేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి అనిత తెలిపారు. 2014 లో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పేపర్, పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులు ఉన్నారని, వాళ్లు ఏ విధంగా విధులు నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదని, గతంలో సిఐడీ ఎలా పని చేసిందో అందరూ చూశారన్నారు. మంచి అలోచనతో పని చేస్తే విప్లవాత్మక మార్పులు తీసుకు రావచ్చునని, అందరం కలిసి కట్టుగా పని చేసి పోలీసుల పని తీరులో మార్పు తెస్తామన్నారు.
కొంతమంది ఐపీయస్ అధికారులు వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని, ప్రజలు ధైర్యంగా పీఎస్కు వెళ్లి తమ బాధలు చెప్పుకునే భరోసా ఇవ్వాలని, స్టేషన్లో సిబ్బంది కూడా ప్రజలతో మర్యాదగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యం అయిన ఘటనలు చాలా ఉన్నాయని, ఎవరైనా వస్తే వారిని కించపరిచేలా అధికారులు మాట్లాడవద్దని సూచించారు. పోలీసు అంటే ప్రతిపక్ష పార్టీలు అరెస్టులకే అనే విధంగా గత ప్రభుత్వం ఉపయోగించిందన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని, ప్రజలతో మంచిగా మాట్లాడాలని సూచించారు. సచివాలయ పోలీసులను ఏవిధంగా వినియోగించాలో ఆలోచన చేస్తామన్నారు.
సోషల్ మీడియాలో నేటికీ తాను బాధితురాలినేనని, అసభ్య పోస్టులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు చాలా పెట్టారని, తన మీదే 23 కేసులు ఉన్నాయన్నారు. అక్రమ కేసులను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము పగ, ప్రతీకారాల ఆలోచన చేయడం లేదని, పోలీసు అంటే ప్రజల్లో ఒక నమ్మకం, గౌరవం తీసుకొస్తామన్నారు. దిశ చట్టమే ఏపీలో లేదని.. ఇక స్టేషన్ల పేరు కూడా మార్చే ఆలోచన చేస్తామన్నారు. హోంశాఖకు ఎంత నిధులు అవసరమో ఒక నివేదిక సిద్దం చేశామని, ప్రాధాన్యత ప్రకారం కేటాయిస్తూ ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. నిధుల కొరత వల్ల ఒకేసారి అన్నీ చేయలేమని చెప్పారు. చాలా చోట్ల సిసి కెమెరాలు, ప్రింగర్ ప్రింట్ స్కానర్లు పని చేయడం లేదని, వైసీపీ ప్రభుత్వం వాటిని అసలు పట్టించుకోలేదని అన్నారు.
రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్య కాదని, గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన అధికారులపై చట్టపరంగా చర్యలు ఉంటాయని, తమకు కక్ష సాధింపు అంటే.. ఇంత కాలం ఆగుతామా? అని మంత్రి అనిత ప్రశ్నించారు. తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు. విశాఖలో సిపి కార్యాలయం తాకట్టులో ఉందని, ఎప్పుడు అప్పుల వాళ్లు వస్తారో తెలియదన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో 164 సీట్లు ప్రజలు ఇచ్చారని, మాకు రాష్ట్రం, ప్రజలే ముఖ్యమని.. వారి కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. ఇంకా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టులో ఉన్నాయన్నారు. పోలీసులు నిబంధనలు మేరకు పని చేయాలన్నారు. రాజకీయాలు కావాలంటే బయటకి వెళ్లి ఖద్దరు వేసుకోవాలని సూచించారు. పోలీసు అంటే ప్రజల కోసం పని చేసే వ్యవస్థ అనేలా పని చేయాలన్నారు. మహిళల మిస్సింగ్ కేసులపై దర్యాప్తు చేస్తామని, ఏపీలో ప్రతిఒక్కరూ భద్రతగా, భరోసాగా ఉండేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్
సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సుప్రీం కోర్టుకు వెళ్దాం: కేసీఆర్
డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ భారీ మాయ..
బీఆర్ఎస్కు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 27 , 2024 | 02:05 PM