TG RTC: ఆర్టీసీ డ్రైవర్లపై వరుస దాడులు
ABN , Publish Date - May 30 , 2024 | 01:26 AM
గవర్నర్‌పేట-1 డిపో డ్రైవర్ సీహెచ్‌ఎస్ రావుపై గుర్తుతెలియని దుండగులు బుధవారం పాశవికంగా దాడి చేశారు. డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ (డీజీటీ) వాహనం బుధవారం అన్‌లోడింగ్ చేయటానికి ఇబ్రహీంపట్నం వచ్చింది. అన్‌లోడింగ్ పూర్తయ్యాక ఈ వాహనం విజయవాడ బయల్దేరింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం రింగ్ దాటాక ఎదురుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని డీజీటీ ఓవర్‌టేక్ చేసింది.

ఇబ్రహీంపట్నంలో డీజీటీ వాహన డ్రైవర్‌పై దారుణంగా..
ఓవర్‌టేక్ చేశాడని స్ర్కూ డ్రైవర్, కటింగ్ బ్లేర్‌తో పొడిచి పొడిచి..
దాడి అనంతరం పరారైన దుండగులు
రెండు రోజుల కిందట శ్రీకాళహస్తిలోనూ ఇదే తరహాలో..
ఇద్దరు ఆటోనగర్ డిపో డ్రైవర్లను కొట్టిన దుండగులు
కార్మిక సంఘాలతో ఎన్టీఆర్ జిల్లా డ్రైవర్ల భేటీ
బస్సులు ఆపి ఆందోళన చేపట్టాలని డిమాండ్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గవర్నర్‌పేట-1 డిపో డ్రైవర్ సీహెచ్‌ఎస్ రావుపై గుర్తుతెలియని దుండగులు బుధవారం పాశవికంగా దాడి చేశారు. డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ (డీజీటీ) వాహనం బుధవారం అన్‌లోడింగ్ చేయటానికి ఇబ్రహీంపట్నం వచ్చింది. అన్‌లోడింగ్ పూర్తయ్యాక ఈ వాహనం విజయవాడ బయల్దేరింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం రింగ్ దాటాక ఎదురుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని డీజీటీ ఓవర్‌టేక్ చేసింది. కాగా, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు డీజీటీ బస్సును ఆపి డ్రైవర్ సీహెచ్‌ఎస్ రావుపై దాడి చేశారు. డ్రైవర్ కేకలు వేయటంతో ఆ ముగ్గురు ఇంకా రెచ్చిపోయారు. డీజీటీ బస్సులో ఎవరూ లేకపోవటంతో పిడిగుద్దులు కురిపించారు.
అంతటితో వదిలిపెట్టకుండా ఓ యువకుడు డ్రైవర్ క్యాబిన్‌లో ఉన్న కటింగ్ బ్లేర్‌ను, మరో యువకుడు స్ర్కూ డ్రైవర్‌ను తీసుకుని పాశవికంగా డ్రైవర్ తలపై దాడి చేశారు. కటింగ్ బ్లేర్‌తో యువకుడి తలపై కొట్టగానే డ్రైవర్ అమాంతం కింద పడిపోయాడు. మళ్లీ పైకి లేపి సీటులో కూర్చోబెట్టి స్ర్కూ డ్రైవర్‌తో తలపై పొడిచారు. దీంతో డ్రైవర్‌కు తీవ్ర రక్తస్ర్తావమైంది. కొట్టొద్దని కాళ్లు పట్టుకున్నా వినలేదు. చేతులతో, కాళ్లతో విచక్షణారహితంగా కొట్టారు. అచేతనంగా పడిపోయాక వదిలిపెట్టారు. ఆ తర్వాత ఆ ముగ్గురు నందిగామ వైపు పారిపోయారు. ఈ విషయాన్ని స్థానికులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావటంతో డ్రైవర్‌ను అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను అధికారులు, యూనియన్ నాయకులు పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం వెతుకుతున్నారు.
శ్రీకాళహస్తిలో ఇద్దరు డ్రైవర్లపై దాడి
కాగా, రెండు రోజుల కిందట ఆటోనగర్ బస్ డిపోకు చెందిన ఇద్దరు డ్రైవర్లపై శ్రీకాళహస్తిలో ఇలాగే దాడి జరిగింది. ఆటోనగర్ డిపో డ్రైవర్లు వైపీ రావు, వైఎస్ రావుపై దుండగులు దాడి చేశారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు తమ కారును ఓవర్‌టేక్ చేసిందని శ్రీకాళహస్తి దగ్గర కారులోని యువకులు రెచ్చిపోయారు. కారు దిగి బస్సు ముందు టైరు ఎక్కి డ్రైవర్‌పై చేయి చేసుకున్నారు. ఈ ఉదంతాన్ని మరో డ్రైవర్ వీడియో తీయటంతో ఆగ్రహం చెందిన యువకుడు ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టాడు. ఆ తర్వాత బస్సులోకి వచ్చి వీడియో తీసిన డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. కారులోని మిగిలిన వారు కూడా డ్రైవర్లపై దాడి చేసి పరారయ్యారు.
ఆందోళన దిశగా డ్రైవర్లు
ఈ రెండు ఘటనలపై ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. దాడులను పోలీసులు సీరియస్‌గా తీసుకోవటం లే దని, కఠిన శిక్షలు పడితే తప్ప తమకు భరోసా ఉండదంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన డ్రైవర్లు ఉద్యోగ సంఘాల నేతల వద్ద పంచాయతీ పెట్టారు. జిల్లావ్యాప్తంగా బస్సులు ఆపేయాలని కోరారు. దీనికి ఉద్యోగ సంఘాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. బస్సులను ఆపి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం కంటే చట్టపరమైన రక్షణ కోరదామని సర్దిచెప్పినట్టుగా తెలుస్తోంది. అయినా డ్రైవర్లు వినలేదని సమాచారం. ఆందోళనలు చేపట్టే అంశంపై ఉద్యోగ సంఘాల్లో కూడా చర్చ నడుస్తోంది.