Sri Krishna Devarayalu: లావు శ్రీ కృష్ణదేవరాయలు పయనం ఎటు...?
ABN, Publish Date - Jan 24 , 2024 | 11:53 AM
పల్నాడులో కీలక నేత, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భవిష్యత్ కార్యాచరణపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆయన ఏ పార్టీలో చేరతారని అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది
అమరావతి: నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భవిష్యత్ కార్యాచరణ ఏంటీ..? ఆయన ఏ పార్టీలో చేరతారు..? ఏ పార్టీలో చేరతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ పార్టీలో చేరే అంశంపై లావు శ్రీకృష్ణ దేవరాయలు స్పష్టత ఇవ్వలేదు. లావు వెంట ఉన్న క్యాడర్ వైసీపీని వీడుతోంది. లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడటం ఆ పార్టీకి దెబ్బేనని విశ్లేషిస్తున్నారు. నరసరావు పేట పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు.
లావుకు మంచి పేరు
లావు శ్రీకృష్ణదేవరాయలు 2019 లోక్ సభ ఎన్నికల్లో నరసరావు పేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత నియోజకవర్గంపై పట్టు సాధించారు. పలు అభివృద్ధి పనులు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. గత నాలుగున్నర ఏళ్లలో చేసిన పనులు లావు శ్రీకృష్ణదేవరాయలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీలో చేరతారనే సస్పెన్స్ కొనసాగుతోంది. నరసరావు పేట లోక్ సభకు మాత్రం లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలో ఉంటారని తెలిసింది.
లావు వెంట క్యాడర్
శ్రీకృష్ణదేవరాయలుతోపాటు వైసీపీ క్యాడర్ పార్టీ వదిలేందుకు సిద్దంగా ఉన్నారు. మంగళవారం గురజాల పట్టణం కౌన్సిలర్ మహంకాళి అనిత రాజీనామా చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో జడ్పీటీసీ సభ్యుడు, కొందరు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు రాజీనామా చేయనున్నారు. పల్నాడు జిల్లా నుంచి మరో మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, గుంటూరు నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
లావు చేసిన అభివృద్ధి పనులు ఇవే
నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు పలు అభివృద్ధి పనులు చేశారు. పల్నాడులో కీలకమైన వరికపూడిశెల ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకొచ్చారు. ఎంపీ నిధులు, కార్పొరేటు సంస్థల నుంచి సీఎస్‌ఆర్ విభాగం కింద నిధులు తీసుకొచ్చి 88 గ్రామాల్లో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటుచేశారు. చిలకలూరిపేటలో కేంద్రీయ విద్యాలయం నిర్మించారు. రొంపిచర్ల, తాళ్ళపల్లిలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రానికి మంజూరు చేసిన వైద్య కళాశాలల్లో ఒకటి పిడుగురాళ్లలో ఏర్పాటయ్యేలా కృషి చేశారు. పల్నాడులో 100 పడకలతో ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరు చేయించారు. ఈ విధంగా లావుకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. అయితే నరసరావు పేట లోక్ సభ టికెట్‌ను బీసీకి కేటాయించాలని వైసీపీ హై కమాండ్ స్పష్టంచేసింది. దాంతో లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి, ఎంపీ పదవీకి రాజీనామా చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 24 , 2024 | 12:43 PM