PM MODI : మాఫియా రాజ్.. కరప్షన్ కింగ్
ABN, Publish Date - May 07 , 2024 | 04:49 AM
ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఓటు వేయండి. ఈసారి మీకోసం మోదీ గ్యారెంటీ ఉంది. చంద్రబాబు నాయకత్వం ఉంది.
జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ నిప్పులు
ఏపీలో ఇసుక, లిక్కర్, భూ మాఫియా
నిషేధమని చెప్పి మరీ మద్యం వ్యాపారం
అవినీతి తప్ప మరేమీ తెలియని జగన్
ఆయన జపించే మంత్రం అదొక్కటే
మేలు చేయరు.. డబ్బులొచ్చే పనులే చేస్తారు
ఐదేళ్లు అధికారం అప్పగిస్తే వృథా చేశారు
బాబు హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానం
వైపీసీ వచ్చాక గాడి తప్పిన పురోగతి
అభివృద్ధి సున్నా.. అవినీతి వంద శాతం
పోలవరం ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు
రాష్ట్రం కోసం, దేశం కోసం ఓటేయండి
మోదీ గ్యారెంటీ, బాబు నాయకత్వం,
పవన్ విశ్వాసం.. 4న తియ్యటి కబురు తథ్యం
రాష్ట్ర, దేశ అభివృద్ధికి మాదీ గ్యారెంటీ
రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ హామీ
(కాకినాడ/రాజమహేంద్రవరం/అనకాపల్లి - ఆంధ్రజ్యోతి)
‘‘ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఓటు వేయండి. ఈసారి మీకోసం మోదీ గ్యారెంటీ ఉంది. చంద్రబాబు నాయకత్వం ఉంది. ఇంకా... పవన్ కల్యాణ్ విశ్వాసమూ ఉంది! తెలుగు మధురమైనది. అనకాపల్లి బెల్లం తియ్యనైనది. జూన్ 4వ తేదీన ఇంతకంటే తియ్యటి, మంచి కబురు వినిపిస్తుంది. ఏపీలో ఎన్డీయే సర్కారు ఏర్పడుతుంది. ఢిల్లీలోనూ ఎన్డీయే పతాకం రెపరెపలాడుతుంది. డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన రాజమహేంద్రవరం, అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాజమండ్రి సభలో జనసేన అధిపతి పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత లోకేశ్ పాల్గొనగా... అనకాపల్లి సభలో చంద్రబాబుతో కలిసి మోదీ వేదికను పంచుకున్నారు. రెండుచోట్లా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ‘ఆయనకు అవినీతి తప్ప మరేమీ తెలియదు’ అని సూటిగా చెప్పారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. డబ్బులు వచ్చే పనులు తప్ప, మంచి పనులు చేయరని జగన్‌ను దునుమాడారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపితే... జగన్ దానిని పట్టాలు తప్పించారని విమర్శించారు. రెండు సభల్లో ప్రధాని మోదీ చెప్పిన కీలకాంశాలు... ఆయన మాటల్లోనే!
వైసీపీ ఏం చేసింది...
మా మంత్రం అభివృద్ధి... అభివృద్ధి... అభివృద్ధి. కానీ... వైసీపీ మంత్రం కరప్షన్... కరప్షన్... కరప్షన్! అభివృద్ధికి బ్రేకులు వేయడమే వైసీపీ ప్రభుత్వానికి తెలిసిన విద్య. మేం విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చాం. కానీ... రాష్ట్ర ప్రభుత్వం రైల్వే కార్యాలయం కోసం స్థలమే ఇవ్వలేదు. ఏపీలో పేదల కోసం 20 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. కానీ... వైసీపీ సర్కారు వాటిలో సగం నిర్మించలేకపోయింది. ఎందుకంటే... అవినీతికి ఆస్కారమున్న పనులు మాత్రమే జగన్ చేస్తారు. లేదంటే చేయరు! మోదీ పేదరిక నిర్మూలన చేస్తుంటే... జగన్ పేదలను పీడించే పనిలో పడ్డారు. ఇదే జగన్ అజెండా! జగన్ మద్య నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చారు. కానీ... ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తోంది. రాష్ట్రంలో భారీ స్థాయిలో మద్యం సిండికేట్ నడుస్తోంది. ఏపీ సర్కారు ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా నడిపిస్తోంది. ఏపీలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా.. అభివృద్ధికి బ్రేకులు పడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ... ఇన్నేళ్లలో ఒక్క రాజధానినీ నిర్మించలేదు. నిజానికి మూడు రాజధానుల పేరుతో దోపిడీ చేయాలని వైసీపీ భావించింది. అంతకంటే ముందే ఖజానాను ఖాళీ చేసింది. వీళ్లు కరప్షన్ మేనేజ్‌మెంట్ మాత్రమే చేయగలరు. కానీ... ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ వీళ్లకు చేతకాదు. సేవాభావం లేని ప్రభుత్వం రాష్ట్రానికి ఇలాంటి గతినే పట్టిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చింది. కానీ... జగన్ ప్రభుత్వం దానిని నిలిపివేసింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు చక్కటి నిదర్శనం. దీని పనులు జగన్ రెడ్డి తండ్రి వైఎస్ మొదలుపెట్టారు. జగన్ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు కానీ... ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టును మాత్రం పూర్తిచేయలేదు. వైసీపీకి రైతులంటే ఏమాత్రం శ్రద్ధ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చెరకు రైతులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా చెరకు సాగునే మానేశారు. ఈ ప్రాంతంలో అనేక చక్కర కర్మాగారాలు మూతపడ్డాయి. ఏపీలో, ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కారుతో చెరకు రైతుల జీవితాలు మారిపోతాయి. మా ప్రభుత్వం పెట్రోలులో ఇథనాల్‌ను కలుపుతోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా చెరకు రైతులకు రూ.8వేల కోట్లు అందుతాయి. మత్స్యకారుల క్షేమం గురించి తొలిసారిగా ఎన్డీయే ప్రభుత్వమే ఆలోచించింది. వారి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ, అనుబంధ రంగాల్లో ఉన్న వారికి బీమా సౌలభ్యం కల్పించాం. మోదీ గ్యారెంటీలో మత్స్యరంగాన్నీ చేర్చాం.
బాబు హయాంలో అభివృద్ధిపథం...
దేశంలో కాంగ్రెస్ నేతలు ఎన్నికల ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్సార్ కాంగ్రె్‌సను రిజెక్ట్ చేసేశారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రె్‌సకు ఐదేళ్ల అధికారాన్ని ఇస్తే... మొత్తం ఐదేళ్లను జగన్ వృథా చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండింది. వైఎస్సార్ కాంగ్రెస్ రాగానే అభివృద్ధి పట్టాలు తప్పింది. ఇప్పుడున్న ఏకైక ధీమా, నమ్మకం, గ్యారెంటీ... ఎన్డీయే ఒక్కటే! రాష్ట్రంలో, కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే... ఇప్పుడు ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.
హద్దుల్లేని మాఫియా...
కాంగ్రెస్ పోయింది... వైఎస్సార్ కాంగ్రెస్ వచ్చింది! కానీ... ఆ రెండు పార్టీలదీ ఒకటే మాట, బాట! వారిది హద్దుల్లేని అవినీతి, మాఫియా రాజ్యం! పొరుగునే కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ట్యాంకర్ మాఫియా, ల్యాండ్ మాఫియా ప్రభుత్వం నడుస్తోంది. ఇక్కడ ఏపీలో ల్యాండ్ మాఫియా, శ్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా నడుస్తోంది. ఈ దోపిడీ నుంచి రాష్ట్రానికి విముక్తి లభించాలంటే... ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి. ఈనెల 13వ తేదీన మీరు వేసే ఓటు దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ ఓటుతో ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో కొత్త అధ్యాయం సృష్టించాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే రికార్డు సృష్టించడం ఖాయమైంది. ఏపీలో ఎన్డీయే సర్కారు ఏర్పడుతుంది.
చేసింది చెప్పి...
అంతకుముందు నేతలు ఓట్లు అడిగితే మాకేం చేశారని ప్రజలు ప్రశ్నించేవారు. కానీ... మేం ఏం చేశామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం. మాది వికసిత ఏపీ, వికసిత భారత్ విజన్! ఈ లక్ష్యంతోనే పదేళ్లు పనిచేశాం. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు 6 లేన్ల జాతీయ రహదారి వేశాం. రాయపూర్ నుంచి విశాఖపట్నం వరకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరుగుతోంది. కోల్‌కతా - చెన్నై హైవే పూర్తయింది. 2014 వరకు ఏపీలో కేవలం 4వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవి. ఇప్పుడు ఆ నిడివి 8వేల కిలోమీటర్లకు పెరిగింది. ఇంకా... ఇక్కడి యువత కోసం ఎన్డీయే ప్రభుత్వం ఎంతో చేసింది. ఐఐఐఐటీ కర్నూలు, ఐఐటీ తిరుపతి, ఐసర్ తిరుపతి, ఐఐఎం విశాఖ.... ఇంకా పెట్రోలియం యూనివర్సిటీ ఇచ్చాం. గ్రీన్ ఎనర్జీ పార్క్ మంజూరు చేశాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు కోసం వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేశాం. అమరావతి-విజయవాడ...రోడ్ ప్రాజెక్టు, ఏపీని హైదరాబాద్‌తో అనుసంధానించే కొత్తదారులు చేపట్టాం.
నేనొచ్చానని చెప్పండి
మీరంతా ఇక్కడి నుంచి వెళ్లగానే...ఇంటింటికీ వెళ్లి, మన మోదీ వచ్చారు, మీకు నమస్కరించానని చెప్పమన్నారని తెలియచేయండి. వారి ఆశీర్వాదాలు అందించమని కోరండి. ఆ ఆశీస్సులతో నాకు కొత్త శక్తి వస్తుంది.
కాంగ్రె్‌సతో జాగ్రత్త
కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. పదేళ్ల కిందట దేశాన్ని కాంగ్రెస్ ఏ స్థితిలోకి నెట్టేసిందో! భారత్ అంటే స్కాములు గుర్తుకొచ్చేవి. వాటిపైనే చర్చ జరిగేది. ఇండియా కూటమి నేతలు ఈడీ, ఈడీ అని గోల చేస్తున్నారు. అది ఎందుకో అందరికీ తెలుసు! జార్ఖండ్‌లో కరెన్సీ కొండను బయటపెట్టింది. దీనిపై కాంగ్రెస్ ‘రాకుమారుడు’ జవాబు చెప్పాలి.
రాముడంటే ఎన్టీఆర్...
ఏపీ అంటే గుర్తుకొచ్చేది ఎన్టీ రామారావు. తన చిత్రాల ద్వారా శ్రీరాముడి చరిత్రను ఇంటింటికీ చేర్చింది ఆయనే. బీజేపీ అయోధ్యలో రామాలయ నిర్మాణంతో 400 సంవత్సరాల కల నెరవేర్చింది. ఈ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ బహిష్కరించింది. ఎవరైనా కాంగ్రెస్ నేతలు భక్తితో ఆలయానికి వెళితే... వారినీ పార్టీ నుంచి బహిష్కరిస్తుంది.
భారతీయులకు గర్వకారణంగా...
నేడు భారత్ ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ ఖ్యాతి గడించింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠ పెరిగింది. ఇది ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకోగలిగే విజయాలు. అంతేకాదు... ప్రవాస భారతీయులకూ ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తోంది.
తెలుగులో అభివందనం...
రాజమహేంద్రవరం, అనకాపల్లి సభల్లో మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘నాఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం! రాజమహేంద్రవరం వాసులకు నమస్కా రం. గోదావరి తల్లికి నమస్కారం. ఇది నన్నయ్య నడయాడిన నేల’’ అని రాజమండ్రిలో... ‘‘నూకాలమ్మకు ప్రణా మం! మంగళవారం అల్లూరి వర్ధంతి. భీమవరంలో రెండేళ్ల క్రితం ఆయన విగ్రహావిష్కరణ చేసే అవకాశం నాకు లభించింది’’ అని తెలిపారు. తాను గుజరాత్‌కు బయలుదేరాల్సి ఉందని, అందువల్లే చంద్రబాబుకంటే ముందే ప్రసంగిస్తున్నానని అనకాపల్లి సభలో చెప్పారు. ‘మీరంతా చంద్రబాబు ప్రసంగం విన్న తర్వాతే ఇక్కడి నుంచి వెళ్లాలి’’ అని కోరారు.
Updated Date - May 07 , 2024 | 06:27 AM