Bapatla : వందేళ్లుగా ఆ బావి నీరే దిక్కు!
ABN, Publish Date - Dec 25 , 2024 | 04:51 AM
తాతముత్తాతల కాలం నుంచీ ఆ గ్రామానికి ఊళ్లో ఉన్న ఒక్క బావి నీరే దిక్కు.. అప్పట్లో గిలకల ద్వారా బావి నీటిని తోడుకొని కావడి, బిందెలతో ఇంటికి మోసుకు పోయే వారు.
వందకుపైగా మోటార్లు.. నేరుగా ఇళ్లకు పైపులు
బాపట్ల జిల్లాలో ఊరంతటినీ ఆదుకుంటున్న బావి
అద్దంకి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తాతముత్తాతల కాలం నుంచీ ఆ గ్రామానికి ఊళ్లో ఉన్న ఒక్క బావి నీరే దిక్కు.. అప్పట్లో గిలకల ద్వారా బావి నీటిని తోడుకొని కావడి, బిందెలతో ఇంటికి మోసుకు పోయే వారు. కాలక్రమంలో ఆ పద్ధతి మారి పోయి విద్యుత్ మోటార్లు వచ్చాయి. దీంతో ఎవరికి వారే మోటార్లను ఏర్పాటు చేసుకొని ఇళ్ల వరకు మంచినీటి పైప్ లైన్లను వేసుకొని వినియోగించుకుంటున్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మామిళ్లపల్లి పరిస్థితి ఇది. ఈగ్రామంలో ఎక్కడ బోరువేసినా ఉప్పునీరే వస్తోంది. కానీ ఆ ఒక్క బావి నీరు మాత్రం రుచిగా ఉంటుంది. తాగునీటి కోసం ఆ బావి నీరు ఆధారంగా ఆర్వో ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఇళ్లల్లో వాడుకునేందుకు కూడా బోర్ల నీరు ఉపయోగపడకపోవడంతో సుమారు 100 కుటుంబాలు ఆ బావి నీటిని వినియోగించుకునేలా నేరుగా బావి వరకు సర్వీస్ వైరు ఏర్పాటు చేసుకొని మోటార్లు బిగించుకున్నారు. సమీప ఇళ్లవారు నేరుగా ఇళ్ల వద్ద విద్యుత్‌తోనే పైపులు ఏర్పాటు చేసుకోగా, దూరంగా ఉన్నవారంతా సమీపంలోని షెడ్‌లోనే విద్యుత్ మీటర్లు పెట్టి, మోటార్లను బావిలోకి దించారు. దీంతో బావి మొత్తం మోటార్లు, విద్యుత్ వైర్లు, వాటర్‌పై్‌పలతో నిండిపోయింది.
Updated Date - Dec 25 , 2024 | 04:51 AM