జగన్ అండ్‌కోకు మైండ్ బ్లాంక్!
ABN , Publish Date - May 20 , 2024 | 04:47 AM
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెనుక ఏం జరిగిందన్న విషయంలో ముసుగు తొలగిపోయింది.
ల్యాండ్ టైటిలింగ్‌పై నీతి ఆయోగ్ ఝలక్
ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్
కేంద్రం, నీతి ఆయోగ్ ఒత్తిడి మేరకే చట్టం చేశామన్న ప్రచారం డొల్లే
ఆ చట్టంలో ఏముందో మాకు తెలీదు
ఆర్టీఐ వినతికి సమాధానం ఇచ్చిన సంస్థ
ఇన్నాళ్లూ సర్కారు చెప్పినవన్నీ అబద్ధాలే
నీతి ఆయోగ్ జవాబుతో తొలగిన ముసుగు
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు కర్త, కర్మ, క్రియ అంతా కేంద్రమేనని, నీతి ఆయోగ్ సిఫారసు మేరకే చట్టం చేశామని సర్కారు పెద్దలు చేస్తున్న ప్రచారం డొల్లేనని తేలిపోయింది. ఎన్నికల పోలింగ్‌కు ముందు, తర్వాత కూడా ఇదే ప్రచారం చేసిన వైసీపీ పెద్దలకు షాకిస్తూ.. అసలు ఈ చట్టం గురించి తమకు తెలియదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెనుక ఏం జరిగిందన్న విషయంలో ముసుగు తొలగిపోయింది. ఈ చట్టాన్ని కేంద్రం చేయాలని చెబితే చేశామని.. నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే తీసుకువచ్చామని చెప్పిన సీఎం జగన్ సహా ప్రభుత్వ పెద్దల మాటలు పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది. ఏపీ తెచ్చిన చట్టంపై తమకు కనీస సమాచారం కూడా లేదని.. ఇది ఎలా ఉందో కూడా తమకు తెలియదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్రంపైనా, నీతి ఆయోగ్‌పైనా నెట్టేసే ప్రయత్నం చేసిన సీఎం జగన్ సహా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అజేయ కల్లం రెడ్డిలు చెప్పింది బూటకమని తేలిపోయింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం గురించి సమాచార హక్కు(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారమూ లేదని కుండబద్దలు కొట్టింది. దీంతో జగన్ సర్కారు చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది. జగన్ సర్కారు నీతి ఆయోగ్‌తో సంబంధం లేకుండా, తన సొంత ధోరణిలోనే ఈ చట్టం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ చట్టాన్ని కూడా రాజకీయ అవసరాలకు వాడుకుందామని వైసీపీ ప్లాన్ చేసిందనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక, ఈ చట్టంలోని అనేక అంశాలు రైతులకు ఇబ్బందిగా ఉన్నాయని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో ముఖ్యమంత్రి జగన్, ఆయన సలహాదారులు, రాజకీయ వ్యూహకర్తలు తర్జన భర్జన పడ్డారు. దీంతో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. తమ సొంత ప్రయోజనాల కోసం చట్టం తీసుకురాలేదని, కేంద్రం, నీతి ఆయోగ్ ఒత్తిడి చేస్తేనే చట్టం చేశామని అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేశారు. సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు నాగిల్ల వెంకటేశ్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద ఏపీ ల్యాండ్ టైటిల్ చట్టం గురించి నీతి ఆయోగ్‌ను సమాచారం కోరారు. పోలింగ్ ముగిసిన మూడు రోజులకు అంటే ఈ నెల 16న నీతి ఆయోగ్ స్పందించింది. ఆరు ప్రశ్నలకు నీతి ఆయోగ్ అండర్ సెక్రెటరీ రవీందర్ కౌర్ బైన్స్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే
నీతి అయోగ్ సిఫారసుల మేరకు తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎలా ఉంది? అని అడిగిన ప్రశ్నకు ‘మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు’ అని తెలిపింది.
రైతులు భూములు అమ్ముకోవడానికి రాష్ట్రం అనుమతి తీసుకోవాలా? అన్న ప్రశ్నకు ‘‘ఏపీ ల్యాండ్ టైటిల్ చట్టంలో ఏముందో మాకు తెలియదు. దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు’’ అని నీతి ఆయోగ్ తేల్చి చెప్పింది.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టైటిలింగ్ చట్టం అమలుకు నీతి ఆయోగ్, కేంద్రం ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి? అన్న ప్రశ్నకు ‘‘మేం భూ వనరుల విభాగంతోపాటు రాష్ట్రాలకు కేవలం ముసాయిదాను మాత్రమే పంపించాం’’ అని నీతి ఆయోగ్ పేర్కొంది.
అన్నీ అబద్ధాలే!
చట్టం గురించి నీతి ఆయోగ్ చెప్పిన వాస్తవాలు ఇలా ఉంటే, జగన్ సర్కారు మాత్రం పచ్చి అబద్ధాలు, అవాస్తవాలను ప్రచారం చేసింది. రైతులను మభ్యపెట్టేందుకు కేంద్రం, నీతి ఆయోగ్‌పై నిందలు మోపింది. ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం, నీతి ఆయోగ్‌లు తమపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయని, ఇది తమ సొంత ఆలోచన కానేకాదని ముఖ్యమంత్రి జగన్, ఆయన సలహాదారులు పదేపదే చెప్పారు. ఎన్నికల సభల్లోనూ అవే అబద్ధాలు వల్లించారు. ఇక, సజ్జల రామకృష్ణారెడ్డి అబద్ధాలే సిగ్గుపడేలా వ్యాఖ్యానాలు చేశారు. టైటిలింగ్ చట్టం దేశంలోని 24 రాష్ట్రాల్లో అమల్లో ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని సీఎం రోత పత్రిక అచ్చేయడం గమనార్హం. ఎన్నికల సమయంలో ఏది మాట్లాడినా జనం నమ్మేస్తారన్న అభిప్రాయంతో ఇలా అబద్ధాలు ప్రచారం చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కానీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ‘ఆంధ్రజ్యోతి’ రాసిన వార్తలు అక్షరసత్యమని తాజా ఆర్టీఐ సమాచారంతో నిర్ధారణ అయింది.
ముందే కూసి!
జగన్ సర్కారు ల్యాండ్ టైటిలింగ్ బిల్లును 2019, జూలై 26నే కేంద్రం ఆమోదం కోసం పంపింది. కానీ, నీతి ఆయోగ్ ముసాయిదాను 2019 డిసెంబరు 26న పంపించింది. అంటే, నీతి అయోగ్ నుంచి ముసాయుదా రావడానికి ఆరు నెలలకు ముందే జగన్ సర్కారు టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రం పరిశీలనకు పంపించింది. ఈ వాస్తవం ఎవ్వరికీ తెలియదని వైసీపీ నేతలు భావించారు. కేంద్రం ఒత్తిడి చేయబట్టే చట్టం తీసుకొచ్చామని జగన్ పదేపదే చెప్పారు. కానీ, అది అబద్ధమని ఇప్పుడు తేలిపోయింది. నిజంగా నీతి ఆయోగ్ పదేపదే ఏపీపై ఒత్తిడిచేసి ఉంటే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఏముందో? ఏయే అంశాలు అందులో ఉన్నాయో సవివరంగా తెలియజేసేది. కానీ, రాష్ట్రం చేసిన చట్టం గురించి తెలియదు కాబట్టే ఆ చట్టంలో ఏముందో తమకు తెలియనే తెలియదని కుండబద్దలు కొట్టింది.
ఇప్పుడు ఏం చెబుతారు?
ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయాన్ని నీతి ఆయోగ్ తేల్చిసిన దరిమిలా.. సీఎం జగన్, ఆయన సలహాదారులు ఇప్పుడు ఏం చెబుతారు? పాత అబద్ధాలే వల్లిస్తారా? లేక కొత్త అబద్ధాలను వండివారుస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏం చెప్పినా సరే.. టైటిలింగ్ చట్టం కేంద్రంతో సంబంధం లేకుండానే జగన్ తీసుకొచ్చారన్నది నీతి ఆయోగ్ సమాధానంతో విస్పష్టంగా బయటపడింది. పైగా, కేంద్రానికి 2019లో పంపిన బిల్లును ఆమోదించలేదు. 2021, 2022లో అసెంబ్లీలో బిల్లులను సవరించి కేంద్రానికి పంపించారు. ఆ బిల్లును ఆమోదించేలా ఇక్కడి అధికారులు ఢిల్లీలో మకాం వేసి పెద్ద లాబీయింగ్ చే శారు. ఒక రకంగా ఆ బిల్లును ఆమోదించాలని జగన్ సర్కారే కేంద్రంపై పదేపదే ఒత్తిడిలు తీసుకొచ్చింది. దీన్ని బట్టి ఈ చట్టం గురించి, ప్రజల్లో నెలకొన్న భయాందోళనల పట్ల జగన్ సర్కారు చెప్పినవన్నీ డొల్లమాటలేనని స్పష్టమవుతోంది.