Nara Bhuvaneshwari : కౌరవ సభ స్థానంలో గౌరవ సభ
ABN , Publish Date - Jun 19 , 2024 | 05:32 AM
కౌరవ సభ స్థానంలో కొలువయ్యే గౌరవ సభ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో అన్నీ మంచి రోజులే: భువనేశ్వరి
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): కౌరవ సభ స్థానంలో కొలువయ్యే గౌరవ సభ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులేనని మంగళవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘నాడు నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశాను. వారి బాధలు విన్నాను. నాటి పాలకుల అణచివేతను అర్థం చేసుకున్నాను. కోరుకున్నట్లుగానే అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజాపాలన మొదలైంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్నంత సంతోషంగా ఉన్నారు. స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు.
నాడు జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తావిస్తున్నారు. అశాంతితో బతికిన ప్రజల మనసులు తేలిక పడ్డాయి. మహిళలు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్‌పై ధైర్యంగా ఉన్నారు. ఇది నా మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక ప్రజలకు అంతా మంచే జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో.. చంద్రబాబు పాలనలో.. అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుంది. రాజధాని రైతుల పోరాటాలు ఫలించి, వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి. బాబు దీక్ష, పట్టుదలతో పోలవరం సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందడుగు వేస్తుంది. ప్రాణాలు పణంగా పెట్టి, పని చేసిన పార్టీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుంది. ప్రజలు ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందనే పూర్తి నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు. పోలవరం పరిశీలనకు వెళ్లిన చంద్రబాబు ఫొటోలను తన పోస్టుకు జత చేశారు.