టీసీఎస్‌ను నువ్వు తెచ్చినట్లు.. ఆత్మ చెప్పిందా?
ABN, Publish Date - Oct 12 , 2024 | 04:02 AM
పది వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ను విశాఖకు జగనే తీసుకొచ్చినట్లుగా ఆయన రోజూ రాత్రిపూట మాట్లాడుకునే ఆత్మ చెప్పిందేమోనని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్ ఎద్దేవాచేశారు.
‘కియా’ విషయంలోనూ జగన్ తీరింతే: లోకేశ్
తరిమేసిన పరిశ్రమలను వెనక్కి రప్పిస్తాం
కొలనుకొండలో కియా షోరూం ప్రారంభం
అమరావతి-ఆంధ్రజ్యోతి/తాడేపల్లి, అక్టోబరు 11: పది వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎ్‌స)ను విశాఖకు జగనే తీసుకొచ్చినట్లుగా ఆయన రోజూ రాత్రిపూట మాట్లాడుకునే ఆత్మ చెప్పిందేమోనని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్ ఎద్దేవాచేశారు. గతంలో సీఎం చంద్రబాబు ‘కియా’ మోటార్స్‌ను రాష్ట్రానికి తీసుకొస్తే తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాసిన లేఖ వల్లే అది వచ్చిందని జగన్ గొప్పలు చెప్పుకొన్నారని.. ఇప్పుడు టీసీఎస్ కూడా తన వల్లే వస్తోందని అంటున్నారని మండిపడ్డారు. తన పాలనలో ఎన్ని కంపెనీలను తెచ్చారో ఆయన బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారమిక్కడ మంగళగిరి కొలనుకొండలో నూతన కియా కార్ల షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
2014-19 మధ్య టీడీపీ హయాంలో 44 వేల పరిశ్రమల ఏర్పాటుతో 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సాక్షాత్తూ జగన్ ప్రభుత్వమే నాడు శాసనమండలిలో అంగీకరించిందని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి సర్కారు ఏర్పడ్డాక రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే లులూ, టీసీఎస్ వస్తున్నాయన్నారు. గతంలో జగన్‌రెడ్డి తరిమేసిన పరిశ్రమలను తిరిగి వెనక్కి రప్పిస్తామని స్పష్టం చేశారు.
తాము రాజధానుల వికేంద్రీకరణకు గాకుండా.. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ‘రాయలసీమకు మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకొస్తాం. కర్నూలుకు పవన, సౌర, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు.. కడప, చిత్తూరు జిల్లాలకు ఎలకా్ట్రనిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు.. అనంతపురం జిల్లాకు ఆటోమొబైల్ పరిశ్రమలు వస్తాయి. ఉత్తరాంధ్రలో సేవారంగాన్ని విస్తృతం చేస్తాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా, పెట్రోకెమికల్ పరిశ్రమలు తెస్తాం’ అని వివరించాం. ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘పదిరోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రివర్గ సహచరులు వరద బాధితులను ఆదుకునే పనులు పర్యవేక్షించారు. పునరావాస పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి.. దాదాపు రూ.650 కోట్ల సాయం అందించాం. ఫేక్ ప్రచారం చేసేవారు చట్టపరంగా భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది’ అని తేల్చిచెప్పారు. రూ.కోటి సాయం ప్రకటించిన జగన్ ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రెడ్‌బుక్ యాక్షన్ మొదలైంది!
బ్లూ బుక్, గుడ్ బుక్ అంటున్న జగన్.. తనను చూసి ప్రేరణ పొందారేమోనని లోకేశ్ చమత్కరించారు. పాదయాత్రలో భాగంగా వంద బహిరంగ సభల్లో మాట్లాడానని.. రెడ్ బుక్ చూపిస్తూ చట్టాన్ని అతిక్రమించి ప్రజలను ఇబ్బందిని పెట్టిన అధికారులు, వైసీపీ నాయకులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటానని ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే యాక్షన్ మొదలైందన్నారు. జగన్ జనంలోకి వెళ్తానంటే తాము ఆయనలాగా ఇంటి గేట్లకు తాళ్లు కట్టి తాళం వేయబోమని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవంలో మంత్రులు ఎం.రాంప్రసాద్‌రెడ్డి, పార్థసారఽథి, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, యార్లగడ్డ వెంకట్రావు, గద్దె రామ్మోహన్‌రావు, రాష్ట్ర పద్మశాలి డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 12 , 2024 | 04:02 AM