ఆదిమూలం ఇంట్లోకి నో ఎంట్రీ!
ABN, Publish Date - Sep 13 , 2024 | 04:54 AM
లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో నాటకీయ పరిస్థితుల నడుమ చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు.
గన్‌మెన్, పీఏ సహా ఎవరికీ అనుమతి లేదు
చెన్నై ఆస్పత్రి నుంచి పుత్తూరుకు ఎమ్మెల్యే
కలిసేందుకు ఇంటెలిజెన్స్ అధికారుల యత్నం
ప్రస్తుతం మాట్లాడలేనని ఎమ్మెల్యే దాటవేత
బాధిత మహిళకు ముగిసిన వైద్య పరీక్షలు
తిరుపతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో నాటకీయ పరిస్థితుల నడుమ చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు. వాస్తవానికి మంగళవారం రాత్రే ఆయన పుత్తూరు శివార్లలోని నివాసానికి చేరుకున్నారని తెలిసింది. కుటుంబీకులతో కలసి ఉంటున్న ఆయన గన్‌మెన్, పీఏ సహా బంధుమిత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ ఇంటికి అనుమతించడం లేదని సమాచారం.
ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులు ఎమ్మెల్యేను కలిసేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలో వాస్తవంగా ఏమి జరిగిందన్నది ప్రభుత్వానికి నివేదించాల్సి ఉన్నందున వివరాలు సేకరించడానికి గానూ ఆయనకు ఫోన్ చేసినట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్యే తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇప్పుడే ఇంటికి వచ్చానని చెప్పినట్టు తెలిసింది. తన వయసు 72 ఏళ్లని, హృదయ సంబంధ సమస్యతో స్టంట్ వేయించుకున్నానని వివరించినట్టు సమాచారం.
తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మాట్లాడలేనని చెప్పినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో తానే తిరుపతి వచ్చి కలుస్తానని దాటవేసినట్టు తెలిసింది. కాగా ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసిన బాధిత మహిళకు తిరుపతి ప్రభుత్వ మెటర్నటీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. తొలుత పోలీసులు రెండు సార్లు ప్రయత్నించినా ఆమె వైద్య పరీక్షలకు ముందుకు రాలేదు. అయితే బుధవారం ఆమె అందుబాటులోకి రావడంతో అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తునకు అవసరమైన పది రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆమెను డిశ్చార్జి చేశారు.
Updated Date - Sep 13 , 2024 | 07:16 AM