Palnadu Assassination Case : పథకం ప్రకారమే చంపేసింది!
ABN, Publish Date - Dec 18 , 2024 | 04:44 AM
తండ్రికి ప్రభుత్వం ద్వారా అందే ఆర్థిక ప్రయోజనాలన్నీ తనకే దక్కాలన్న దురుద్దేశంతో సోదరులను దారుణంగా చంపేసిన కృష్ణవేణి..
సహకరించిన ప్రియుడు, నలుగురు మైనర్లు
అన్నదమ్ముల హత్య కేసులో చెల్లిసహా ఆరుగురి అరెస్టు
నకరికల్లు, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తండ్రికి ప్రభుత్వం ద్వారా అందే ఆర్థిక ప్రయోజనాలన్నీ తనకే దక్కాలన్న దురుద్దేశంతో సోదరులను దారుణంగా చంపేసిన కృష్ణవేణి, ఆమె ప్రియుడు మల్లాల దానయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను పల్నాడు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు మంగళవారం వెల్లడించారు. కృష్ణవేణి తండ్రి నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఈ ఏడాది జనవరిలో చనిపోయాడు. అతనికి ప్రభుత్వం నుంచి రూ.60-70 లక్షలు వచ్చే అవకాశం ఉంది. భర్తకు దూరంగా ఉంటున్న తనకు ఈ డబ్బుల్లో వాటా ఇవ్వాలని అన్నదమ్ములు గోపీకృష్ణ, దుర్గా రామకృష్ణను కృష్ణవేణి కోరింది. దీనికి వాళ్లు ఒప్పుకోలేదు. అంతేగాక కృష్ణవేణిని చంపేస్తానని దుర్గా రామకృష్ణ బెదిరించాడు. తనకు ముప్పు ఉందని భావించిన కృష్ణవేణి.. అతడిని చంపేస్తే ప్రభుత్వం ఇచ్చే డబ్బు తీసుకోవచ్చని ప్రియుడు దానయ్యకు చెప్పింది. అంతేగాకుండా చెరో రూ.10 వేలు చొప్పున ఇచ్చేలా ఇద్దరు బాలురను కూడా మాట్లాడుకుంది. ఆరోజు రాత్రి 10:30కు దుర్గా రామకృష్ణకు మద్యం తాగించి చున్నీతో గొంతు బిగించి చంపేసి, మేజరు కాలువలో పడేశారు. ఇది జరిగి 15 రోజులైనా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో తన అన్న, కానిస్టేబుల్ గోపీకృష్ణ అడ్డు కూడా తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం మరో ఇద్దరు బాలురను కిరాయికి మాట్లాడుకుంది. గోపీకృష్ణకు మద్యంలో నిద్రమాత్రలు కలిపి బాగా తాగించారు. ఆతర్వాత మెడకు చున్నీ, వైరు బిగించి చంపేసి శవాన్ని గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో పడేశారు. విషయం బయటకు రావడంతో కృష్ణవేణి, ఆమె ప్రియుడు మల్లాల దానయ్య, నలుగురు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు.
Updated Date - Dec 18 , 2024 | 04:44 AM