Pawan Kalyan: రాష్ట్రంలో స్పేస్ పార్క్
ABN, Publish Date - Aug 26 , 2024 | 05:31 AM
అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్థి పథంలో ముందుకెళ్తుందని ఉపముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ సానుకూలత
రష్యా వ్యోమగామికి సత్కారం
అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్థి పథంలో ముందుకెళ్తుందని ఉపముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గి కోర్సకొవ్, స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లోని నివాసంలో పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమన్నారు.
శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సమావేశంలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి చర్చించారు.
ఇటీవల చేసిన అతిచిన్న శాటిలైట్ డిప్లయర్‌ను చూపించి, దాని పనితనాన్ని వివరించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ సీఈవో కేశన్ కోరారు.
స్పేస్ పార్క్ నాసాలో మాత్రమే ఉందని, భారత్‌లో ఎక్కడా లేదని చెప్పారు. ఏపీలో ఏర్పాటు చేస్తే, విద్యార్థులకు మరింత అవగాహన పెంచవచ్చని పేర్కొన్నారు.
దీనికి పవన్‌కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా రష్యా వ్యోమగామి సెర్గి కోర్సకొవ్‌ను పవన్ ఘనంగా సత్కరించారు.
చంద్రయాన్-3 రాకెట్ నమూనాను బహూకరించారు. సెర్గి ఆరు నెలల పాటు అంతరిక్షంలో ఉన్నారు. అక్కడి విశేషాలను, అంతరిక్షంలో ఎలా ఉండగలిగారో పవన్ అడిగి తెలుసుకున్నారు.
ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్ వంటకాలను రుచి చూపించారు. ఈ భేటీలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు యజ్ఞసాయి, ఎస్బీ అర్జునర్, సాయితన్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 26 , 2024 | 05:31 AM