Pawan Kalyan : మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం
ABN, Publish Date - Aug 23 , 2024 | 04:50 AM
దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను శుక్రవారం ఒకేసారి నిర్వహిస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
గ్రామ సభల్లో యువత, మహిళలు పాల్గొనాలి
పారదర్శక, జవాబుదారీ పాలనకు ఇదే నిదర్శనం
ఉపాధి, జల్ జీవన్ మిషన్ అవకతవకలపై దృష్టి
సామాజిక తనిఖీ విభాగానికి పోలీస్ అధికారిని హెడ్‌గా పెడతాం
గ్రామాల్లో నీటి పరిస్థితిపై 16 అంశాలతో
సర్వేలు జరుగుతున్నాయి: పవన్ కల్యాణ్
అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను శుక్రవారం ఒకేసారి నిర్వహిస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఈ సభల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాలో చేయాల్సిన పనులపై చర్చిస్తాం. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చాం. దాని ప్రకారమే పంచాయతీలు సుసంపన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నాం. ఈ సభల్లో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేస్తారు. శుక్రవారం నిర్వహించే గ్రామ సభలను తూతూ మంత్రంగా కాకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునేలా నిర్వహిస్తాం. ‘మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం’ అనేలా వీటి నిర్వహణ ఉంటుంది’ అని పవన్ అన్నారు.
నిధుల దుర్వినియోగం..
‘ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో రూ.40,579 కోట్లు నిధులు వచ్చాయి. గ్రామీణాభివృద్ధి కోసం ఈ నిధులను సక్రమంగా వాడి ఉంటే దాని ఫలాలు కనిపించేవి. కానీ ఆ నిధులను ఇష్టానుసారం ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో పంచాయతీల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2014-19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల ఆదాయం రూ.240కోట్లు ఉంటే 2019-23 సంవత్సరాల్లో కేవలం రూ.170 కోట్లే వచ్చింది. క్షేత్రస్థాయిలో పంచాయతీల ఆదాయం తగ్గిపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణం. కూటమి ప్రభుత్వం పంచాయతీలకు సర్వ స్వతంత్రత తీసుకురావాలనే సంకల్పంతో పని చేస్తోంది. ఆయ గ్రామాల ప్రత్యేకతలను గ్రామ సభల్లో గుర్తించి, నిర్ణయించి వాటిని ప్రమోట్ చేయాలని భావిస్తున్నాం. తయారు చేసే విశిష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎగుమతులు చేసి సంపద సృష్టించే మార్గాలను ఆన్వేషిస్తాం’ అని పవన్ అన్నారు. ‘పంచాయతీల్లో చాలా భూమి నిరుపయోగంగా ఉంటోంది. దాన్ని క్రమ పద్ధతిలో వినియోగించుకోవాలి. స్వచ్ఛ భారత్‌ను మరో మెట్టు ఎక్కించేలా గ్రామ పంచాయతీల్లో ఓ ప్రణాళిక ప్రకారం ఎక్కడా చెత్త లేకుండా క్లీన్, గ్రీన్ గ్రామాలుగా తయారు చేసేలా దృష్టి పెడుతున్నాం. పంచాయతీలకు సంబంధించి వృథాగా ఉన్న స్థలంలో కలప మొక్కలను పెంచాలని భావిస్తున్నాం. గ్రామాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులను పర్యవేక్షించాల్సిన, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన సామాజిక తనిఖీ విభాగం సక్రమంగా పని చేయలేదు. ఆ విభాగానికి కూడా పోలీస్ అధికారిని హెడ్‌గా పెట్టాలని ఆలోచిస్తున్నాం. పంచాయతీల్లో పెండింగ్‌లో ఉండిపోయిన రూ.2వేల కోట్ల నిధులను కూటమి ప్రభుత్వంలో విడుదల చేశాం. మెటీరియల్ కాంపోనెంట్ గ్రాంట్‌ను త్వరలోనే ఇస్తాం.’
అచ్యుతాపురం ఘటన దురదృష్టకరం..
అచ్యుతాపురం ఘటనపై పవన్ స్పందిస్తూ.. ‘ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. వరుసగా పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎసెన్షియా ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు చేపట్టకపోవడంలో పరిశ్రమకు చెందిన ఇద్దరు యాజమానులు మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలు కూడా ఓ కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఫ్యాక్టరీలో సేఫ్టీ అడిట్ చేయడంపై దృష్టి పెడతాం. సేఫ్టీ ఆడిట్ అంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉంది. వారితో ఒకసారి కూర్చొని మాట్లాడి, తీసుకుంటున్న రక్షణ చర్యలను వివరించాలని కోరతాం. పరిశ్రమల్లో రక్షణపై ప్రత్యేకంగా దృష్టిపెడతా. ఈ నెల చివర్లో విశాఖలో ప్రత్యేకంగా దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తాను. పరిశ్రమల కాలుష్యం మీద నిరంతర నిఘా ఉండేలా, ప్రమాదాలను పూర్తిగా ఆరికట్టేలా శాశ్వత పరిష్కారం చూడాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.
నేడు కోనసీమ జిల్లాకు సీఎం.. గ్రామ సభలో పాల్గొననున్న చంద్రబాబు
సీఎం చంద్రబాబు శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. పంచాయతీ గ్రామ సభలో పాల్గొనే నిమిత్తం ఆయన అక్కడకు వెళ్తున్నారు. జిల్లాలోని కొత్తపేట మండలం వానపల్లి పంచాయతీలో జరిగే గ్రామసభలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఆయన వివిధ అంశాలపై మాట్లాడతారు.
గ్రామ సభల్ని విజయవంతం చేయాలి: పల్లా
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగే గ్రామ సభల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ కోరారు. ‘పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పించనుంది. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామ సభల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’ అని పల్లా సూచించారు.
Also Read:
‘పొత్తు’ లాభం.. ఏపీకి దక్కిన రూ. 2,500 కోట్లు..
సంతకాల కోసం కేసీఆర్, హరీశ్ ఒత్తిడి చేశారు..
సుప్రీంకోర్టులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Aug 23 , 2024 | 10:02 AM