Pawan Kalyan : గ్రామీణ రోడ్లకు మహర్దశ
ABN , Publish Date - Jul 12 , 2024 | 04:43 AM
గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
రూ.4976 కోట్లతో 7213 కి.మీ. రహదారులు
గత ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం
అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కుంటుపడిన పురోగతి
మ్యాచింగ్ గ్రాంట్ తగ్గించేలా కేంద్రాన్ని కోరతాం
ఏఐఐబీ అధికారుల సమీక్షలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకు(ఏఐఐబీ) అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.4976 కోట్ల నిధులతో 7213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారాలు మరింత కోరదామని చెప్పారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మాట్లాడుతూ 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికీ రహదారులు అనుసంధానం చేయాల్సిన అవసరముందని తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యపడుతుందని, నెలకు రూ.200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి ఉంటుందని తెలిపారు. అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.75 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ సమకూరిస్తే బ్యాంకు రూ.125 కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందని బ్యాంకు అధికారులు పవన్ కల్యాణ్‌కు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. అందువల్లే గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుపడిందన్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన రహదారులు అందుబాటులోకి వచ్చేవని, తద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యపడేవన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు ద్వారా రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగేలా చూడాల్సిన బాధ్యత తాము తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలన్నారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్‌లో ప్రత్యేక కాలమ్ పొందుపరచాలన్నారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌ను 10 శాతానికి తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. సమావేశంలో ఏఐఐబీ అధికారులు పర్హాద్ అహ్మద్, అశోక్‌కుమార్, శివరామకృష్ణ శాస్త్రి, పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బాలూ నాయక్, ఏపీఆర్‌పీ అధికారులు సీవీ సుబ్బారెడ్డి, పీవీ రమణ పాల్గొన్నారు.