Pawan Kalyan : వ్యర్థాల నిర్వహణకు ‘స్వచ్ఛంద’ సహకారం
ABN, Publish Date - Jul 08 , 2024 | 03:33 AM
రోజురోజుకు పెరిగిపోతున్న ఘన, ద్రవ వ్యర్థాలతో గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రమవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో కార్యాచరణ అమలు
అధికారులకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రోజురోజుకు పెరిగిపోతున్న ఘన, ద్రవ వ్యర్థాలతో గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రమవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంతో వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎల్‌ఆర్‌ఎం ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసన్ ఆదివారం మంగళగిరిలో ఉపముఖ్యమంత్రిని కలిసి గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణపై నివేదికను అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు స్థానికసంస్థలతో కలిసి పనిచేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులకు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యాచరణను ప్రత్యేక ప్రణాళిక ద్వారా పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో అమల్లోకి తీసుకురావాలన్నారు. పర్యావరణంపై మక్కువ ఉన్న వారిని ఏకో వారియర్స్‌గా ఎంపిక చేసుకుని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణ, డంపింగ్ యార్డుల విషయంలో పంచాయతీరాజ్, పురపాలక శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. నదీ పరీవాహక ప్రాంతాలు, కాలువలు, చెరువుల వెంబడి చెత్త వేసే విధానాలను ఆపేయాలన్నారు.
Updated Date - Jul 08 , 2024 | 03:33 AM