Andhra Pradesh: పోలీసుల్లో ‘ట్యాపింగ్’ పరేషాన్!
ABN, Publish Date - Mar 11 , 2024 | 09:44 AM
Phone Tapping: పొరుగు రాష్ట్రం తెలంగాణలో గత సీఎం కేసీఆర్ (KCR) హయాంలో ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ (Phone Tapping) జరగడంపై విచారణ ఊపందుకుంది. దీనిని నిర్ధారించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును సస్పెండ్ చేసింది. అయితే, ఈ వ్యవహారం ఏపీలోనూ కలకలం రేపింది.
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి):
పొరుగు రాష్ట్రం తెలంగాణలో గత సీఎం కేసీఆర్ (KCR) హయాంలో ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ (Phone Tapping) జరగడంపై విచారణ ఊపందుకుంది. దీనిని నిర్ధారించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును సస్పెండ్ చేసింది. అయితే, ఈ వ్యవహారం ఏపీలోనూ కలకలం రేపింది. ముఖ్యంగా రాష్ట్ర పోలీసులు ‘ఫోన్ ట్యాపింగ్’ అంటేనే వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా అధికార పార్టీ పెద్దల ఒత్తిడికి తలొగ్గి ట్యాపింగ్ సహా చాలా చేస్తున్నామని.. రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు. ‘‘అయిందేదో అయిపోయింది. వారం రోజుల్లో ఎన్నికల కోడ్ రానుంది. బీజేపీ మద్దతుతో ప్రతిపక్షం ముందుకు వెళుతోంది. లేనిపోని ఇబ్బందులు మనకెందుకు’’ అంటూ ప్రైవేటు సంభాషణల్లో ఏపీ పోలీసులు మాట్లాడుకుంటున్నారు. మరికొందరు, ‘‘మేం ఎలాగూ మునిగాం. ప్రభుత్వం మారితే కష్టాలు ఎలాగూ తప్పవు. అయినా చేయగలిగింది లేదు’’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీసులను కలవర పెడుతుండడం గమనార్హం.
తెలంగాణలో ఏం జరిగింది?
తెలంగాణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకుంది. వాస్తవానికి ‘ఎస్‌ఐబీ’ అంటే మావోయిస్టుల ఉనికి, కదలికలు తెలుసుకునే విభాగం. అధునాతన టెక్నాలజీని వినియోగించి మావోయిస్టు సానుభూతి పరుల ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం వీరికి ఉంటుంది. కానీ, గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎస్పీ ప్రణీత్‌రావు అధికార పార్టీ బీఆర్‌ఎస్ ఆదేశాలతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, పాత్రికేయుల ఫోన్లు కూడా రికార్డు చేయించారు. ఎవరితో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని గత ప్రభుత్వ పెద్దలకు చేరవేశారు. ఇలా తమకు మేలు చేసిన ప్రణీత్‌రావును కేసీఆర్ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. ఎస్‌వోటీ అధిపతిగా నియమిస్తూ ప్రత్యేక పదోన్నతి కల్పించింది. అయితే, మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ట్యాపింగ్ పాపాలు బయటకు వస్తాయని భావించిన ప్రణీత్‌రావు ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వచ్చి ఎస్‌వోటీ రూమ్‌లో తాను రికార్డు చేసిన వన్నీ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ప్రణీత్‌ను బదిలీ చేసి విచారణ చేయడంతో గుట్టు రట్టయింది. 45 హార్డ్ డిస్క్‌లు నాశనం చేసి కొత్తవి పెట్టారని, సెల్లార్‌లో వేల రికార్డులు తగుల పెట్టారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే.. తన పైఅధికారి ప్రభాకర్‌రావు చెప్పినట్లే చేశానని, తాను సొంతంగా ఏమీ చేయలేదని ప్రణీత్ రావు చెబుతున్నా తప్పించుకునే పరిస్థితి మాత్రం లేదు. గవర్నర్ తమిళ సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది నిజమని తేలితే తెలంగాణ డీఎస్పీతోపాటు ఆయన వెనకున్న పెద్దలకు సైతం టెలిగ్రాఫ్ చట్టం కింద చర్యలు తప్పవు.
ఏపీలో భయం ఇందుకే!
ఏపీలో బీజేపీ–టీడీపీ–జనసేన కూటమిగా జట్టు కట్టడంతో వైసీపీ ఓటమి ఖరారైందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎప్పుడైతే ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి పొత్తు ప్రకటన అధికారికంగా వచ్చిందో అప్పటి నుంచి పోలీసు అధికారుల్లో మార్పు వచ్చేసింది. ఓడిపోయే నాయకుడి కోసం ఏదో చేసి చిక్కుకు పోవడం కన్నా పూర్తిగా దూరంగా ఉంటే మంచిదనే నిర్ణయానికి వచ్చేశారు. అడ్డగోలుగా జగన్ కోసం పనిచేసే కొందరు అధికారులు ప్రైవేటు హ్యాకర్స్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసు శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ప్రభుత్వం మారితే వీరిపై చర్యలు తప్పవనే చర్చ సాగుతోంది. ఇప్పుడు వెలుగు చూసిన తెలంగాణ డీఎస్పీ ప్రణీత్‌రావు ఉదంతం వీరికి కూడా అన్వయం అవుతుందని చెబుతున్నారు. అందుకే ఏపీ పోలీసులు కొందరు భయంతో ఉన్నారని సమాచారం.
ఇవీ ఉదాహరణలు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఏడాది కిందట నిఘా విభాగం అధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. పాత మిత్రుడితో శ్రీధర్ రెడ్డి మాట్లాడిన మాటలే అందులో ఉన్నాయి. దీంతో కోటంరెడ్డి అవతలి వ్యక్తికి ఫోన్ చేసి ‘నువ్వు నా వాయిస్ రికార్డు చేశావా?’ అని అడిగారు. లేదని అవతలి వ్యక్తి చెప్పడంతో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించారు. మీడియా ముందు ఈ విషయాన్ని వివరించడంతోపాటు కేంద్ర హోంశాఖకు సైతం ఫిర్యాదు చేశారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన ఫోను ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 2022 డిసెంబరులో ఫిర్యాదు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, అప్పటి సీఐడీ అధిపతి పీవీ సునీల్ కుమార్ తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో కేంద్ర హోంశాఖకు పార్లమెంటు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలా.. ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, పాత్రికేయుల ఫోన్లు కూడా రాష్ట్రంలో ట్యాపింగ్ జరుగుతున్నట్లు పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటికీ ఇక బ్రేక్ వేయాలని పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో వెలుగు చూసిన ప్రణీత్ రావు ఉదంతమే.
Updated Date - Mar 11 , 2024 | 09:45 AM