AP Elections: ఏపీలో మోదీ పర్యటనపై తెలు‘గోడు’ ఆసక్తి.. వరాలు ఉంటాయా..!?
ABN , Publish Date - May 06 , 2024 | 02:27 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి ఇంకా గడువు.. రోజుల్లో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి హోరెత్తించేస్తున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ సైతం ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. సోమవారం రాజమహేంద్రవరంతోపాటు అనకాపల్లి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేష్‌కు మద్దతుగా ప్రధాని ప్రచారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి ఇంకా గడువు.. రోజుల్లో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి హోరెత్తించేస్తున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ సైతం ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. సోమవారం (మే-06న) రాజమహేంద్రవరంతోపాటు అనకాపల్లి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేష్‌కు మద్దతుగా ప్రధాని ప్రచారం చేయనున్నారు.
ఇందులోభాగంగా మోదీ ప్రసంగంపై తెలుగు వాడిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి రాజధాని లేదు.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు.. పరిశ్రమలు అస్సలే లేవు.. ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే.. దేశ చిత్ర పటంలోనే ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలో సైతం అగ్రస్థానంలో ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇవన్నీ కాదు ఒక్క మాటలో చెప్పాలంటే.. అల్లకల్లోల్లంగా తయారైంది.
మోదీ వస్తున్నారు సరే..?
దేశంలో ఏ రాష్ట్రంలో లేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నాయంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అదే మోదీ మాటల్లో చెప్పాలంటే.. రాష్ట్ర విభజన చేసి తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ.. సాక్షాత్తూ పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై పలు సందర్బాల్లో దుమ్మెత్తి పోసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
మరి అలాంటి బిడ్డ.. అంటే రాష్ట్రానికి వస్తున్న మోదీ.. ఆంధ్రప్రదేశ్ పునర్ వైభవానికి తన వంతుగా ‘నేను సైతం’ అన్నట్లుగా రాష్ట్రం కోసం.. ప్రజల బాగు కోసం ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా? అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ.. తెలుగోడి ఆత్మ బలిదానాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోయిందంటూ ఇప్పటికే ప్రచారం హోరెత్తిపోతుంది.
ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి కూతవేటు దూరంలో అంటే.. అనకాపల్లిలోనే మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. మరి దీనిపై మోదీ ఎలా స్పందిస్తారని తెలుగు వాడు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాడు.
షా ఇలా.. మోదీ ఎలా..?
ఆదివారం నాడు ఉమ్మడి అనంతరపురం జిల్లాలోని ధర్మవరంలో ‘ప్రజాగళం’ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వేదికను పంచుకున్నారు. బహిరంగ సభలో భాగంగా.. షా మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై పదునైన విమర్శల దాడికి దిగారు.
పోలవరం నిర్మాణం ఆలస్యానికి జగన్ ప్రభుత్వమే కారణమని ఒకింత ఆగ్రహమే వ్యక్తం చేశారు. తెలుగు భాషను అణగదొక్కేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ.. జగన్‌పై షా నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరతాయని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పోలవరం ప్రాజెక్ట్ రెండేళ్లలో పూర్తి చేస్తామని.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తోడ్పాటునందిస్తామన్నారు. మరి మోదీ నోట ఇప్పుడు ఎలాంటి హామీలు.. వరాల జల్లు ఉంటుందని తెలుగోడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇదివరకే ఏపీ పర్యటనకు విచ్చేస్తున్న మోదీ.. జగన్ రెడ్డిని పల్లెత్తి మాట కూడా అనని మోదీ ఈసారైనా కనీసం పేరెత్తి అయినా మాట్లాడుతారా అనేది చూడాలి మరి.
Bomb Threat: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు..
Read Latest National News And Telugu news