Prakasam: ఆ జిల్లాలో వరస భూప్రకంపనలు.. గుట్టు విప్పాలంటూ మంత్రులు ఆదేశం..
ABN, Publish Date - Dec 22 , 2024 | 08:34 PM
భూప్రకంపనలపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar), డోలా బాలవీరాంజనేయస్వామి(Dola Bala Veeranjaneya Swamy) ఆరా తీరారు. దర్శి నియోజకవర్గంలో భూప్రకంపనలు రావడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌తో ఇరువురు మంత్రులూ మాట్లాడారు.
ప్రకాశం: జిల్లాలో వరస భూప్రకంపనల(Earthquakes)తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శని, ఆదివారాల్లో సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో రెండుసార్లు ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో అర్థం జిల్లావాసులు వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరస భూప్రకంపనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
భూప్రకంపనలపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar), డోలా బాలవీరాంజనేయస్వామి (Dola Bala Veeranjaneya Swamy) ఆరా తీరారు. దర్శి నియోజకవర్గంలో భూప్రకంపనలు రావడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌తో ఇరువురు మంత్రులూ మాట్లాడారు. ఘటనపై కలెక్టర్‌ని అడిగి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. తరచుగా ఆ ప్రాంతంలో ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కలెక్టర్‌ని ఆదేశించారు. అవసరమైతే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలతోనూ చర్చించి విషయం గురించి పూర్తిగా సమాచారం సేకరించాలని సూచించారు. భూ ప్రకంపనలపై సమగ్ర నివేదిక తయారు చేసి తమకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ధైర్యంగా ఉండాలని, భయభ్రాంతులకు గురికావొద్దని మంత్రులు ధైర్యం చెప్పారు.
గత రెండ్రోజులు ఏం జరిగింది..
ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో శనివారం నాడు రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ముండ్లమూరు, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తాళ్లూరు, శంకరాపురం, పోలవరం, గంగవరం, తూర్పుకంభంపాడు, శంకరాపురం, రామభద్రాపురంలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు సైతం ప్రాణభయంతో పరుగులు పెట్టారు. రెండు సెకన్లపాటు భూమి కంపించడంతో ఇళ్లల్లోని వస్తువులు సైతం కదిలిపోయాయని స్థానికులు చెప్పారు.
అయితే ఆదివారం రోజూ ఇదే పరిస్థితి తలెత్తింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో సెకనుపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు మళ్లీ ఇళ్ల నుంచి పరుగులు తీశారు. వస్తువులు సైతం కదిలిపోవడంతో ప్రాణ భయంతో కేకలు వేశారు. గడిచిన 24 గంటల్లో రెండుసార్లు జిల్లాలో భూప్రకంపనలు రావడంతో జిల్లావాసులు వణికిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. దీంతో కలెక్టర్‌కు ఫోన్ చేసిన మంత్రులు వివరాలు తెలుసుకున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Devansh: ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్..
Kuppam: చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ధైర్యం చెప్పిందే వారే: నారా భువనేశ్వరి..
Updated Date - Dec 22 , 2024 | 08:36 PM